తెలంగాణ

నామినేషన్‌పై భగీరథ పనులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: మిషన్ భగీరథ పనులు నామినేషన్ పద్ధతిలో స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించడంతో నాణ్యతా ప్రమాణాలపై అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే నాణ్యతా ప్రమాణాల విషయంలో తేడా ఏమీ ఉండదని, కమిటీ సభ్యులు స్వయంగా సందర్శించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో పబ్లిక్ అకౌంట్స్ చైర్‌పర్సన్ డాక్టర్ జె. గీతారెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. కమిటీ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మిషన్ భగీరథ పనుల గురించి పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా ఇంటింటికీ తాగు నీరు అందిస్తామని చెప్పారు. 51 వేల గ్రామాలకు నీరు అందించడం సాధ్యమా?, ఖర్చుల భారం వినియోగదారులపై వేస్తారా? అని గీతారెడ్డి ప్రశ్నించారు. ఎక్కడికక్కడ స్థానిక కాంట్రాక్టర్లకు, నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడం పట్ల వారు అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకు సిఎస్ ఎస్‌పి సింగ్ ప్రతిస్పందిస్తూ దీనిపై అనుమానాలు అవసరం లేదని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. పనుల నాణ్యతా ప్రమాణాల గురించి కమిటీ రాష్ట్రంలో ఎక్కడైనా పరిశీలన చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో సందర్శనకు వెళ్ళాలని కమిటీ నిర్ణయించింది. వినియోగదారులపై భారం పడదని, 47 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు అని సిఎస్ ఎస్‌పి సింగ్ వివరించారు.
అజాగ్రత్తగా ఉండరాదు..
కరీంనగర్ జిల్లా కిష్టమ్మవాగుపై శనిగరం నుంచి సముద్రాల వరకు కాజ్‌వే (వంతెన) నిర్మాణం పనుల్లో నాణ్యత లేకపోవడం, పైగా అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోవడంపై కమిటీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. మెదక్ జిల్లా నందనూరు (పెద్దవాగు) సబ్‌మెర్సిబుల్ వంతెన పనులు 1988లో 11 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టగా, 1989లో కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్ళిపోవడంపై చర్చ జరిగింది. సదరు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేయాలని కోర్టు ఆదేశించినా, ఎందుకు పట్టించుకోలేదని కమిటీ సభ్యులు అధికారులను నిలదీశారు. జవహర్ రోజ్‌గార్ యోజన నిధుల్లో నుంచి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ అనుమతి లేకుండా వాహనాలు కొనుగోలు చేయడంపై కూడా కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు టి.జీవన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రాములు నాయక్, భానుప్రసాద్, పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.