తెలంగాణ

బోనమెత్తిన భాగ్యనగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్, జూలై 16: చారిత్రక భాగ్యనగరం బోనమెత్తి మురిసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస అమ్మవారి బోనాల సంబురాలు పాతబస్తీలో అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయబద్ధంగా ముస్తాబు చేసిన బోనాలను భక్తి శ్రద్ధలతో నెత్తిన పెట్టుకున్న చిన్నారులు, మహిళలు.. అమ్మవారి దేవాలయాల వద్ద బారులు తీరిన భక్తులు, యువకుల కేరింతలు, తీన్మార్ నృత్యాలు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు నింగినంటిన సంబురాలతో భక్తులు పారవశ్యం చెందారు. పాతబస్తీలోని 126 అమ్మవారి దేవాలయాలు భక్తజన సంద్రంతో ఆధ్యాత్మిక సౌరభంతో వెల్లివిరిసాయి. ఆషాఢమాస అమ్మవారి బోనాలలో పాతబస్తీలో ప్రధాన ఘట్టంగా లాల్‌దర్వాజ సింహవాహిని మహకాళీ అమ్మవారి దేవాలయ వేడుకలను పేర్కొంటారు. ఆదివారం తెల్లవారు ఝామున అత్యంత మహిమాన్విత సింహవాహిని మహాకాళి అమ్మవారికి మహాభిషేకం నిర్వహించటంతో బోనాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం భక్తులను బోనాలు సమర్పించేందుకు అనుమతించారు. ఉదయం నుండే మహిళాభక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పోటెత్తారు. ఉత్సవ కమిటీవారు భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా బోనాలు, దర్శనం, వీఐపీలకు విడివిడిగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాలెత్తుకున్న మహిళలతో వారి కుటుంబ సభ్యులు కలిసిరాగా కొరడాలు జులుపుతూ చిందులేసిన పోతురాజులు అగ్రభాగాన నిలిచారు. భక్తులు అందంగా తయారుచేసిన తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర అధికార పండుగగా గుర్తింపుపొందిన బోనాల మహోత్సవం పురస్కరించుకుని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు తెచ్చి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయన్నారు. అడక్కుండానే అమ్మవారు తెలంగాణలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిపిస్తుందన్నారు. బోనాలను తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని నగరాలు, అమెరికా సహా విదేశాలలో కూడా జరుపుకుంటున్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు. పాతబస్తీలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. నిజామాబాదు ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించారు. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ దేవేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. పాతబస్తీ బోనాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా హైదరాబాదు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 4000 మంది సిబ్బంది, పది షీ టీంలు, చైన్ స్నాచింగ్ ప్రివెంట్ టీమ్‌లు బందోబస్తులో పాల్గొన్నారు. పాతబస్తీలో సున్నితమైన 300 ప్రాంతాలలో సిసి కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల సంబురాలు పాతబస్తీలోని 126 దేవాలయాల్లో తెల్లవారుఝాము నుండి రాత్రి వరకు భక్తజన సందోహంతో కోలాహలంగా సాగాయి. పాతబస్తీ అమ్మవారి వేడుకలు సోమవారం ఘటాల ఊరేగింపుతో ముగుస్తాయి. సోమవారం మధ్యాహ్నం చాంద్రాయణగుట్టలో ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు ఉప్పుగూడ, లాల్‌దర్వాజ మీదుగా శాలిబండ, చార్మినార్, నయాపూల్ వరకు కొనసాగుతుంది.