తెలంగాణ

వ్యూహాలకు పదును!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస శాసనసభ పక్షం, శాసనమండలి పక్షాలకు దిశ నిర్దేశం చేయడానికి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో సిఎం కె చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. సమావేశానికి ఎంపీలు సైతం హాజరుకావాల్సిందిగా కెసిఆర్ ఆహ్వానించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించడం, 13న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అంశాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సిఎం వివరించనున్నారు. బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నప్పటికీ విపక్షాలు ఏదోరకంగా ప్రభుత్వం ఏదోకవిధంగా నిందలు గుప్పించే అవకాశం ఉన్నందున, వాటిని ఏవిధంగా తిప్పికొట్టాలి, విపక్షాలపై ఏరకంగా ఎదురుదాడి చేయాలన్న వ్యూహంపై సభ్యులకు సిఎం దిశనిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ పద్దులపై జరిగే చర్చలో విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టడానికి మంత్రులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని సిఎం సూచించనున్నట్టు తెరాస వర్గాల సమాచారం. ఇలావుండగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం కూడా గురువారం సమావేశం కాబోతుంది. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోన్నా ఇచ్చిన హామీలు, బడ్జెట్‌లో ప్రతిపాదించిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందడాన్ని సభలో ఎండగట్టనున్నట్టు కాంగ్రెస్ శాసనసభ పక్షం ఉప నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తామన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం ఇంకా ప్రారంభం కాకపోవడం, దళితులకు ఉచితంగా 3 ఎకరాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడం, నియోజకవర్గానికి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్న హామీ కార్యరూపం దాల్చకపోవడం తదితర అంశాలను ప్రధానంగా సభలో ప్రస్తావించనున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఉభయ సభల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం జరిగే సిఎల్‌పి సమావేశాన్ని ఉద్దేశించి దిగ్విజయ్ మాట్లాడుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై బిజెపి శాసనసభా పక్షం బుధవారం సమావేశమై చర్చించింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేయనున్న ప్రసంగానికి ముందే టిటిడిపి పక్షం గురువారం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని యథాతథంగా చదవకుండా ప్రభుత్వం ఇచ్చే సమాచారంలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోవాలని గవర్నర్‌ను కోరాలని టిటిడి శాసనసభ పక్షం నిర్ణయించింది. ఇలా ఉండగా బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సంబంధిత అధికారులు, శాసనసభ సచివాలయ అధికారులతో స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ బుధవారం సమావేశమై చర్చించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ బుధవారం మధ్యాహ్నం శాసనసభకు వచ్చి స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభ కార్యదర్శి రాజాసదరామ్‌తో సమావేశమయ్యారు.
మంత్రిమండలి సమావేశం ఉండదు
శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రిమండలి సమావేశమై సభలో చర్చించే అంశాలపై చర్చించడం అనవాయితీ. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదించాల్సి ఉంది. అయితే ఈ సారి మంత్రిమండలి సమావేశం కాకుండానే గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలపడానికి సర్క్యులర్ విడుదల చేయనున్నట్టు సమాచారం.