బిజినెస్

పౌల్ట్రీ రంగానికి సన్‌స్ట్రోక్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 25: ప్రచండ భానుడి భగభగలకు పౌల్ట్రీ రంగం విలవిలలాడుతోంది. దంచికొడుతున్న ఎండలతో బ్రాయిలర్ కోళ్లు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సూరీడు కురిపిస్తున్న నిప్పుల వేడి తాళలేక తలలు వాల్చేస్తున్నాయి. ఎండ తీవ్రతతో నిత్యం పదుల సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 500 నుంచి 600 మంది పౌల్ట్రీ రైతులు ఉండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 వేల మందికిపైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో 70 శాతం పెద్ద రైతులు ఉండగా, మిగిలిన 30 శాతం చిన్న రైతులు ఉన్నారు. ప్రధానంగా 10 వేల నుంచి 20 వేల వరకు కోళ్లను పెంచే రైతులు ఎక్కువగా ఉన్నారు. ప్రతి నెల ఉమ్మడి జిల్లాలో 8 లక్షల నుంచి 10 లక్షల వరకు బ్రాయిలర్ కోడి పిల్లల సరఫరా జరుగుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా పెరిగిన ఉషోణ్రగతలతో పౌల్ట్రీ రంగం పరేషాన్ అవుతోంది. ఉదయం 8 గంటలకే 30 డిగ్రీలు దాటి మధ్యాహ్నానికల్లా 42 డిగ్రీలకు చేరుకుంటోంది. రాత్రి 8 దాటినా కూడా ఎండ వేడిమి తగ్గడం లేదు. దీంతో పౌల్ట్రీ ఫారాల్లో పెరుగుతున్న బ్రాయిలర్ కోళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. కోళ్లను రక్షించుకునేందుకు రైతులు అనేకపాట్లు పడుతున్నారు. చల్లదనం కోసం ఫామ్స్ చుట్టూరా తడిపిన గోనె సంచుల పరదాలు కడుతున్నారు. షెడ్లపైన గడ్డివేసి స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతున్నారు. అంతేగాక ఫారం లోపల ప్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ కోళ్లు ఉన్న రైతులైతే కూలర్లను కూడా పెడుతున్నారు. అయినప్పటికీ రైతుల ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తీవ్రమైన ఎండలతో ఉక్కపోత పెరగడంతోపాటు ఆర్‌డి అనే వైరస్‌తో కోళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరోవైపు ఎండలకు కోళ్లల్లో ఎదుగుదల ఉండడం లేదని, వేడిమి తాళలేక దాణా కూడా సరిగా తీసుకోవడం లేదని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. ఫలితం గా ఎండాకాలంలో బ్రాయిలర్ కోళ్లు పెంచకపోవడమే మంచిదనే నిర్ణయం ఎక్కువ మంది రైతుల్లో నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో ఉన్నవాటినే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కొత్తగా కోడి పిల్లలనూ తీసుకురావడం లేదు. బ్రాయిలర్ కోళ్లతో తయారీదారు, దాణా, మందుల వ్యాపారులకు మాత్రమే ఈ రంగం అనుకూలంగా ఉందేగానీ రైతులకు ఎలాంటి లాభం లేదని కొందరు రైతులు పేర్కొంటున్నారు. అటు లేయర్ కోళ్లను పెంచే రైతులు కూడా పరిస్థితి బాగాలేదనే అంటున్నారు. మార్కెట్‌లో గుడ్డుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, తద్వారా లేయర్ కోళ్ల పెంపకం లాభసాటిగా లేదని చెబుతున్నారు. మొత్తానికి పౌల్ట్రీ రంగానికి సన్‌స్ట్రోక్ గట్టిగానే తగులుతోంది.