తెలంగాణ

జీవించే హక్కును పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న పట్టణాభివృద్ధి నేపథ్యంలో జీవించే హక్కు, గౌరవాన్ని పరిరక్షించేవిధంగా పట్టణ ప్రణాళిక వ్యూహాలకు కొత్త రూపం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐక్య రాజ్య సమితి (ఐరాస) ఆవాస అధిపతిగా ఇటీవల నియమితులైన కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ వ్యాప్తంగా పట్టణాలు పెరుగుతున్నాయని, అనివార్యంగా అక్కడ నివసించే ప్రజలకు భద్రత, వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం అన్ని ప్రభుత్వాలపై పడిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఐరాస ఆవాస అధిపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడును పార్టీ నేతలు, పట్టణ ప్రముఖులు శనివారం నాడిక్కడ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తనకు జరిగిన సత్కారానికి ధన్యవాదాలు తెలిపారు. అమృత్, స్మార్మ్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి నూతన కార్యక్రమాలతో భారత్ ముందడుగు వేస్తోందని వెంకయ్యనాయుడు చెప్పారు. వీటితో పాటు తక్కువ ఖర్చులో ఇళ్లనిర్మాణం, అవస్థాపనలో వేరువేరు కోవలకు చెందిన లోటు పాట్లను కూడా ప్రభుత్వం పరిష్కరించనుందని అన్నారు. మధ్య తరగతి వారికి సైతం ఇళ్ల నిర్మాణానికి కొంత వడ్డీ రాయితీ ఇచ్చే యోచనలో కేంద్రం ఉందని వెల్లడించారు. ఐరాస ఆవాస సంస్థ తన నివేదికలను ఐక్యరాజ్య సమితికి అందజేస్తుందని వెంకయ్య తెలిపారు. తాను పైకి రావడానికి కారణం మిత్రులేనని, తనకు రాజకీయ రంగంలో ఎలాంటి వారసత్వం లేదని, తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలపడానికి కారణం తాను నమ్ముకున్న సిద్ధాంతం, శ్రమ, నమ్ముకున్నదానిని వదిలిపెట్టకపోవడం కారణమని పేర్కొన్నారు.
ఐరాస ఆవాస సంఘానికి అధ్యక్షుడిగా సేవలు పెద్ద పెద్దవి కాదని, కాని అరుదైన గౌరవమని ఆయన పేర్కొన్నారు. 190 దేశాల ప్రతినిధులు, 58 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించే వేదిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రపంచంలోని మానవాళి అంతా గ్రామాల నుండి పట్టణాలకు వస్తున్నారని, వారి సుఖము, సంతోషము, వారికి కావల్సిన అవసరాలు, నివాసం సభ్యదేశాలకు మార్గదర్శనం చేసి ఇతర దేశాల మంచి అనుభవాలను వారు తెలుసుకునేలా చేసి, సభలూ సమావేశాలు పెట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ఎక్కడ జరుగుతోందో దానిని వారికి అందించడం ఈవేదిక ద్వారా జరుగుతుందని చెప్పారు. 1976లో కెనడాలో సమావేశం జరిగిన తర్వాత 1978లో ఐక్యరాజ్యసమితిలో భాగంగా తొలి ఆవాస సదస్సు జరిగిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచే చర్యలు చేపట్టాలని, పట్టణ వాసులకు కనీస సదుపాయాలు కల్పించేలా వేదిక చూస్తోందని అన్నారు. వ్యర్థ పదార్థాలను అర్థవంతంగా విద్యుత్‌గా మార్చేందుకు కేంద్రప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోందని, వ్యర్థ పదార్థాల్లో కొంత భాగాన్ని ఎరువులుగా మార్చే వీలుందని వెంకయ్య వివరించారు.ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందని అన్నారు. వాహనాల వల్ల విపరీతమైన కాలుష్యం, తద్వారా ఉష్ణోగ్రతల పెరుగుదల, వ్యర్థాలు, సమయ పాలన లేకుండా పోతోందని అన్నారు. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టును తగ్గించాలని, ప్రభుత్వ రవాణా పెంచాలని పేర్కొన్నారు. మనదేశంలో ఆక్రమణలు ఎక్కువని, ఆక్రమణ హక్కు అనుకుంటామని వెంకయ్య ఎద్దేవా చేశారు. పెరుగుతున్న జనాభా, పట్టణాలకు తరలి వస్తున్న జనాభా, కాలుష్యం, రవాణా రద్దీ, ట్రాఫిక్ జామ్‌లు, ఈ కారణంగా మన మనసుపైనా, శరీరంపైనా పడుతున్న ప్రభావం వీటన్నింటిపై ఆవాస వేదిక చర్చిస్తుందని తెలిపారు.
చంపడం మానవ హక్కా?
చంపడం మానవ హక్కా అని వెంకయ్యనాయుడు నిలదీశారు. ఇటీవల మావోయిస్టులు పాతిక మంది సిఆర్‌పిఎస్ జవాన్లను బలితీసుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మాట్లాడితే మానవ హక్కు అంటారని, చంపడం మానవ హక్కా అని ఆయన ప్రశ్నించారు. మానవ హక్కుల సంఘాలు ప్రాణాలు తీస్తున్న వారికి వత్తాసు పలకడం ఏం సబబు అని ఆయన ప్రశ్నించారు.

చిత్రం..శనివారం హైదరాబాద్‌లో జరిగిన సన్మానసభలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య