తెలంగాణ

ఇక బంపర్ ఖరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి బంపర్‌గా ఖరీఫ్ సాగు కానుంది. పెద్ద సంఖ్యలోరైతులు పత్తిపంట సాగుకు మళ్లారు. ఆశించినట్లుగా వర్షాలు బాగా కురుస్తుండడం, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడం, కరెంటు కొరతలేకుండా వ్యవసాయపంపుసెట్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు మంచి కుషీమీద ఉన్నారు. 2017 ఖరీఫ్ సీజన్ మంచి రికార్డు స్ధాయిలో వివిధ పంట దిగుబడులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఖరీఫ్ పంట ప్రారంభంలోనే తొలి 45 రోజుల్లో నిర్దేశించిన 44 లక్షల హెక్టార్లలో 22 లక్షల హెక్టార్లలో పంట పనులు ఆరంభమయ్యాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారం వరకు ఖరీఫ్ పంట పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంది. ఈ లోగా మొత్తం 44 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేయడం పూర్తవుతుంది. ఈ రోజు వరకు గత ఏడాదిపైన ఇదే కాలంతో పోల్చితే 53 శాతం ఎక్కువగా పంట సాగు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఖరీఫ్ సీజన్‌లో 43.24 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 22.71 లక్షల హెక్టార్లలో ఇప్పటికే రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వర్షాలు సకాలంలో రావడంతో రైతులు ఉల్లాసంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఈసారి విశేషమేమిటంటే అన్ని జిల్లాల్లో రైతులు పత్తిపంటకు మళ్లారు. ఆ తర్వాత స్ధానం వరికి దక్కింది. రాష్ట్రంలో సాంప్రదాయంగా గత ఏడాది 8.41 లక్షల హెక్టార్లలో పత్తిపంటను సాగు చేస్తే, ఈ సారి రికార్డు స్ధాయిలో ఈ నెల 13వ తేదీ నాటికి 16.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. గత ఏడాది ఏడాది కంటే 84 శాతం ఎక్కువగా పత్తి పంటను సాగుచేశారు. వరి పంటను విశే్లషిస్తే పది శాతం ఎక్కువగా 9.34 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. జొన్న పంట 0.59 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ధాన్యపు పంటలనువిశే్లషిస్తే గత ఏడాది 3.94 లక్షల హెక్టార్లలో కందిపప్పు, పెసర, మినుము పంటలను సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే 4.22 లక్షల హెక్టార్లలో ఈ పంటలను వేశారు. తెలంగాణలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు వర్షాలు బాగా ఉండటం వల్ల భూగర్భజలాల పరిస్థితి మెరుగైందని భూగర్భజలశాఖ శనివారం ప్రకటించింది. 2016 మే నెలతో పోలిస్తే 2017 జూన్‌లో భూగర్భజలమట్టం 3.76 మీటర్లుపెరిగింది. గత నెలలో తెలంగాణలోని 25 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా నీరు భూమిలోకి ఇంకడంతో భూగర్భజలాలు పెరిగాయి. పీజోమీటర్ ద్వారా భూగర్భజలాల మట్టాలను పరిశీలించారు. 60 మండలాల్లో నీటిమట్టం 20 మీటర్ల వద్ద ఉండగా, 83 మండలాల్లో 15 నుండి 20 మీటర్ల మధ్య ఉంది. నూనె గింజల ఉత్పత్తికి సంబంధించి గత ఏడాది ఇదే కాలంలో 2.59 లక్షల హెక్టార్లలో సాగవుతే, ఈ ఏడాది ఇంతవరకు 3.25 లక్షల హెక్టార్లలో వెరుశెనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటలను రైతులు వేశారు. ఇంతవరకు 16.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగు ప్రారంభమైంది. మిరప 0.68 లక్షల హెక్టార్లలో, చెరుకు 0.36 లక్షల హెక్టార్లలో, ఉల్లి 0.05 లక్షల హెక్టార్లలో, పసుపు 0.47 లక్షల హెక్టార్లలో, ఇతర ఆహారపంటలను 1.89 లక్షల హెక్టార్లలో వేస్తున్నారు.
వర్షాలతో రైతుల్లో ఆనందం
రాష్ట్రంలో ఈ రోజు వరకు సాధారణంగా 216.5 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇంతవరకు 235.2 ఎంఎం వర్షపాతంనమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 371 ఎంఎం, ఆదిలాబాద్ జిల్లాలో 354.2 ఎంఎం వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తం పైన 251 మండలాల్లో 20 శాతం ఎక్కువగా, 209 మండలాల్లో సాధారణ వర్షపాతం, 118 మండలాల్లో 20 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లోనే అతి తక్కువ వర్షపాతం నమోదైంది.
2016 మే నెలతో పోలిస్తే 2017 జూన్‌లో భూగర్భజలమట్టం 3.76 మీటర్లు పెరిగింది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. జూన్ నెల మొదట్లో సగటున విద్యుత్ వినిమయం రోజుకు 130 ఎంయుకు పడిపోగా, ప్రస్తుతం 140 ఎంయుకు పెరిగింది. వ్యవసాయ విద్యుత్ వినిమయం పెరిగితే పంట దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని అంచనా.