తెలంగాణ

జనంలోకి వెళ్లండి ప్రతి పనిలో మీరు కనిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ‘‘జనంలోకి వెళ్లండి. మీ నియోజకవర్గంలో జరిగే ప్రతి పనిలో మీరు కనిపించాలి. రాష్టవ్య్రాప్తంగా పెద్దఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి ఆ పనుల్లో భాగస్వాములవండి’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసన సభ్యులను ఆదేశించారు. రాజకీయ వాతావరణం క్రమంగా ఎన్నికల వైపు పయనిస్తుండడంతో నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు సూచించారు. మిషన్ భగీరథ పనులు చివరి దశకు వచ్చాయి. మీ నియోజకవర్గాల్లో ఈ పనులు జరిగేటప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజి, పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తయ్యే లోగానే నీటి పారుదల కాల్వల నిర్మాణం పూర్తి చేసుకోవాలని, ఈ విషయంలో ఆ కాలువల పరిధిలోని ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని కెసిఆర్ కోరారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాలువలు ఉన్నాయని, వాడకంలో లేక ఫీడర్ ఛానళ్లు, పంట కాలువలు పూడుకుపోయాయని ముఖ్యమంత్రి చెప్పారు. వాటికి వెంటనే మరమ్మతు చేయాలని చెప్పారు. ఎక్కడ ఏ పనులు అవసరమో గుర్తించి, అధికారులతో చేయించాలని సలహా ఇచ్చారు. సాగునీటికోసం అనేక ప్రాజెక్టులు కడుతున్నామని, నీరందించాల్సింది కాలువలే కాబట్టి అవి మందుగా సిద్ధం చేయాలని అన్నారు. బ్యారేజీల నిర్మాణం జరగడానికి ముందే పంపుహౌజ్‌లద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలున్నాయని, కాలువలు సిద్ధంగా ఉంటే చెరువులు నింపుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. మిషన్ భగీరథ పనులపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. తమ నియోజకవర్గానికి నీళ్లందించే ఇన్‌టేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంపుహౌజ్‌లు, సబ్ స్టేషన్లు, పైపులైన్ల నిర్మాణం ఎక్కడి దాకా వచ్చింది? నిర్ణీత సమయంలో పనులు అవుతున్నాయా? అనే విషయాలను గమనించాలని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యేలు పట్టించుకోకుంటే పనులు వేగంగా జరిగే అవకాశం ఉండదని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని, గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపు లైన్ల నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు.
గ్రేటర్ వరంగల్‌లో విలీనం అయిన 42 గ్రామాల్లో కూడా గొర్రెల పెంపకం కార్యక్రమం కింద యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో ఇటీవల చేరిన గ్రామాలకు అవకాశం లేకుండా పోయింది. వరంగల్ మేయర్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆ 42 గ్రామాల వారికి కూడా గొర్రెలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎస్టీ బాలికలకోసం ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ జూన్‌లోనే ప్రారంభం కావాలని మంత్రి చందూలాల్‌ను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయక్, కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, సాయన్న, పువ్వాడ అజయ్, స్టీఫెన్‌సన్, సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, రేఖానాయక్, బాబురావు రాథోడ్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు.