కృష్ణ

హరిత - నీలం ప్రాజెక్టు పరిధి ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30: నగరంలో చేపట్టనున్న బ్లూ అండ్ గ్రీన్ సిటీ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా వీరపాండియన్ చైనా సంస్థ ప్రతినిధులు, మంగళగిరి కమిషనర్ టివి రంగారావుతోపాటు అర్బన్ గ్రీనింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమోహనరెడ్డితో కలిసి బుధవారం ఉదయం కృష్ణానదీ పరివాహక ప్రదేశాలైన రైవస్ కాల్వ, ఏలూరు, బందర్ కాల్వల గట్ల తోపాటు బిఆర్‌టిఎస్ రోడ్డు వెంబడి గులాబి తోట, మధురానగర్ అల్లూరి సీతారామరాజు వంతెన వరకూ, సాంబమూర్తి రోడ్డు అలంకార్ సెంటర్ వరకూ గల కాల్వగట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వారు ఏలూరు కాల్వ గట్ల ఆధునీకరణ తోపాటు కాల్వలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక అందజేయాలని సూచించారు. అలాగే మోడల్ కెనాల్ గెస్ట్, దుర్గాఘాట్, పున్నమి ఘాట్‌లను కలుపుతూ సుమారు రెండు కిలో మీటర్ల మేర ఒకే ఘాట్‌గా అభివృద్ధి పర్చేందుకు గాను అక్కడ ఉన్న నివాసాలను తొలగించి జి ప్లస్ త్రీ భవనాల్లో పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే పూర్తయిన సర్వేలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎపిఐఐసి కాలనీలో నర్సరీ, బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకూ అభివృద్ధి పర్చిన వాకింగ్ ట్రాక్‌లను పరిశీలించిన వారు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు మరిన్ని సదుపాయాల కల్పనలపై దృష్టిసారించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసిజి పి అరుణ్‌బాబు, సిఇ ఎంఎ షుకూర్, సిటీప్లానర్ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

హంస, ఉగాది పురస్కారాలకు ఎంపికకు
ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన 14 మందితో కమిటీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8న జరిగే దుర్ముఖ నామ సంవత్సర ఉగాది వేడుకలు సందర్భంగా వివిధ రంగాల నుంచి హంస, ఉగాది పురస్కారాలకు ఎంపిక కోసం శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో విజయవాడ కల్చరల్ సెంటర్ సిఇవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూచిపూడి నాట్యారామం ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ శాసనమండలి సభ్యులు వివివి చౌదరి, మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఐనాక్, పద్మశ్రీ శోభానాయుడు, ప్రముఖ మృదంగ విద్వాంసుడు పద్మశ్రీ యల్లా నాగేశ్వరరావు, సినీ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ రచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ భాషా సేవకులు పొట్లూరి హరికృష్ణ, చిత్రకారుడు టి.వెంకట్రావు, ప్రముఖ నటుడు టి.వెంకట్రావు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, ప్రముఖ నటులు పెద్ది రామారావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ డి.విజయభాస్కర్ సభ్యులుగా నియమితులయ్యారు.
సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, హంస పురస్కారాలు, సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, వైద్యం, ఇంద్రజాలం, మూకాభినయం, హరికథ, బుర్రకథ, జర్నలిజం, సామాజిక సేవ, కమిటీ సిఫార్సు చేసిన ఇతర సేవా రంగాలలో ఉగాది పురస్కారాలకు తగు అభ్యర్థులను ఈ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ పురస్కారాలకు నగదు బహుమతి, హంస ప్రతిమ, శాలువా, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.

కాల్వగట్లకు పచ్చదనం శోభ
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30 : అపరిశుబ్రతకు నెలువుగా ఉండే నగర కాల్వగట్లన్నీ ఆహ్లాద, వినోద కేంద్రాలుగా మారనున్నాయి. ఒకపక్క రాజధాని అభివృద్ది, మరోపక్క పుష్కరాల సందర్భంగా ఇబ్బిడి ముబ్బిడిగా విడుదలవుతున్న నిధుల కారణంగా అపరిశుబ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నగర కాల్వగట్లను ఆధునీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నగరంలోని కెనాల్ రోడ్డు గట్టును సుందరీకరించిన అధికారులు ఒకొక్కటిగా మిగిలిన అన్ని గట్లను కూడా సుందరీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలో నదీకాల్వలతో సుందర నగరంగా ప్రఖ్యాతి గాంచిన వెన్నీస్ నగరానికి ధీటుగా కృష్ణానదీకి చెందిన మూడు కాల్వలు ప్రవహిస్తున్న విజయవాడ నగరాన్ని కూడా అంతే స్థాయిలో సుందరీకరించేందుకు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక చొవర చూపుతూ ప్రోత్సహిస్తున్న వైనం విశేషం. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, విఎంసి కమిషనర్ వీరపాండియన్‌తో పాటు జిల్లా కలెక్టర్ బాబు ఏ కూడా నదీకాల్వల పచ్చతోరణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆధునిక హంగులతో అభివృద్ది పర్చేందుకు శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ఈదశలో విఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ ఉన్న కెనాల్ రోడ్డు కాల్వగట్టును ఇప్పటికే పూర్తిస్థాయిలో అందమైన గ్రీనరీతో పచ్చతోరణం కట్టిన విషయం నగర ప్రజలందరికీ తెలిసిందే. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వన్‌టౌన్ వెళ్ళేందుకు మార్గంగా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడూ ఈకాల్వగట్టును చూసి ఔరా అనక తప్పదు. ఇదే స్ఫూర్తిగా తీసుకొని కళాక్షేత్రం వద్దగల మూడు కాల్వల గట్టు ప్రాంతాలను కూడా సుందరీకరించేందుకు నగర పాలక సంస్థ అధికారులు పూనుకొన్నారు. రాష్ట్ర రాజధాని నగరంగా గుర్తింపు పొందిన విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు గాను చైనా బృందంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన రివర్ ఫ్రంట్ సిటీ లో భాగంగా బ్లూ అండ్ గ్రీన్ సిటీ ప్రాజెక్టులకు చైనా బృందంతో శ్రీకారం చుట్టిన విఎంసి, ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం వరకూ ఉన్న కృష్ణానది ఒడ్డు మొత్తాన్ని ఒకే టూరిజం స్పాట్ బండ్‌గా అభివృద్ధికి సన్నాహాలు చేస్తుండగా మరొపక్క అందుకు ధీటుగా నగరంలో ఉన్న నదీ కాల్వగట్లను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ది పర్చేందుకు అంచనాలు తయారు చేస్తున్నారు. కాల్వగట్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడమే కాకుండా ఆహ్లాద, వినోద ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నారు. నగర మొత్తం మీద సుమారు 50 కిలో మీటర్ల మేరక కాల్వగట్లను సుందరీకించి నగరానికి పచ్చతోరణం తీర్చిదిద్దనున్న తరుణంలో అందుకు ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

క్రికెట్ బెట్టింగ్‌ల జోరు!
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 30: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్‌లు తారస్థాయిలో జరుగుతున్నాయి. అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న బెట్టింగ్‌లను నియంత్రించాల్సిన పోలీసులు చతికిలపడ్డారు. తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు కొన్నిచోట్ల క్రికెట్ బుకీలతో చేతులు కలిపి బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్నారు. దీంతో జిల్లా క్రికెట్ బెట్టింగ్‌లకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమయ్యే బెట్టింగ్‌లు నేడు మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించాయి. దీంతో టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభమైన నాటి నుండి నేటివరకు కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. టాస్ వేసే దగ్గర నుండి మ్యాచ్‌లో చివరి బంతి వరకు పలు రూపాలలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బాల్ బాల్‌కి, రన్ రన్‌కి బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఆరోజు జరిగే మ్యాచ్‌లతో పాటు మరుసటి రోజు జరిగే మ్యాచ్‌లపై కూడా పెద్దఎత్తున బెట్టింగ్‌లు కాస్తుండటం విశేషం. ఈ నెల 12న మ్యాచ్‌లు ప్రారంభమవ్వగా ఆదివారం ఫైనల్స్ జరగనున్నాయి. బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు గెలుపుపై పెచ్చు పందాలు జరిగాయి. ఉదయం న్యూజిలాండ్ జట్టుపై 30 పైసలు పెచ్చు ఇచ్చిన పందెపు రాయుళ్ళు సాయంత్రం అర్ధ రూపాయి ఇచ్చారు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పెచ్చు పందెం మరింత పెరగడం విశేషం. అలాగే గురువారం జరగనున్న రెండో సెమీ ఫైనల్ వెస్టిండీస్ - భారత జట్ల మధ్య కూడా బుధవారమే పెద్దఎత్తున పందాలు జరిగాయి. భారత్‌పై భారీస్థాయిలో బెట్టింగ్‌లు జరిగాయి. బెట్టింగ్‌ల విషయంలో క్రికెట్ బుకీలు చక్రం తిప్పుతున్నారు. తమ ఇళ్ళ వద్దనే భారీ ఏర్పాట్లు చేసుకుని ఫోన్‌లో బెట్టింగ్ రాయుళ్లను ఆహ్వానిస్తున్నారు. వేలు, లక్షల్లో బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున జిల్లాలో విచ్చలవిడిగా బెట్టింగ్‌లు జరుగుతున్నా పోలీసు శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. నిర్వాహకుల నుండి భారీగా ముడుపులు తీసుకుని బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌లు జరిగే ప్రాంతాల వైపు కనె్నత్తి చూడటం లేదనే విమర్శలను పోలీసులు ఎదుర్కొంటున్నారు. మ్యాచ్‌లు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక బుకీని కూడా అరెస్టు చేయకపోవడం ఈ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
నిర్దేశించిన సమయానికి
ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేయాలి
* కలెక్టర్ బాబు.ఎ
గన్నవరం, మార్చి 30: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బాబు ఎ సూచించారు. బుధవారం సాయంత్రం ఎయిర్‌పోర్టు విస్తరణ పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విస్తరణకు అవసరమైన అనుమతుల మంజూరుకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. రన్‌వే విస్తరణలో భాగంగా మూడు హైమ్యాక్స్ స్తంభాలను తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ మార్పును తక్షణం చేపట్టాలన్నారు. అవసరమైతే ట్రాన్స్‌కో సహకారం తీసుకోవాలని ఎయిర్‌పోర్టు ఇంజనీరింగ్ విభాగం అధికారి ప్రభాకర్‌ను సూచించారు. అలాగే స్టుష్ ప్రాజెక్టు మేనేజింగ్ కన్సలెన్సీ చేపట్టిన నాల్గవ టెర్మినల్ పనులు 50 శాతం పూర్తయినట్లు సంస్థ మేనేజర్ అనిల్‌దీక్షిత్ వివరించారు. పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు పనులు పూర్తయితే అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను ఇక్కడి నుండి నడపడానికి ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్, సింగపూర్, గల్ఫ్ తదితర దేశాలకు చెందిన విమానయాన సంస్థలు వస్తున్నట్లు ఆయన వివరించారు. జరుగుతున్న పనుల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో అనుకున్న సమయాని కంటే ముందుగా పనులు జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక లావాదేవీల్లో వివాదం..
మహిళ దారుణ హత్య
నూజివీడు, మార్చి 30: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దండుగుల వెంకటరత్నం, భార్య రుక్మిణి (50) గ్రామంలోని బిసీ కాలనీలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కోడలు ఉన్నారు. వీరంతా కూలీ పనులు చేసుకునేవారే. నూజివీడు మండలం గొడుగువారిగూడేనికి చెందిన మల్లెల చంటి కుటుంబ సభ్యులతో రుక్మిణికి ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయి. డబ్బు కోసం చంటి బుధవారం ఉదయం మీర్జాపురం గ్రామంలోని రుక్మిణి ఇంటికి వచ్చాడు. డబ్బులు లేవని రుక్మిణి సమాధానం చెప్పింది. డబ్బులు ఇచ్చేవరకు వెళ్ళనని చంటి భీష్మించుక్కూర్చున్నాడు. ఆ సమయంలో ఇతర కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్ళారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి రుక్మిణి హత్యకు గురై ఉంది. డబ్బుల కోసం ఇంటికి వచ్చిన చంటి రుక్మిణిని లోబర్చుకునే ప్రయత్నం చేసి, ఇద్దరు కలిసి మద్యం సేవించారని స్థానికులు చెబుతున్నారు. మృతదేహం పడి ఉన్న సంఘటన పరిశీలిస్తే పక్కనే సుత్తి ఉంది. సుత్తితో రుక్మిణి తలను ఛిద్రం చేసి చంటి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మద్యం సేవించిన తరువాత ఘర్షణకు దిగి వుంటారని, దీంతో మద్యం మైకంలో రుక్మిణిని చంటి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ ఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చంటి పరారులో ఉన్నాడని చెప్పారు.