మెయన్ ఫీచర్

లోపల ఎవరున్నారు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిఐపిల కార్లపై బుగ్గలైట్లను తొలగించాలని ప్రధాని మోదీ ఆదేశించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తవౌతోంది. ‘బుగ్గలు’ తీసేయడమే కాదు, ఆ వాహనాల్లో ప్ర యాణించేవారెవరో అందరికీ తెలిసేలా ఉండాలన్న డిమాండ్ ఇపుడు వినిపిస్తోంది. రోడ్డు నిబంధనలు అందరికీ ఒకటే కదా అని అంటున్నారు. వాహనాల్లో ప్రయాణించేవారెవరో తెలిసేందుకు సిసి కెమెరాలు ఉండాలంటున్నారు. వాహనాల అద్దాలకు కర్టెన్లు గాని, ఫిల్మ్‌లు గాని ఉండరాదన్న నిబంధన ఇదివరకే ఉంది. పలుకుబడి కలిగిన కొందరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ తమ వాహనాల్లో అసాంఘిక కార్యకలాపాలకు బరితెగిస్తున్న ఉదంతాలు లేకపోలేదు. ఇలాంటి వారిపై కూడా పోలీసులు కొరడా ఝళిపించాలని జనం కోరుతున్నారు. - నిమ్మరాజు చలపతిరావు

‘వందనం’ కోసమట!
ఎపి మంత్రివర్గ విస్తరణలో తనకు చాన్స్ దక్కకపోవడంతో అవసరమైతే కొత్తపార్టీ పెడతానని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆ మధ్య ఆవేశపడ్డారు. ఎవరైనా మంత్రి పదవి ఎందుకు కోరుకుంటారో అందరికీ తెలిసిందే. కానీ, చింతమనేని ఎందుకు మంత్రి పదవి కావాలంటున్నారో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజంటే తనకెంతో ఇష్టమని, ఆ రోజు మంత్రిగా జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయడం కోసమే పదవి అడిగానని, అధికారం చెలాయించడానికి కాదని ఆయన తన మనోగతాన్ని మీడియా వద్ద ఆవిష్కరించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఓ మహిళా తహశీల్దార్‌పై దాడి చేసిన చింతమనేనిలో జాతీయ పతాకంపై ఇంత భక్తి ఉందా? అని విన్నవారు ఆశ్చర్యపోతున్నారు.
- మురళి

నాణానికి మరోవైపు..
కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అనే వ్యవస్థ తలాతోక లేని విధానమని, ఒకరకంగా ఇది వెట్టిచాకిరీ అని విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో తెలంగాణ సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెరాస అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని ఉద్యమనేతగా గతంలో ఆయన ప్రకటించారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ, కెసిఆర్ మాత్రం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతి తప్పుడు విధానమని అంటున్నారు. అంటే- సిఎంకు తెలియకుండానే ఈ నియామకాలు జరుగుతున్నాయని అనుకోవాలా?
- వెల్జాల చంద్రశేఖర్

క్షీరాభిషేకాల జోరు
తమ నాయకుడు ఏదైనా మంచిపని చేస్తే ప్రజలు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం కొత్తేమీ కాదు. మిఠాయిలు పంచిపెట్టి, తమ నాయకుడి పేరిట గుళ్లో పూజలు చేయిస్తారు. తెలంగాణ సిఎం కెసిఆర్ చిత్రపటాలకు ఇపుడు క్షీరాభిషేకాలు పెరిగాయి. తమకు రిజర్వేషన్ కోటా పెంచినందుకు ముస్లింలు చార్మినార్ వద్ద కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తాజాగా విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగులు కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఈ అభిమానం ఎన్నికల వరకూ ఉంటే వోట్ల పంట బాగానే పండుతుంది. ప్రజల అభిమానం ఉన్నంత కాలం ఏ నాయకుడికైనా ప్రతి రోజూ క్షీరాభిషేకాలే.
- శైలేంద్ర

ఇవిఎం అంటే..!
ఇవిఎం అంటే ఏమిటని అడిగితే- ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్’ అని ఎవరైనా వెంటనే చెబుతారు. కానీ- బిజెపి అగ్రనేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ‘ఇవిఎం’కు తనదైన శైలిలో ఓ కొత్త అర్థం చెప్పారు. ఇవిఎం అంటే ‘ఎవ్రీ ఓట్ టూ మోదీ’ అని ఆయన ఓ సమావేశంలో అనగానే అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు. ప్రతిపక్షాలకు ఓట్లు పడితే ఇవిఎంలు మంచివని వారు అంటారని, ఓట్లు పడకపోతే ‘యంత్రాల’ను తారుమారు చేశారని గొడవ చేస్తారని వెంకయ్య అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా వ్యవహరించడం విపక్షాలకు పరిపాటిగా మారిందని ఆయన చురకలంటించారు.
- వి. ఈశ్వర్ రెడ్డి