జాతీయ వార్తలు

కాస్త మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూసేకరణ చట్టాన్ని తిప్పిపంపిన కేంద్రం

కీలక పదాల్లో మార్పులకు సూచన
అత్యవసరంగా సమావేశమైన సిఎస్
వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
కేంద్రం సూచనలతో మళ్లీ బిల్లు
చట్టం ఆలస్యంపై మల్లగుల్లాలు
నీటిపారుదల శాఖకు పెద్ద దెబ్బ

న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రభుత్వం రూపొందించి ప్రతిపాదించిన భూసేకరణ సవరణ చట్టం 2013ని కేంద్రం తిప్పిపంపింది. చట్టంలో కొన్ని సవరణలు చేపట్టాలని, లేదంటే కోర్టులో నిలిచే అవకాశం లేదని సూచించింది. దీంతో కేంద్రం సూచించిన సవరణలను బిల్లులో పొందుపర్చేందుకు సర్కారు సిద్ధమైంది. మళ్లీ అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్‌కు పంపించనుంది. గవర్నర్ ఆమోదముద్ర తరువాత కేంద్రానికి నివేదిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు వారంలో మళ్లీ అసెంబ్లీ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేవాలు ఇంకా ప్రోరోగ్ కాలేదు. బడ్జెట్ ఆమోదం తరువాత ముస్లిం రిజర్వేషన్ల కోసం ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ప్రోరోగ్ కానందున ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించొచ్చు. ఢిల్లీ పర్యటన నుంచి రాగానే సిఎం కెసిఆర్ ఈ అంశంపైనే గవర్నర్‌ను కలిసి అసెంబ్లీ సమావేశంపై చర్చించారు. మరోపక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ భూసేకరణ చట్టంలో కేంద్రం సూచించిన సవరణలపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఆమోదించి, కేంద్రానికి పంపిన చట్టంలో కామా, పుల్‌స్టాప్ వంటివి మార్చాలన్నా తిరిగి ఆ పని అసెంబ్లీనే చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన భూసేకరణ సవరణ చట్టంలోని ప్రాస్పెక్టివ్ అనే పదాన్ని రెట్రాస్పెక్టివ్‌గా మార్చాలని కేంద్రం సూచించింది. అదేవిధంగా రివైవ్ అనే పదానికి బదులు అస్సర్టెన్‌గా సవరించాలని కేంద్రం సూచించింది. దీంతో భూసేకరణ చట్టంలో రెట్రాస్పెక్టివ్, అస్సర్టెన్ అనే పదాలను చేర్చాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ సవరణలకు అసెంబ్లీ, గవర్నర్ అమోదం అవసరం. కొత్తగా భూసేకరణ సవరణ చట్టానికి ఎలాంటి తంతు నిర్వహించారో, ఈ రెండు పదాల మార్పు తరువాత తిరిగి అదేవిధంగా అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ ఆమోదం అవసరం. డిసెంబర్ 26న ఒకే రోజున అసెంబ్లీలో 2013 భూసేకరణ సవరణ చట్టం ఆమోదించారు. అదేరోజు గవర్నర్‌కు పంపించి ఆమోదం తరువాత కేంద్రానికి నివేదించారు. నాలుగు నెలల తరువాత కేంద్రం నుంచి తిరిగి వచ్చింది. ఎంతవేగంగా ప్రయత్నాలు సాగించినా కేంద్రం ఆమోదానికి కనీసం మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది.
భూసేకరణ వివాదాల వల్ల వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులన్నీ నిలిచిపోయాయి. గతంలో జీవో 123తో భూసేకరణ జరిపారు. హైకోర్టు ఆ జీవోను కొట్టివేయడంతో భూసేకరణ నిలిచిపోయింది. కొత్త చట్టం అమలులోకి వస్తే భూసేకరణ పనులు వేగంగా జరపవచ్చునని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది, దీనికితోడు మరో రెండు మూడు నెలల వరకు భూసేకరణ జరిపే అవకాశం లేకపోడంతో నీటిపారుదల శాఖకు భారీ దెబ్బ. ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో ఏటా 25వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా ముందుగా భూసేకరణ పనులు చేపట్టాలి. మొదటి పనికే ఆటంకాలు ఏర్పడంతో నీటిపారుదల శాఖకు భారీ దెబ్బ. భూ సేకరణ ఆలస్యమైతే ప్రాజెక్టు వ్యయం కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశం జరుగుతుందని, ఆ వెంటనే సభ ఆమోదించిన సవరణ చట్టాన్ని కేంద్రానికి పంపించి ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి వెంటనే ఆమోదముద్ర పడేందుకు ప్రయత్నిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 27న వరంగల్ బహిరంగ సభ జరిగిన వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిసింది.