రాష్ట్రీయం

కేటాయింపులు ఘనం..అమల్లో అంతంతమాత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ. 2450 కోట్ల నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో ఘనంగా నిధులను కేటాయించి, లక్ష్యాలను కూడా అదేస్థాయిలో నిర్దేశించుకున్నా అమల్లో మాత్రం సగానికి సగం సాధించలేకపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 5806 చెరువుల మరమ్మత్తుకు రూ. 1887.90 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మిషన్ కాకతీయకు మొత్తం 20వేల కోట్ల నిధులు అవసరమని అంచనా. 2016-17లో రూ. 1397.59 కోట్ల నిధులు కేటాయించారు. 2015-16లో రూ.1247.22 కోట్లను మంజూరు చేశారు. ఇంతవరకు రూ. 1133.17 కోట్లు ఖర్చు పెట్టారు.
ప్రతి ఏడాది 20 శాతం చెరువులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రానున్న ఐదేళ్లలో 46,531 చెరువులను ప్రజలకు వినియోగంలోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. చిన్నతరహా సాగునీటి శాఖ 2015-16 బడ్జెట్‌లో సవరించిన అంచనాలతో రూ.2295.53 కోట్లతో భారీగా పొందుపర్చినా 2016 ఫిబ్రవరి నాటికి చేసిన ఖర్చు మాత్రం సగానికి సగం రూ.1133.17 కోట్లు మాత్రమే చేసింది. ఇక 2016-17 వార్షిక బడ్జెట్‌లో చిన్న తరహా సాగునీటి పద్దు కింద రూ.2255.59 కోట్లతో అంచనాలను రూపొందించి సాగునీటి పారుదల శాఖ శాసనసభ ముందు ప్రవేశపెట్టింది.
బడ్జెట్‌లో పొందుపర్చిన అంశాలను బట్టి ప్రభుత్వం రాష్ట్రంలో 25.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మంచి ఉద్దేశ్యంతో 46,531 చిన్నతరహా సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా చేసుకుంది. అంతేస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 9 అనావృష్టి పీడిత జిల్లాల్లో సుమారు 11.5 లక్షల రైతులకు ప్రయోజనం కలిగే విధంగా చెరువుల ద్వారా సేద్యం ప్రోత్సహించే విధంగా మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2015-16లో 10,154 చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 2015-16లో చేపట్టాల్సిన లక్ష్యం 50 శాతం మిగిలిపోయినా, గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ స్కీంను విజయవంతంగా అమలుపరుస్తున్నట్లే భావించాల్సి ఉంటుంది.
ఆర్‌ఐడిఎఫ్ సిఇ, టిఎస్‌ఐడిసి కలిపి రూ.400 కోట్లు, ఎన్‌ఎస్‌సి సిఇకి, చిన్న నీటిపారుదల శాఖకు రూ.1499.59 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌తో కలుపుకుని ఎఐబిపి సిఇ, చిన్న నీటిపారుదల శాఖకు రూ.175.41 కోట్లు, టిఎస్‌ఐడిసికి రూ.24.59 కోట్లు కలిపి మొత్తం రూ.2255.59 కోట్లతో బడ్జెట్ అంచనాలను శాసనసభ ముందు ఉంచింది. కాగా తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఐడిసి) ద్వారా వివిధ పథకాల కింద సమకూరిన నిధులతో చిన్న, సన్నకారు మెట్టప్రాంతాల రైతులకు ఎత్తిపోతల సాగునీటి పథకాలను అమలు చేస్తోంది. 2015-16లో 40,043 ఎకరాల సాగునీటి సామర్ధ్యాన్ని కల్పించడానికి 31 ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకోగా 2016 ఫిబ్రవరి 28 నాటికి కేవలం 2509 ఎకరాలకు సాగునీటి సామర్ధ్యాన్ని సాధించినట్లు చిన్నతరహా నీటి సంస్థ వెల్లడించింది. 2016-17లో 50030 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించి 26 ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడానికి, 5473 ఎకరాల ఆయకట్టు కోసం 38 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, పునఃనిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రానికి మరో జల వనరుగా భావించే భూగర్భజల శాఖలో అత్యంత సంక్ష్లిష్ట పరిస్థితి నెలకొంది. భూమి యొక్క రీచార్జ్ మీద భూగర్భ జలాలు ఆధారపడి ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యత అందుబాటులో లేదు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. తక్కువ వర్షపాతం, బోరుబావుల తవ్వకం విపరీతంగా పెరగడం వల్ల భూగర్భజలాల స్థాయి గణనీయంగా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2016-17లో బోరు బావుల తవ్వకానికి 9400 అనువైన స్థలాలను గుర్తించినట్లు తెలిపింది. హైడ్రాలజీ ప్రాజెక్టు 3వ దశ కింద భూగర్భ జల విభాగానికి రూ.70 కోట్లు కేటాయించింది.