తెలంగాణ

నల్లగొండ జడ్పీలో ప్రొటోకాల్ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 19: రైతు సమస్యలు, వేసవి తాగునీటి ఎద్దడి వంటి ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చకు వేదిక కావాల్సిన నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రొటోకాల్ వివాదంతో గాడితప్పి మంత్రి జి.జగదీష్‌రెడ్డి, సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. సమావేశం ప్రారంభం కాగానే వేసవి మంచినీటి ఎద్దడి నివారణ చర్యలను జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఈ పాపారావు సభ్యులకు వివరిస్తున్న క్రమంలో కోమటిరెడ్డి జోక్యం చేసుకుని ఉదయసముద్రం రిజర్వియర్ కృష్ణా మంచినీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తో పాటు ఇతర కృష్ణా మంచినీటి పథకాల మోటార్లను 14 ఏళ్లుగా మార్చకపోవడంతో తరుచూ కోట్ల రూపాయాలు మరమ్మతుకు ఖర్చు చేస్తున్నారన్నారు. మోటార్ల మార్పు కోరుతూ తాను సిఎం కెసిఆర్‌కు సమస్యను వివరించగా మిషన్ భగీరథ నిధుల నుండైనా మోటార్ల మార్పుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి సూచించారన్నారు. దీనిపై ప్రతిపక్ష నేతనైతనైన తాను అడిగితే మార్చాలా అనుకుంటూ తనపై కోపంతో మంత్రి అందుకు చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని అధికార పార్టీగా మీది మరికొంత కాలమే నడుస్తుదంటూ వ్యాఖ్యానించారు. ప్రొటోకాల్ విషయమై మీరు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని నల్లగొండ ఆర్డీవో కార్యాలయం గేటును తోసుకుని ప్రారంభోత్సం చేసిన చరిత్ర నీదని మంత్రి జగదీష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఇదే సమయంలో ఎంపిపిలు తమ కు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి నిధులు లేవని తమకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నినాదాలకు దిగారు. వారికి మద్దతుగా మాట్లాడిన కోమటిరెడ్డి నాగార్జునసాగర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో ఆసుపత్రి పరిధిలో లేని మండలాల అధికార పార్టీ జడ్పీటిసిలను సభ్యులుగా చేర్చి పరిధిలో ఉన్న పెద్దవూర కాంగ్రెస్ జడ్పీటిసి కె.లింగారెడ్డిని దూరం పెట్టారని నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తావా ఇలాగైతే ఎలా పనిచేస్తావో చూస్తామంటూ కోమటిరెడ్డి నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను బెదిరింపు ధోరణిలో హెచ్చరించారు. వెంటనే మంత్రి జగదీష్‌రెడ్డి కల్పించుకుని కలెక్టర్‌నే బెదిరిస్తావా.. నీపై ఇప్పటికే కేసులున్నాయంటూ తీవ్ర స్వరంతో కోమటిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. నీ అహంకారాన్ని అణిచివేస్తా... నీ అవినీతి అంతు చూస్తా, నీకంటే వయసులో పెద్దవాడిని, సీనియర్ ఎమ్మెల్యేను... నన్ను దూషిస్తావా ఆర్డీవో కార్యాలయం ప్రారంభోత్సవానికి 18 నెలలుగా నీ సమయం కోసం వేచి ఉండాలా అంటూ కోమటిరెడ్డి ప్రతి విమర్శలకు దిగారు. నీ దగ్గర నేర్చుకునేదీ ఏమీలేదని.. నీకంటే మంచి పరిపాలన అందిస్తున్నామంటూ జగదీష్‌రెడ్డి బదులిచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ జోక్యం చేసుకుని అందరిని వారించి సభను అదుపులోకి తెచ్చి తాగునీటి సమస్యల చర్చలోకి మళ్లించారు. మధ్యలో కోమటిరెడ్డి మళ్లీ తన మాటలను పునరావృతం చేస్తూ మంత్రికి కోపమెక్కువగా ఉందని ఓపిక తక్కువగా ఉందంటూ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే వేముల వీరేశం అభ్యంతరం తెలపడంతో తాగునీటి సమస్యలను ఏకరవు పెట్టిన అనంతరం వెంకట్‌రెడ్డి సమావేశం నుండి వెళ్లిపోయారు. అనంతరం మంత్రి జగదీష్‌రెడ్డి తన ప్రసంగంలో కోమటిరెడ్డి చేసిన విమర్శలను తిప్పికొట్టారు. అందరికంటే ఆలస్యంగా వచ్చి అందరి కంటే ముందే వెళ్లిపోయిన కోమటిరెడ్డి కేవలం మీడియాలో ప్రచారం కోసమే తమపై విమర్శలు చేశారన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘన ముందుగా కోమటిరెడ్డినే పాటించకపోగా కలెక్టర్‌ను, అధికారులను బెదిరించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో కంటే టిఆర్‌ఎస్ పాలనలో పారదర్శంగా రాజకీయ పక్షపాతం లేకుండా ప్రభుత్వ నిధులు, పథకాలు అమలు జరుగుతున్నాయని రాజకీయ ఘర్షణకు ఫుల్‌స్టాప్ పడిందన్నారు.
ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు ఎన్ని గంటలు అందుబాటులో ఉంటున్నారో తాను మంత్రిగా జిల్లాలో రోజుకు ఎన్నిగంటలు తిరుగుతున్నానో ప్రజలకు తెలుసని, తగిన సమయంలో కోమటిరెడ్డికి వారే బుద్ధి చెబుతారన్నారు.