ఆంధ్రప్రదేశ్‌

కెఇకి ఏదీ చోటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూకేటాయింపుల కమిటీలో రెవిన్యూ మంత్రికి మొండిచెయ్య
లోకేష్‌తో పాటు నక్కాకు స్థానం
బీసీలకు ఇది అవమానం
వైసిపి విమర్శనాస్త్రాలు
అమరావతి, మే 4: ఆయన రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి. పైగా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో అందరికంటే సీనియర్. అందునా ముఖ్యమంత్రికి సమకాలికులు. ఆయన అధీనంలోని రెవిన్యూ శాఖే భూకేటాయింపుల వ్యవహారం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆయనకు ఆ బాధ్యత అప్పగించలేదు. ఇద్దరు జూనియర్ మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి అందరినీ విస్మయపరిచింది. ఇంతకూ ఆ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వివిధ పరిశ్రమలు, కంపెనీలను ఆకర్షించే పనిలో ఉన్న ప్రభుత్వం, అందుకు అవసరమైన భూములు కేటాయించేందుకు సిద్ధమవుతోంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భూకేటాయింపుల కమిటీలో ఇద్దరు జూనియర్ మంత్రులను నియమించడం విమర్శలకు తావిచ్చింది. విమర్శనాస్త్రాలు సంధించేందుకు విపక్షాలకు తావిచ్చింది.
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కమిటీలో రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తికి స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశమయింది. నిజానికి భూముల వ్యవహారాలన్నీ ఆయన శాఖ చూడాల్సి ఉండగా, గత మూడేళ్ల నుంచి మున్సిపల్ మంత్రి నారాయణకు అప్పగించారు. రాజధాని భూముల వ్యవహారాలన్నీ నారాయణ నేతృత్వంలోనే జరుగుతున్నాయి. దీనిపై అప్పట్లో అనేక ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. తాజా కమిటీలో యనమల రామకృష్ణుడు, నారాయణతోపాటు కొత్తగా మంత్రివర్గంలో చేరిన లోకేష్, నక్కా ఆనంద్‌బాబుకు స్థానం కల్పించడం విమర్శలకు కారణమయింది. ఇద్దరు జూనియర్ మంత్రులకు ఈ వ్యవహారాల్లో ఏ మాత్రం అనుభవం లేదని, సీనియర్ అయిన రెవిన్యూ మంత్రిని వేయకుండా, కావలసిన పనులు చేసుకునేందుకే జూనియర్లతో కమిటీని భర్తీ చేశారని వైసీపీ విమర్శనాస్త్రాలు ప్రారంభించింది. మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పార్ధసారథి.. భూకేటాయింపుల కమిటీలో లోకేష్‌కు ఏం అనుభవం ఉందని ఆయనను నియమించారని నిలదీశారు. విశాఖ భూముల వ్యవహారంలో ప్రత్యక్షపాత్ర పోషిస్తున్న లోకేష్‌కు, అదే కమిటీలో స్థానం కల్పించడం ఎందుకో ప్రజలకు సులభంగానే అర్థమవుతోందని ఆరోపించారు. పైగా బీసీ అయిన కెఇని పక్కనపెట్టి బీసీలను అవమానించారని విమర్శించారు. అయితే వెంటనే ఎదురుదాడి చేసిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య.. కమిటీలో ఉన్న యనమల బీసీనే అని గుర్తు చేస్తూ, కెఇని ఎలా గౌరవించుకోవాలో మీరేం చెప్పనవసరం లేదని ఘాటుగా స్పందించారు.
ఏదేమైనా భూకేటాయింపుల కమిటీవంటి కీలకమైన కమిటీలో స్థానం దక్కించుకున్న లోకేష్.. ప్రభుత్వంలో తన స్థానమేమిటో చెప్పకనే చెప్పారు. ఇకపై ప్రభుత్వం వేసే అన్ని సబ్ కమిటీల్లోనూ లోకేష్ ఉండబోతారన్న సంకేతాలకు ఇది నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోకేష్‌కు ముందు అదే శాఖ నిర్వహించిన అయ్యన్నపాత్రుడికి అప్పుడు ఈ కమిటీలో చోటు లభించకపోవడం ప్రస్తావనార్హం.
నాకు ఆసక్తిలేదు: కెఇ
కాగా ఆంధ్రభూమి దీనిపై కెఇ కృష్ణమూర్తి స్పందన కోరగా ‘నాకు ఆ కమిటీలో చేరే ఆసక్తికూడా లేదు. నేను ఆ కమిటీలో ఉండాల్సిన అవసరం లేదు. అయినా భూముల వ్యవహారాలు నేను చూడటం లేదు’ అని వ్యాఖ్యానించారు.