ఆంధ్రప్రదేశ్‌

భూ సమీకరణపై మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 25: రాజధాని భూ సేకరణ విషయంలో యథాతధ స్థితిని అమలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఏ రకంగా ముందడుగు వేయాలనే విషయమై ఏపి సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలలో ఇప్పటికే ప్రభుత్వం సామాజిక ప్రభావిత సర్వే పూర్తి చేసింది. కొన్ని గ్రామాలకు నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలో మంగళగిరి మండలం పెనుమాక రైతులు 252 మంది కోర్టును ఆశ్రయించడంతో యథాతధ స్థితిని అమలు చేయాలని ఆదేశించింది. అయితే భూ సేకరణ నోటిఫికేషన్ జారీచేసిన 60 రోజుల వరకు గడువు ఉంటుంది.. ఆ పై నెలరోజుల తరువాత అవార్డు ప్రకటిస్తారు. కోర్టు స్టేటస్‌కోను మాత్రమే అమలు చేయాలని ఆదేశించిందని లిఖితపూర్వకంగా నిలిపివేయాలని తమకెలాంటి ఉత్తర్వులు అందలేదని సిఆర్‌డిఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సేకరణకు నోటిఫికేషన్ జారీచేసిన 90 రోజుల తరువాతే ప్రక్రియ పూర్తవుతుందని ఆపై రైతులకు మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు జరిపి సేకరణ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. రాజధానిలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది.
ఈ పరిస్థితుల్లో రైతులకు కేటాయించే ప్లాట్లు అమ్ముకునే విషయంలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ముందుగా రోడ్లు, ఇతర వౌలిక సదుపాయాలు ఏర్పాటయితే కానీ తాము కొనుగోలు చేసేది లేదని రియల్టర్లు, బిల్డర్లు తేల్చిచెబుతున్నారు. దీంతో ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రోడ్లతో పాటు మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలంటే భూసేకరణ తప్పనిసరి. భూ సేకరణకు విఘాతం కలగడంతో రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూ సేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2013 భూ సేకరణ సవరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ సర్వే ముగిసిన అనంతరం 24 గ్రామాలకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ భూములతో కలిపి దేవాదాయ, అటవీ, అసైన్డు భూములతో కలుపుకుని 50 వేల ఎకరాల్లో రోడ్లు, రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేసింది. పూర్తి స్థాయిలో మాస్టర్‌ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలంటే మరో 3వేల 549.61 ఎకరాల మేరకు సేకరణ జరపాలి. కోర్ కేపిటల్ ప్రాంతమైన లింగాయపాలెంలో 120 ఎకరాలు, నేలపాడులో 700 ఎకరాలు, పెనుమాకలో 560 నవులూరులో 170, ఉండవల్లిలో 720 ఎకరాలతో పాటు మిగిలిన గ్రామాల్లో అక్కడక్కడా కొంత భూ సేకరణ జరపాల్సి ఉంది. భూ సేకరణను వ్యతిరేకిస్తున్న నేలపాడు గ్రామంలో ఒక్కరొక్కరుగా రైతులు ముందుకొస్తున్నారు. పెనుమాక గ్రామంలో మొత్తం 900 మంది రైతుల నుంచి 560 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. వీరిలో 252 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. మిగిలిన రైతులకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ గ్రామాల్లో సామాజిక సర్వే నామమాత్రంగా నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారని, గ్రామసభల్లో వ్యక్తమైన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకుండా కొద్దిమందితో ముగించేశారని రైతులు వాదిస్తున్నారు. కాగా గడువు తరువాత నేరుగా బ్యాంకు ఖాతాలో మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు జరిపి సేకరణ జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అవార్డు సమయంలో అభ్యంతరాలు సేకరించి తప్పనిసరి పరిస్థితుల్లో సేకరణ జరిపేందుకు సర్కార్ కసరత్తు జరుపుతోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది.