ఆంధ్రప్రదేశ్‌

అవినీతికి తావులేకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 26: మార్కెట్ జోక్యం ద్వారా మిర్చి, పసుపు కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని, పైసా అవినీతి కూడా జరగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బుధవారం తన నివాసం నుంచి వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో, జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకే సకాలంలో మార్కెట్ జోక్యం చేసుకుని ధరల పతనం కాకుండా చూస్తున్నామన్నారు. గతంలో ఉల్లి, శనగలు, కందులు మార్కెట్ జోక్యం ద్వారా కొని రైతులకు న్యాయం చేసిన విషయం గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం కూడా మిర్చి, పసుపు రైతులకు మార్కెట్ జోక్యం ద్వారా న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. హుద్‌హుద్ తుపాన్‌లో ఎంత అప్రమత్తంగా ఉన్నామో ధరల పతనం నుంచి రైతులను ఆదుకోవడంలో కూడా అదే అప్రమత్తత చూపాలని మార్కెటింగ్ అధికారులు, సిబ్బందిని కోరారు.
రోడ్లపై సరుకుతో రైతులు నిరీక్షించరాదు
రైతులు రోజుల తరబడి సరుకుతో రోడ్లపై నిరీక్షించే పరిస్థితి ఉండరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరు సరుకులు ఏ తేదీన కొనేది ముందే రైతులకు తెలియజేయాలన్నారు. వచ్చే ధర.. లారీల కిరాయి, వెయిటింగ్ చార్జీలకే సరిపోతే రైతులకు మిగిలేది ఏమీ ఉండదన్నారు. అందుకే ముందస్తు సమాచారం రైతులందరికీ ఎప్పటికప్పుడు అందేలా చూడాలన్నారు. అర్హుడైన ఏ రైతు కూడా తన సరుకు అమ్ముడుపోలేదని బాధపడకూడదన్నారు. మిర్చి, పసుపు కొనుగోళ్లపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. కాల్ సెంటర్ సేవలు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏ రైతుకూ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని హెచ్చరించారు.
మార్కెటింగ్ వ్యవస్థ ప్రక్షాళన
మార్కెటింగ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మార్కెటింగ్ అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే 20 శాతం అధిక రేటు రైతులకు వస్తుందన్నారు. మొత్తం మిర్చి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు మార్కెటింగ్ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో, అవిశ్రాంతంగా పని చేయాలన్నారు. మార్కెటింగ్ కమిటీలు సమర్థవంతంగా పని చేయడం ద్వారానే రైతులకు సకాలంలో సరైన ధర వస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ మిర్చి రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు 50 బృందాలను నియమించినట్లు తెలిపారు. విజయవాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌ను గుంటూరు మిర్చియార్డులోనే అందుబాటులో ఉండేలా ఆదేశించామన్నారు. గుంటూరు యార్డులో మిర్చి కొనుగోళ్లకు 21 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ‘మంచిపని చేస్తూ చెడ్డపేరు తెచ్చుకోవద్దని’ చెప్పారు. అర్హులైన రైతులందరి సరుకును కొనుగోలు చేయాలని ఆదేశించారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ నాబార్డు ద్వారా రైతులను ఆదుకోవడంపై అధికార యంత్రాంగం శ్రద్ధ వహించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరుకు మన యార్డులకు వస్తున్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడంలేదనీ, అలాంటిది తీవ్ర ఆర్థికలోటులో ఉండి కూడా మన రాష్ట్రంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 55 లక్షల క్వింటాళ్ల మిర్చి యార్డుకు వచ్చిందని, గతంలో ఈ సమయానికి వచ్చినదాని కన్నా 20 లక్షల క్వింటాళ్లు అధికంగా వచ్చిందని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ సంక్షోభంలోనే సమర్థత బయటపడుతుందన్నారు. మిర్చి, పసుపు కొనుగోళ్లపై ప్రతిరోజు వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రులు, అధికారులు సమీక్షించాలని ఆదేశించారు.
మార్కెట్ యార్డుల సమీపంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.