తెలంగాణ

అప్పులే రైతన్న మెడకు ఉరితాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: పెండ్యాల మోహనాచారి.. సరిత.. ఇద్దరూ విద్యావంతులే... ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో చేసుకొని ఎలాంటి సమస్య లేకుండా జీవితం గడపగల దంపతులే.. కానీ, ఇద్దరికీ వ్యవసాయమంటే ప్రాణం. కానీ అదే వారి ప్రాణాలను హరించింది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, రంగాపురానికి చెందిన ఈ దంపతులు శుక్రవారం ఆత్మహత్య చేసుకోవడం రైతుల కష్టాలకు అద్దం పడుతోంది. వ్యవసాయానికి చేసిన అప్పులే ఉరితాళ్లుగా మారి రైతుల ఉసురును తీస్తున్న వైనాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపచేస్తున్నది. ఈ జంట ఆత్మహత్యకు ఎవరు కారకులు? చేసిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్నాయో, లేదో పట్టించుకోని ప్రభుత్వానిదా? లేక రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్న బ్యాంకర్లదా? తప్పు ఎవరిదైనా ప్రాణాలు పోతున్నది మాత్రం రైతులవేనని మోహనాచారి, సరిత దంపతుల ఆత్మహత్య మరోసారి రుజువు చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటుండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న కారణాలు అనేకం. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాగునీటి వసతి లేకపోవడంతో రైతులు వర్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఒకసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి రైతులను నిలువునా ముంచుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సిన బ్యాంకర్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో అడుగడుగునా కష్టాలను ఎదుర్కొంటున్న రైతును ఆదుకోవడానికిగానీ, సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణను చేపడితే తప్ప ఆత్మహత్యలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అలాంటి ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టి ఉంటే..., మోహనాచారి, సరిత వంటి అభ్యుదయ రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేవి కాదన్నది వాస్తవం.
కష్టాలకు అనేక కారణాలు
ప్రతి ఏటా విత్తనాల కొనుగోలు నుంచి కష్టాలను ఎదుర్కొంటున్న రైతులను ఆ తర్వాత నాసిరకం విత్తనాలు, నకిలీ విత్తనాలు నిలువునా ముంచేస్తున్నాయి. ఒకవేళ అదృష్టం బాగుండి మంచి విత్తనాలు లభించినా, వర్షాభావం వల్ల అవి మొలకెత్తుతాయో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు భూగర్భ జలాలు నానాటికీ ఇంకిపోతుండంతో వందల నుంచి వేల ఫీట్లకు వెళ్లినా బోరుబావులలో చుక్క నీరు కనిపించడం లేదు. సకాలంలో వర్షాలు పడి, విత్తనాలు మొలకెత్తినా పంటకు చీడపీడల బాధ తప్పడం లేదు. మార్కెట్‌ను ముంచెత్తుతున్న నకిలీ ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. ఇన్ని అవాంతరాలను అధిగమించినా, పంట చేతికి వచ్చే వరకూ నమ్మకం లేదు. భారీ వర్షాలు పంటను నాశనం చేయవచ్చు.
ఉత్పత్తులను భద్రపరచుకోవడానికి గిడ్డంగి సదుపాయాలు లభించక నష్టం వాటిల్లవచ్చు. వ్యయప్రయాసలను ఎదుర్కొని, చేతికి అందిన కొద్దోగొప్పో పంటను మార్కెట్‌కు తరలించినా, గిట్టుబాటు ధర లభించని పరిస్థితి. చేనులో విత్తు వేసింది మొదలు ఫలసాయాన్ని అమ్ముకునే వరకూ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు అన్నీఇన్నీ కావు. మరోవైపు బ్యాంకుల నుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల రైతులు ప్రైవేటు ఫైనాన్షియర్లను ఆశ్రయించక తప్పడం లేదు. అదే వారి పాలిట శాపమవుతున్నది.
జలగల్లా పీక్కుతింటున్న ఫైనాన్షియర్ల వేధింపులే చాలా మంది రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమన్నది నగ్నసత్యం. ఇటువంటి ఆత్మహత్యలను అరికట్టాలంటే ప్రభుత్వం అన్నదాతలకు సకాలంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే పంట నష్టపోయిన రైతులకు సమగ్ర బీమా పథకం ద్వారా ప్రయోజనం కలిగిలా చర్యలు తీసుకోవాలి. రైతుల పక్షాన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించడం, ప్రతి సీజన్‌లో ప్రతి పంటకు కొత్త రుణాలు ఇవ్వడం, ఆ సీజన్‌లో పంటలకు నష్టం వాటిల్లితే పాత రుణాలను మాఫీ చేసి, రైతులు మళ్లీ రుణాలు పొందే వెలుసుబాటును కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగినా, ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం రైతుల్లో కలిగించాలి. ఆ నమ్మకం కలిగినప్పుడే అన్నదాతల ఆత్మహత్యలు ఆగేందుకు ఆస్కారం ఉంటుంది.

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు (ప్రైల్‌ఫొటోలు)