తెలంగాణ

అలా.. ముగిసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతాల వేడుక అట్టహాసంగా ప్రారంభమై నిర్ణయించిన సమయంకంటే ముందే ముగిసింది. శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం ముగిసిన వెంటనే, మిగిలినవారి ఉపన్యాసాలను రద్దు చేసి కార్యక్రమాన్ని ముగించేశారు. నిరసనలు తెలిపేందుకు విద్యార్థులు మోహరించారన్న సమాచారం అందడంతో, కార్యక్రమాన్ని కుదించి ముగించేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రారంభ కార్యక్రమంలో ఓయు ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపి కె కేశవరావు, మేయర్ బొంతు రమేష్‌లు మాట్లాడాల్సి ఉన్నా, ఎవరికీ అవకాశం కల్పించలేదు. ప్రారంభ కార్యక్రమం ముందుగా అనుకున్న ప్రకారం 12.30కు మొదలైంది. 1.30 వరకూ జరగాల్సింది 1.10కే ముగిసింది. 12.25కే రాష్టప్రతి వేదిక వద్దకు చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అర్ధగంటపాటు రాష్టప్రతి మాట్లాడారు. విసి స్వాగతోపన్యాసం చేసిన తర్వాత వేదికపై ఉన్న ప్రముఖులను సత్కరించారు. చివరిలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాలరెడ్డి వందన సమర్పణ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఎంపి డాక్టర్ కె కేశవరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, సిఎం కె చంద్రశేఖరరావులు ఉపన్యసించాల్సి ఉన్నా వాటిని రద్దు చేశారు. విద్యార్ధుల నుంచి నిరసననలు వ్యక్తమైతే ఉన్న పరువు పోతుందనే భయంతోనే మిగిలిన వారి ఉపన్యాసాలు రద్దు చేశారనే ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడితే నిరసనలతో అట్టుడికి పోతుందేమోననే భయంతోనే ఉపన్యాసాలు రద్దు చేశారని అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం ఖండించారు. రాష్టప్రతి భవన్ నుంచి చివరి నిమిషంలో వచ్చిన ఆదేశాల మేరకు ఉపన్యాసాలను రద్దు చేశామని పేర్కొన్నారు. అంతకుమించి వేరే కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
బోసిపోయిన విఐపి గ్యాలరీ
ప్రధాన వేదిక వద్దకు హాజరుకావల్సిందిగా 2వేల మందికి ఆహ్వానాలు పంపించారు. అయితే చాలా వరకూ విఐపి గ్యాలరీ బోసిపోయింది. దాంతో మిగిలిన గ్యాలరీల్లోని సిబ్బందిని ముందుకు జరిపారు. ప్రధాన వేదిక వద్దకు వచ్చే అతిథులకు వివిధ కేటగిరిల పాస్‌లను జారీ చేయగా, కొంత గందరగోళం చోటుచేసుకుంది. మాజీ విసిలు సైతం విఐపి గ్యాలరీలకు రాలేకపోయారు.
కట్టుదిట్టమైన భద్రత
భద్రత పేరుతో పోలీసులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి నోట్ ప్యాడ్‌లు, పెన్నులను సైతం నిషేధించడంతో మీడియా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సెల్‌ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లు, నల్లరంగు నిరసన పతాకాలు, గొడుగులు, లైటర్లు, అగ్గిపెట్టెలు నిషేధించారు. ఆయుధాలు ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని సైతం అనుమతించలేదు. సభకు హాజరైన అతిథుల మధ్యనే పోలీసులను సైతం భద్రత కోసం కూర్చుండబెట్టారు. విద్యార్ధులు ఎవరైనా లేచి నినాదాలు చేసినా, గొడవలు చేసినా వారిని అదుపు చేయడానికి ముందస్తుగా సివిల్ దుస్తుల్లో పోలీసు సిబ్బందిని ఉంచారు. హాజరైన వారికంటే భద్రతా సిబ్బందే ఎక్కువగా ఉన్నారు.