తెలంగాణ

26నుంచి ఉస్మానియా వర్శిటీ శతాబ్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఈ నెల 26 నుండి మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మూడు రోజుల్లో ప్రారంభ వేడుకలు జరుగుతాయని, ఆ తర్వాత ఏడాది కాలంపాటు ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలపై ఉప ముఖ్యమంత్రి సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత పురాతన వర్శిటీల్లో ఏడోదని, దక్షిణాదిలో మూడోదని, ఈ యూనివర్శిటీలో మేధావులు, రాజకీయ నాయకులు, అనేక మంది గొప్పవాళ్లను తన ఒడిలో చదువులు నేర్పి ప్రపంచానికి అందించిందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని యాస, భాష, సంప్రదాయాలతో ఉస్మానియాకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ఉస్మానియా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌లోనే 200 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఈ బడ్జెట్‌తో ఉస్మానియా యూనివర్శిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో కూడా హాస్టళ్ల కొత్త భవనాలు నిర్మించడం, ఉన్న వాటికి మరమ్మతులు చేయడం జరుగుతుందని అన్నారు.
ఉస్మానియా వర్శిటీలో కొత్త సెంటినరీ బ్లాకులు, అకాడమిక్ బ్లాకులు, హాస్టళ్లు, వౌలిక వసతులు రానున్నాయని అన్నారు. ఈ కొత్త నిర్మాణాలకు ఈ నెల26న ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా శంకుస్థాపన చేస్తామని అన్నారు. శతాబ్ది వేడుకలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో పాటు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అతిథులుగా హాజరుకానున్నారని అన్నారు. 27వ తేదీన జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. 28న జరిగే అఖిల భారత విసిల సమావేశానికి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ప్రారంభ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ జనజీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గౌరవ వేతనాల పెంపు, మెస్ ఛార్జీల బకాయిల రద్దు, చార్జీల పెంపు వంటి అనేక సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. ఇప్పటికే బకాయిలన్నింటినీ ముఖ్యమంత్రి రద్దు చేశారని, దాదాపు వంద శాతం వరకూ మెస్ ఛార్జీలు పెంచారని తెలిపారు. గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి మాజీ విసి తిరుపతి రావు ఆధ్వర్యంలో కమిటీ వేశారని, త్వరలోనే వారి నివేదిక మేరకు పెంపు ఉంటుందని అన్నారు. సమీక్షా సమావేశంలో ఎంపి కేశవరావు, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణాచారి, ఉన్నత విద్యామండలి చైర్మన్ టి పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, టూరిజం శాఖ కార్యదర్శి బి వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, విసి రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డి లింబాద్రి పాల్గొన్నారు.

చిత్రం..గురువారం సచివాలయంలో ఉస్మానియా వర్శిటీ శతాబ్ది ఉత్సవాలపై అధికారులతో సమీక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి