ఆంధ్రప్రదేశ్‌

పొత్తు సాగితే పుట్టి మునుగుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 25: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి విందు భోజనానికి వెళ్లే ముందు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు బాబు పాలనపై బిజెపి అగ్రనేతలు ఫిర్యాదుల చిట్టా వినిపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలన, నేతల అరాచకాలతో బాబు గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు కొనసాగిస్తే ఆ మకిలి తమ పార్టీకీ అంటుకుంటుందని పలువురు అగ్రనేతలు అధినేతకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో వచ్చిన చంద్రబాబుతో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన అమిత్‌షా అక్కడి నుంచి పార్టీ ఎంపి గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పలువురు సీనియర్లు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టుతోపాటు, వివిధ పథకాల్లో దారుణమైన అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. బిజెపితో పొత్తుపై విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ టిడిపి నాయకులకే ఇస్తున్నారని, కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు కనీస ప్రచారం కూడా లేదని, వాటిపై మోదీ ఫొటోలు ఉండటం లేదని ఫిర్యాదు చేశారు.
గ్రామస్థాయిలో వేసిన జన్మభూమి కమిటీల్లో పార్టీ సభ్యులకు స్థానం లేదని, టిడిపి సూచించిన వారికే పనులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ తమ పార్టీ నాయకులకు టిడిపి ప్రభుత్వం ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని, అడుగడుగునా అవమానిస్తున్నారని, బిజెపి నేతలు చెప్పిన ఏ పని చేయవద్దని అధికారులను ఆదేశిస్తున్నారని చెప్పారు. నిరంతర విద్యుత్ పథకాన్ని కూడా బాబు ప్రభుత్వం తమ సొంతమేనని చెప్పుకుంటోందని ఫిర్యాదు చేశారు.
అన్నీ విన్న అమిత్‌షా తాను అన్ని మార్గాల నుంచి రాష్ట్రానికి సంబంధించిన సమాచారం తెప్పించుకుంటున్నానని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే పొత్తుల విషయం బయట మాట్లాడవద్దని, రెండేళ్లలో బూత్ కమిటీ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉండాలని సూచించారు. పార్టీలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నా టిడిపితో పొత్తువల్ల ముందుకు రావడం లేదని కొందరు నేతలు ఫిర్యాదు చేసినప్పుడు, వారి జాబితా నాకివ్వండి నేను చూసుకుంటానని బదులిచ్చారు. అయితే, గతంలో అలాంటి జాబితా తాము రాష్ట్ర కమిటీకి ఇస్తే, కొద్దిరోజుల తర్వాత అదే నేతలను టిడిపి వాళ్లు చేర్చుకున్న విషయాన్ని వారు అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.
బాబు గ్రాఫ్ పడిపోతోంది: కావూరి
‘రాష్ట్రంలో చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారింది. దానితో ఆయన గ్రాఫ్ పడిపోతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లాం. మేం ఇక్కడ జరుగుతున్నవే చెప్పాం’ అని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివరావు మీడియాకు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలన కంటే ఘోరమైన అవినీతి పాలన సాగుతోందని, జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి కార్యకర్తలు లబ్థిపొందుతున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో బిజెపి కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్నారని, ఏ విషయంలోనూ బిజెపిని పట్టించుకోవడం లేదన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించనన్నారు. రాజీవ్ మరణం తర్వాత చాలా ఫలితాలు తారుమారైనట్లే ఇక్కడా ఏదైనా జరగవచ్చు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని కావూరి వ్యాఖ్యానించారు.