తెలంగాణ

‘నైరుతి’ ఆగమనం రైతుల్లో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూన్ 12: బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంగా నైరుతి రుతుపవనాలు రాయలసీమ మీదుగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాను తాకడంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన తొలకరి వర్షాలకు రహదారులన్నీ జలమయం కాగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో మొన్నటి వరకు ఏడారిని తలపించిన కుంటలు, చెరువులు, జలాశయాలు తొలకరి వర్షాలకే జలకళను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో రెండు గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా పలురోడ్లు చిత్తడిని తలపించాయి. పట్టణంలోని జాతీయ రహదారిపై గల పంజాబ్ చౌరస్తా కూడలి వద్ద వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు తాంసి, తలమడుగు, ఉట్నూరు, గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బైంసా, బాసర, కుబీర్ మండలాల్లో నైరుతి పలకరించడంతో రైతులు పులకించిపోయారు. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటిన రైతులకు ఈ భారీ వర్షాలు అనుకూలించగా, మరోవైపు ఖరీప్ పనులు ఈసారి ముందస్తుగానే ఊపందుకోవడం గమనార్హం. నైరుతి రుతుపవనాల ఆగమనంతోనే జిల్లా అంతటా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదిలాబాద్ మండలంలో 12 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా గుడిహత్నూర్, తాంసి, ఉట్నూరు, జన్నారంలో 8 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జన్నారం మండలం మహ్మదాబాద్ వద్ద రాహదారి వంతెన కింద నిర్మించిన అప్రోచ్‌రోడ్డు తొలకరి వర్షాలకే కొట్టుకుపోవడంతో వంతెన కృంగిపోయి రాకపోలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు బోథ్, నేరడిగొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతూ జలకళను సంతరించుకుంది. దీంతో పర్యాటకుల తాకిడి కూడా క్రమంగా పెరుగుతోంది. కడెం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చిచేరుతుండడంతో సోమవారం నాటికి నీటిమట్టం 680 అడుగులకు చేరుకుంది.