తెలంగాణ

హోం శాఖ పటిష్ఠతకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనాపరంగా వస్తున్న మార్పులు, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పరిపాలనలో కీలకమైన పోలీసు శాఖ, అంతర్గతంగా ఉన్న నిఘా విభాగాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్‌లో శాంతిభద్రతల పరిపాలన నిమిత్తం రూ. 4890 కోట్లను కేటాయించింది. రాజధాని హైదరాబాద్ నగరం విస్తరించడం, జిల్లాల్లో కొత్త కమిషనరేట్ల ఏర్పాటుతో నిఘా విభాగాన్ని విస్తరించాలని నిర్ణయించింది. రెండుగా విభజించబడిన సైబరాబాద్ కమిషనరేట్‌తో పాటు రామగుండం, సిద్ధిపేట, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కొత్తగా ప్రాంతీయ నిఘా కార్యాలయాలను స్థాపించేందుకు హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తద్వారా రహస్య నిఘా వ్యవస్థను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేందుకు యోచిస్తోంది. శాంతిభద్రతలను కాపాడేందుకు కీలకమైన నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సంఘ విద్రోహుల ఆటకట్టించేందుకు కూడా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐఎస్‌ఐ, మత చాందసవాద కార్యకలాపాలు, ఆంతరంగిక పరిణామాలను ముందుగానే పసిగట్టేందుకు వీలుగా ప్రాంతీయ నిఘా కార్యాలయాల స్ధాపన అవసరమని ప్రభుత్వం గుర్తించింది. హోంశాఖలో కీలకమైన మరో విభాగం అగ్నిమాపక విభాగాన్ని కూడా ఆధునీకరించి ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక కేంద్రాలను పెంచేందుకు నిర్ణయించింది. మెదక్ జిల్లా గజ్వేల్, దుబ్బాక, పెద్ద శంకరంపేట, నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాలను ఈ ఏడాది ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 96 అగ్నిమాపక కేంద్రాలు, 16 ఔట్‌పోస్టు అగ్నిమాపక కేంద్రాలు పని చేస్తున్నాయి. హోంశాఖ పర్యవేక్షణలో కొత్తగా పోలీసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ కింది స్థాయి పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తోం ది. దీనికి తోడుగా పోలీసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి పోలీసింగ్ నిర్వహణ, అంతర్గత భద్రత వ్యవస్థల్లో కీలక అంశాలు, శాంతిభద్రతలు, చట్టాలు వంటి అంశాల్లో డిగ్రీ, పిజి స్థాయి కోర్సులను ఏర్పా టు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. కాగా మాజీ సైనికుల సంక్షేమానికి హోంశాఖ గత బడ్జెట్‌లో ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో నాలుగు సమీకృత సైనిక భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, ఈ ఏడాది కొత్తగూడెం, హైదరాబాద్‌లో సమీకృత సైనిక భవనాల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది. తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పిఎఫ్)కు అవసరమైన శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని షేక్‌పేట మండల పరిధిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 1991 నుంచి ఎస్‌పిఎఫ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రక్షణ దళానికి శిక్షణ అకాడమీని ఏర్పాటు చేసేందుకు మెదక్ జిల్లా ఆమీన్‌పూర్‌లో 70 ఎకరాలను కేటాయించింది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి విభాగాలకు భద్రతను కల్పిస్తామని హోంశాఖ పద్దులో ప్రభుత్వం పేర్కొంది.