తెలంగాణ

పన్ను చెల్లింపులతోనే ఆర్థిక లావాదేవీలకు చట్టబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 23: పన్ను చెల్లింపులను సక్రమంగా జరిపినప్పుడే ఆర్థిక లావాదేవీలకు చట్టబద్ధత చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మెగ్వాల్ అన్నారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన డిజి ధన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ జనాభా 125కోట్లు ఉంటే, వారిలో కేవలం 24 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, ఇది 1 శాతానికే పరిమితమవుతోందని అన్నారు. మరో 23.2 శాతం మంది పన్నులు చెల్లించకుండా ఎగవేత ధోరణిని అవలంభిస్తున్నారని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందన్నారు. హైదరాబాద్ వంటి చిన్నచిన్న నగరాల్లోనూ పది లక్షల పైచిలుకు ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారి సంఖ్య పది లక్షల వరకు ఉందని, పన్నులు చెల్లిస్తున్న వారి సంఖ్య మాత్రం దేశ వ్యాప్తంగా 24 లక్షలేనని పేర్కొన్నారు. ఇలా సక్రమంగా పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వ ఖజానాకు రాబడి ఎలా సమకూరుతుందని ఆయన ప్రశ్నించారు. ఆదాయం పెరిగినప్పుడే ప్రజలకు వౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ఆస్కారం ఉంటుందని, రోడ్లు, రైల్వే నెట్‌వర్క్‌ల విస్తరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశంలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే వారంతా సక్రమంగా పన్నులు కడితే, మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని అన్నారు. డిజిటల్ లావాదేవీలను కొంతమంది విమర్శనాత్మక ధోరణితో చూస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. పారదర్శకంగా పన్నుల చెల్లింపులు జరగాలనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా భారత్ వడివడిగా అడుగులు ముందుకేస్తోందని చెప్పారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందని ప్రశంసించారు. ఈ విధానం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయనే విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడాలని హితవు పలికారు. నగదు రహితం వైపు ప్రజలను, వ్యాపార వర్గాల వారిని ప్రోత్సహించేందుకు వీలుగా గత డిసెంబర్ 25వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా 100 పట్టణాల్లో డిజి ధన్‌మేళాలు నిర్వహిస్తూ లక్కీ డ్రా ద్వారా ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన డిజి ధన్‌మేళా ఏర్పాట్లు బాగున్నాయని జిల్లా కలెక్టర్ యోగితారాణాతో పాటు, స్థానిక అధికారులను అభినందించారు. అంతకుముందు మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి మెగ్వాల్ ఎంతో ఆసక్తిగా తిలకించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్న వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి, విజేతలకు వారి ఖాతాల్లో ప్రోత్సాహక నగదును జమ చేశారు. డిజిటల్ లావాదేవీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న పలు గ్రామాల సర్పంచ్‌లు, సచివాలయ కార్యదర్శులకు అవార్డులు బహూకరించారు. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులను సంప్రదించి సుమారు వందకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ధన్ మేళాలో అవగాహన నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడంతో పాటు బ్యాంకు ఖాతాలు తెరువడం, ఆధార్‌తో అనుసంధానం, పేర్లు, చిరునామాను సరి చేసుకోవడం వంటి సేవలందించారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు చెందిన సుమారు 15 వేల మంది డిజి ధన్ మేళాను సందర్శించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ డైరెక్టర్ జుగల్‌కిశోర్ శర్మ, సాఫ్ట్‌నెట్ సిఇఓ శైలేష్‌రెడ్డి, కలెక్టర్ యోగితారాణా, నగర మేయర్ ఆకుల సుజాత, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రసంగింస్తున్నకేంద్ర మంత్రి అర్జున్‌రాం మెగ్వాల్