తెలంగాణ

నష్టపోయన రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, మార్చి 19: అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన బాధిత రైతులను ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం జహీరాబాద్ ఎంపి బిబి.పాటిల్ తదితరులతో కలిసి మంత్రి పోచారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం గ్రామ శివార్లలో వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మంత్రితో తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పులు చేసి మరీ పంటలు వేసుకున్న తమ పరిస్థితి దైన్యంగా మారిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి పోచారం మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకునే శక్తి ఎవరికీ లేనప్పటికీ, అకాల వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పంట చేతికొచ్చే దశలో నేల పాలయితే రైతులు ఎంతగా ఆవేదన చెందుతారో ఒక రైతుగా తాను అర్ధం చేసుకోగలనని, పంట నష్టం నివేదికలు అందగానే ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చించి బాధితులకు తప్పనిసరిగా తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పరిస్థితులు అనుకూలించడంతో రైతులు పెద్దఎత్తున పంటల సాగు చేపట్టారని, మరో పక్షం రోజుల్లో పంట చేతికందడం ప్రారంభమయ్యేదని, ఇలాంటి పరిస్థితుల్లో నోటికాడి కూడు నేలపాలవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. పంట నష్టంపై ఇప్పటికే అధికారులను పురమాయించి నివేదికలు తయారు చేయిస్తున్నామని, పూర్తి స్థాయి నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తానని అన్నారు. అధికారులు నిజాయితీగా వ్యవహరించి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పంటలు కోల్పోయిన బాధిత రైతులను గుర్తించి సమగ్ర వివరాలతో నివేదికలు తయారు చేయాలన్నారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం ఇప్పిస్తామని, ఈ విషయంలో పట్టాదారు రైతులు మానవత్వంతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. పెట్టుబడులు పెట్టి నష్టపోయిన కౌలు రైతులకే న్యాయంగా నష్టపరిహారం అందాలన్నారు. ఫసల్ బీమా యోజన ఉన్న రైతులకు వెంటనే బీమా ప్రక్రియను ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా బీమా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేవలం పంటలే కాకుండా నివాసపు ఇళ్లు కోల్పోయిన బాధితులకు కూడా తక్షణమే నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. వడగళ్ల వానలు కురిసి పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని 100 నుండి 150 రోజులకు పెంచి అందరికీ పని కల్పించాలని మంత్రి పోచారం ఆదేశించారు.

చిత్రం..బాన్సువాడ మండలం కొల్లూరులో అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న మంత్రి పోచారం