తెలంగాణ

ఎమ్మెల్యేల్లో ‘డబుల్’ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: రోజులు గడుస్తున్నా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో వేగం కనిపించక పోవడంతో శాసన సభ్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇంకా 22నెలల్లో శాసన సభ సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం అధికారులు పెద్దగా మాట వినరు. ఏం చేయాలన్నా ఇంకా పదినెలల గడువు మాత్రమే ఉంది కానీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదని శాసన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల నాటికి రెండులక్షల 60వేల ఇళ్లను నిర్మించి చూపిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో లక్ష, మిగిలిన ప్రాంతాల్లో లక్షా 60వేల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం. అయితే కొన్ని నియోజక వర్గాల్లో మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పనులు వేగంగా సాగడం లేదు. ఆర్థిక మంత్రి ఈటల లాజేందర్ సైతం ఈ అంశంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొన్ని నియోజక వర్గాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పనుల్లో వేగం కనిపించడం లేదని అన్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ప్రతి నియోజక వర్గంలోనూ శంకుస్థాపనలు చేశారు. కానీ పనులు సాగడం లేదు. బన్సిలాల్‌పేట పరిధిలోని పొట్టి శ్రీరాములు కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే పథకం అమలులో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు.
చివరకు గత రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సైతం నిర్మించ లేదు. 2015-16లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 49115 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 45వేల 129 పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రధానమంత్రి అవాస్ యోజన పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్ష్యం 2709 కాగా, కనీసం ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు. అదే విధంగా 2015-16కు 3362 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు. ఇక 2016-17లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 23,489 ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేది లక్ష్యం కాగా, ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో (డబుల్ బెడ్‌రూమ్ ) ఇళ్లు 92,066 మంజూరు కాగా కేవలం 798 ఇళ్లను మాత్రమే నిర్మించారు. 2016-17లో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను 4770 మంజూరు చేసి 628 మాత్రమే నిర్మించింది. 2016-17లో మొత్తం ఇళ్ల నిర్మాణ లక్ష్యం 1,20,325 కాగా, కేవలం 1426 ఇళ్లను నిర్మించారు. కేవలం ఒకే ఒక శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు. ఇక 2017-18లో కూడా గృహ నిర్మాణానికి సంబంధించి లక్ష్యాలు భారీగానే ఉన్నా, నిర్మాణాలు మాత్రం లక్ష్యాలకు తగినట్టుగా లేవు. 2,80,070 ఇళ్ల నిర్మాణం లక్ష్యం. వీటిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 95,833 ఇళ్ల నిర్మాణం, ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో 20143 నిర్మించాలి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు 82,645 ఇళ్లు నిర్మించాలి. అయితే శంకుస్థాపనల హడావుడి మాత్రమే కనిపిస్తోంది. సికిందరాబాద్ నియోజక వర్గంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ అంశం సమస్యగా మారకుండా ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నియోజక వర్గాల వారీగా ఎన్ని గృహాలు ఎప్పటి వరకు నిర్మించగలరో స్పష్టత ఉండాలని అంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో నష్టం కలుగుతుందనే ఆందోళన ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు.