రాష్ట్రీయం

మీడియా విశ్వసనీయత కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: జర్నలిస్టులపై సమాజానికి ఉన్న విశ్వసనీయత పోతే దేశానికి చీకటిరోజులు వచ్చినట్టేనని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సికె ప్రసాద్ పేర్కొన్నారు. ‘సమకాలీన జర్నలిజంలో నైతిక విలువలు’ అంశంపై హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన సదస్సులో కీలకోపన్యాసం చేస్తూ, జర్నలిజం విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులు, మీడియా యాజమాన్యాలపై ఉందన్నారు. పాత్రికేయులు కానీ, యాజమాన్యం కానీ జర్నలిజాన్ని వ్యాపారంతో ముడిపెట్టవద్దని కోరారు. అలా ముడిపెట్టడం వల్ల దుష్ఫలితాలు వస్తాయని, ‘ఫ్రీడం ఆఫ్ ప్రెస్’ అన్న అంశానికి విలువ లేకుండా పోతుందని హెచ్చరించారు.
మీడియా ఏ దశలో కూడా ప్రభుత్వంతో లాలూచీ పడవద్దని, ప్రజల పక్షంలో ఉంటూ ప్రభుత్వం తీసుకునే తప్పుడు విధానాలను తూర్పార బట్టాలన్నారు. ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. ప్రభుత్వంతో ఎల్లవేళలా ఘర్షణ వైఖరితో మీడియా ఉంటేనే సమాజానికి ఉపయోగకరమని వివరించారు. జర్నలిస్టులకు ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కాండక్ట్) ఉండాలని, లేనిపక్షంలో జర్నలిస్టులకు, జర్నలిజానికి ‘హాని’ జరుగుతుందన్నారు. న్యాయపరమైన అంశాలపై జర్నలిస్టులకు అవగాహన ఉండాలని సూచించారు. ‘సత్ప్రవర్తన’-‘దుష్ప్రవర్తన’ల మధ్య తేడా తెలిసి ఉండాలని హితవు పలికారు. ఎవరి అభిప్రాయాలనైనా ఉన్నది ఉన్నట్టుగానే వార్తగా రాయాలని, వాటిని వక్రీకరించడం మంచిది కాదన్నారు. ఇటీవల ఒక కేంద్ర మంత్రి హర్యానాలో ‘దళితులకు వ్యతిరేకంగా’ మాట్లాడారని వార్తగా వచ్చిందని, ఈ వార్తకు స్పందనగా భారీగా నిరసన వ్యక్తమైందని గుర్తు చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేస్తే, సదరు మంత్రి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తేలిందన్నారు. ఏ ఒక్క వ్యక్తిని బదనాం చేసే అధికారం, హక్కు జర్నలిస్టులకు లేదని స్పష్టం చేశారు. పాత్రికేయులు ఎడిటర్ పరిధిలోనే పనిచేయాలి తప్ప, సంబంధిత మీడియా మేనేజర్లు చెప్పినట్టు నడుచుకోవద్దన్నారు. మీడియాలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం వర్తిస్తుందని చైర్మన్ ప్రసాద్ స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ విధానమే మంచిది కాదన్నారు. ఖచ్చితత్వం (అక్యురసీ), స్వతంత్రత (ఇండిపెండెన్స్), పక్షపాతం లేకపోవడం (ఇంపార్షియల్), మానవత్వం (హ్యుమానిటీ), జవాబుదారీతనం (అకౌంటబిలిటీ) అనే పంచ సూత్రాలను ప్రతీ జర్నలిస్టు పాటించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా కౌన్సిల్ ఉండాలని సీనియర్ పాత్రికేయుడు కె. శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, వెటరన్ జర్నలిస్టుల సంఘం, మీడియా ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా (ఎంఇఎఫ్‌ఐ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పిసిఐ మరోసభ్యుడు ఎస్.ఎన్. సిన్హా, డి. అమర్, అమర్‌నాథ్ తదితరులు మాట్లాడారు.

చిత్రం..‘సమకాలీన జర్నలిజంలో నైతిక విలువలు’ అనే అంశంపై హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో
గురువారం జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ సికె ప్రసాద్