తెలంగాణ

తిరుగులేని తెరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఎన్నికలొచ్చినా 111 స్థానాలు ఖాయం

ఎంఐఎంకు 6, కాంగ్రెస్‌కు 2, బిజెపికి సున్నా
పార్టీ శ్రేణులకు సర్వే ఫలితాలు వెల్లడించిన కెసిఆర్
జూలైలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ
తెరాస ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీలో వెల్లడి

హైదరాబాద్, మే 27: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ రాష్ట్ర సమితికి 111 స్థానాలు లభించటం ఖాయమని సిఎం కె చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఎంఐఎంకు 6, కాంగ్రెస్‌కు రెండు స్థానాలు లభిస్తాయని, బిజెపికి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేల సమాచారం ప్రకారం ‘2019 ఎన్నికల్లో మనం స్వీప్ చేస్తాం’ అని సిఎం ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ భవన్‌లో తెరాస శాసన సభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నియోజక వర్గాల వారీ సర్వేలు నిర్వహిస్తున్నారు. తాజా సర్వే వివరాలను కెసిఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వివరించారు. గతంలో ప్రతి నియోజకవర్గ పరిస్థితిపై నివేదికలను ఎమ్మెల్యేలు అందరికీ ఇచ్చారు. అయితే ఈసారి అలాకాకుండా నియోజకవర్గాల వారీ పరిస్థితి ఎలా ఉందో కెసిఆర్ చదివి వినిపించారు. ఆరు నెలలకు ఒకసారి సర్వే జరిపిస్తున్నా, ఇప్పటి వరకు మూడుసార్లు సర్వే ఫలితాలను ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చదివి వినిపించారు. మోదీ హవా వచ్చే ఎన్నికలనాటికి అంతగా ఉండదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. కల్వకుర్తి, మధిర స్థానాల్లో తెరాస కన్నా కాంగ్రెస్‌కు ఒకశాతం ఎక్కువ మొగ్గు ఉందని, మంచి నాయకులుంటే కష్టపడితే ఈ నియోజక వర్గాల్లోనూ అనుకూల ఫలితాలు సాధించవచ్చని కెసిఆర్ సూచించారు. కల్వకుర్తి, మధిర పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని నేతలకు సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో ఆరు నియోజక వర్గాల్లో ఎంఐఎం గెలుస్తుందని చెప్పిన కెసిఆర్, దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పాత నగరంలో ఏ పార్టీ ఏంచేసినా ఎంఐఎందే విజయం అనే భావన అన్ని పార్టీల్లో బలంగా ఉంది.
కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, పార్టీ పరిస్థితి మెరుగ్గావున్నా ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి ఉందని కెసిఆర్ వివరించారు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా కనిపించినా, తెలంగాణలో దాని ప్రభావం కనిపించలేదన్నారు. ఈసారి దేశంలో గతంలో మాదిరిగా మోదీ హవా అంతగా ఉండదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మంత్రులు, శాసన సభ్యులు, ఎంపీలు సమన్వయంతో పని చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. 2014 ఎన్నికలకు ముందు సర్వే చేయించిన సంస్థతోనే కెసిఆర్ వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో 71శాతం మంది ఓటర్లు తెరాసకు అనుకూలంగా ఉన్నారని, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే చెప్పారు. ఎన్నికల్లో అదేవిధంగా ఫలితాలు అందాయి. రికార్డు స్థాయిలో వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. అనంతదరం నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలు, పాలేరు ఉప ఎన్నికల్లో సైతం ఇదే సంస్థతో సర్వే చేయించి ముందుగానే విషయం వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వందస్థానాల్లో తెరాస విజయం సాధిస్తుందని సర్వే సంస్థ చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. సొంతంగా మేయర్ స్థానాన్ని గెలిస్తే చెవి కోసుకుంటానని సిపిఐ నారాయణ సవాల్ చేశారు. అయితే 99 స్థానాల్లో తెరాస విజయం సాధించింది. గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సర్వే ఫలితాలను తెరాస ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
జూలైలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జూలైలో మొదలయ్యే అవకాశం ఉందని సిఎం కెసిఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో వెల్లడించారు. జూలైలో ప్రక్రియ ప్రారంభం కావొచ్చని కేంద్రంలో వినిపిస్తోంది. అదే జరిగితే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని కెసిఆర్ తెలిపారు.

చిత్రం... తెరాస ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్