ఆంధ్రప్రదేశ్‌

మెరిట్‌కు మెడి‘కిల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్య విద్యార్థులపై ఫీ‘జులుం’ ప్రైవేటుకు పట్టం కట్టిన కామినేని విద్యార్థుల ఆగ్రహం, ధర్నా

విజయవాడ, మే 4: మెడికల్ పీజీ డిప్లొమో కోర్సుల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిభకు పాతర వేసే విధంగా ఫీజుల విధానం ఉందని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వైద్య విద్యార్థులు, మెడికల్ సీట్ల ఆశావహుల సంక్షేమం కన్నా.. ప్రైవేట్ మెడికల్ కళాశాలలపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఎక్కువ ప్రేమ కనబరుస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ పీజీ మెడికల్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఫీజుల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో నోటిఫికేషన్ నెల రోజుల ఆలస్యం జరిగింది. అయితే ఫీజులను నిర్ణయిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులను భారీగా పెంచడంపై విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 3.2 లక్షల రూపాయలుగా ఉన్న ఎం.డి క్లినికల్ లేదా డిప్లొమో కోర్సుల ఫీజును 6.9 లక్షల రూపాయలకు పెంచారు. గతంలో పీజీ క్లినికల్ డెంటల్ కోర్సు ఫీజు 1.5 లక్షల రూపాయలు కాగా, దానిని 7.5 లక్షల రూపాయలకు పెంచారు. మేనేజ్‌మెంట్ కోటా కింద కేటగిరి 1లో ఫీజును 24.2 లక్షల రూపాయలు, కేటగిరి 2,3లకు 72.3 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పటికే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కటాఫ్ మార్కులను తగ్గించడం ద్వారా ప్రైవేట్ కళాశాలలకు మేలు చేకూర్చారని, ఫీజులను భారీగా పెంచడం ద్వారా మరింత లబ్ధి కలిగిస్తున్నారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానం వల్ల ప్రతిభ ఉన్నప్పటికీ తాను కోరుకున్న కోర్సును చదవలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ కళాశాలల ఫీజులను పెంచలేదని, ప్రైవేట్ కళాశాలల ఫీజులను మాత్రమే పెంచామని మంత్రి కామినేని చెబుతున్నారు. గతంలో ఎన్నారై కోటా కింద 1.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే సీటు ఇప్పుడు 72 లక్షల రూపాయలకే వస్తోంది కదా అని మంత్రి ప్రశ్నించడం గమనార్హం. ప్రభుత్వం అడ్డగోలుగా ఫీజులను పెంచడంపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వద్ద జూనియర్ వైద్యుల సంఘం (డెంటల్) విద్యార్థులు గురువారం ధర్నా చేశారు. వైద్య విద్యార్థుల భవితను నాశనం చేసేందుకే ఫీజుల ఖరారులో ప్రభుత్వం జాప్యం చేసిందని ఆరోపించారు. ఏటా 10 శాతం ఫీజును మాత్రమే పెంచుతామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. కన్వీనర్ కోటా ఫీజును 2.9 లక్షల రూపాయల నుంచి 3.2 లక్షల రూపాయలకు పెంచిందని తెలిపారు. కానీ అకస్మికంగా 120 శాతం మేర ఫీజులను పెంచడం ద్వారా ప్రతిభకు అవకాశం లేకుండా చేశారని విమర్శించారు.

చిత్రం... విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వద్ద గురువారం ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు