తెలంగాణ

వణికించిన గాలివాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నిజామాబాద్ అతలాకుతలం

కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
పూర్తి అంధకారంలో మూడు జిల్లాలు
వ్యవసాయోత్పత్తులకు భారీ నష్టం
ముద్దయిన వేల క్వింటాళ్ల ధాన్యం
విరిగిన చెట్లతో స్తంభించిన రాకపోకలు

ఆదిలాబాద్/ నిజామాబాద్, మే 27: తెలంగాణ జిల్లాలను రెండోరోజూ గాలి దుమారం బెంబేలెత్తించింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో శనివారం సాయంత్రం గాలి దుమారం, భారీ వర్షం రైతులను కోలుకోని విధంగా దెబ్బతీసింది. భీకరమైన పెనుగాలులకు తోడు వడగండ్ల, వర్షానికి ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాల్లో 55 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు తెగి పడి మూడు జిల్లాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. అకాల వర్షం ధాటికి విద్యుత్ పునరుధ్దరణకు 15 గంటల సమయం పడుతుందని ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, తలమడుగు, జైనత్, ఆదిలాబాద్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, బోథ్, ఇచ్చోడ, నిర్మల్ జిల్లాలోని కడెం, ఖానాపూర్, భైంసా, లోకేశ్వరం, కుంటాల, కుబీర్, దిలావర్ పూర్, కుమ్రం భీం జిల్లాలోని కౌటాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, జైనూర్ మండలాల్లో భారీ ఎత్తున చెట్లు విరిగి పడగా, సుమారు 45 గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. గాలి వాన భీభత్సానికి రోడ్లకు ఇరువైపులా చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఇదిలావుంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంతోపాటు కలెక్టరేట్, బస్టాండ్ ఏరియాలో పెనుగాలులకు చెట్లు విరిగి పడటంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఇదిలావుంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 8 విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ఆదివారం మధ్యాహ్నం వరకూ కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వర్షానికి షెడ్డు కూలిపోగా, రైతులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఐదు రోజులుగా మార్కెట్ యార్డుకు వేరుశెనగ తీసుకొచ్చి కొనుగోలు కోసం నిరీక్షిస్తున్న రైతులు భారీగా నష్టపోయారు. సుమారు 15 వందల క్వింటాలు వేరు శెనగ పంట తడిచి పోగా రైతులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్షంలోనే ధర్నా చేపట్టారు. వేరు శనగకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా, కొనుగోలు చేపట్టకుండా మోసగిస్తున్నారని రైతులు మండిపడ్డారు. నిర్మల్ మండలంలోని వెంకటాపూర్‌లో నిర్మల్ పట్టణానికి సరఫరా అయ్యే 33/11 కెవి సబ్‌స్టేషన్ పరిధిలో 13 విద్యుత్ స్తంభాలు గాలివాన భీభత్సానికి నేలకొరిగాయి. దీంతో నిర్మల్ జిల్లా అంధకారంలో మునిగిపోయింది. నిర్మల్, సారంగపూర్, ఖానాపూర్, కుంటాల, దిలావర్‌పూర్, భైంసా మండలాల్లో రైతులు విక్రయానికి తీసుకొచ్చిన వరిధాన్యం నిలువలు తడిసి ముద్దవడంతో వాటిని కాపాడుకోవడానికి వారు నానా తిప్పలు పడ్డారు. ఐకెపి, పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం నిలువలు వర్షానికి కొట్టుక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కుమ్రం భీం జిల్లాలోనూ గాలి వాన భీభత్స సృష్టించింది. పెనుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. రైతులు అమ్మకానికి ఉంచిన వరిధాన్యం తడిసి పోయింది.
నిజామాబాద్ అతలాకుతలం
నిజామాబాద్ జిల్లాలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఆరున్నర సమయంలో విపరీతమైన వేగంతో గాలులు వీస్తూ వర్షం ప్రారంభమైంది. దీంతో ఇళ్లు, దుకాణ సముదాయాలపై ఉంచిన రేకులు ఎగిరిపోయాయి. నిజామాబాద్‌లో ఏకధాటిగా గంటన్నరపాటు భారీ వర్షం కురిసింది. వేసవి తాపంతో తల్లడిల్లిన ప్రజలకు ఉపశమనం కల్పించినప్పటికీ, నష్టం మాత్రం తప్పలేదు. వందలాదిగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలోనూ గాలివాన పెను దుమారం సృష్టించింది. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి వ్యవసాయోత్పత్తులకు భారీ నష్టం వాటిల్లింది.

చిత్రం... నిర్మల్ రూరల్ మండలంలోని మంజులాపూర్‌లో భారీ వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం