జాతీయ వార్తలు

‘నీట్’ విచారణపై తొందరేం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత కమ్ ప్రవేశపరీక్ష (నీట్)ను మళ్లీ తాజాగా నిర్వహించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. నీట్ ప్రశ్న పత్రాలు బిహార్‌లో లీకయ్యాయని, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో కూడా బైటికి వచ్చాయని, అందువల్ల ఈ పరీక్షను మళ్లీ తాజాగా నిర్వహించాలని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, నవీన్ సిన్హాలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావనకు వచ్చిన ఈ పిటిషన్ కోరింది. దేశవ్యాప్తంగా 2017 నీట్ ఫలితాలను ప్రకటించడంపై మద్రాసు హైకోర్టు తాత్కాలిక స్టే మంజూరు చేసిన ఒక రోజు తర్వాత ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రావడం గమనార్హం. ఈ నెల 7న దేశవ్యాప్తంగా 1900 కేంద్రాల్లో నిర్వహించిన ‘నీట్’ పరీక్షకు 11 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయిన విషయం తెలిసిందే. నీట్-2017 ఫలితాల వెల్లడిపైనా స్టే ఇవ్వాలని ఆ పిటిషన్ సుప్రీంకోర్టును కోరింది. అయితే మద్రాసు హైకోర్టు ఇప్పటికే ఫలితాల ప్రకటనపై తాత్కాలిక స్టే విధించినందున ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ‘మీరు చెప్తున్న కారణాలు ఏమయినప్పటికీ ఫలితాల ప్రకటనపై ఇప్పటికే స్టే ఉంది. స్టే వేరే కారణాలపై కావచ్చు కానీ ఫలితాలు ప్రకటించరు కదా?’ అని బెంచ్ ఒక ప్రైవేట్ ట్రస్టు తరఫున పిటిషన్ దాఖలు చేసిన లాయరును ప్రశ్నించింది. పరీక్షలో అందరికీ ఒకే రకమైన ప్రశ్నపత్రం ఇవ్వలేదని, ఇంగ్లీషు ప్రశ్నపత్రానికి, తమిళ ప్రశ్నపత్రానికి చాలా తేడా ఉందని ఆరోపిస్తూ దాఖలయిన పలు పిటిషన్లపై మద్రాసు హైకోర్టు బుధవారం ఫలితాల ప్రకటనపై తాత్కాలిక స్టే విధించడం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వచ్చే నెల 7లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పరీక్ష నిర్వహించిన సిబిఎస్‌ఇ డైరెక్టర్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను హైకోర్టు ఆదేశించింది కూడా.