తెలంగాణ

గోడ దూకబోయ బోర్లాపడ్డ పోలీసు బాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 17: పేకాట వ్యసనం ఓ పోలీసు అధికారి ప్రాణాల మీదకు తెచ్చింది. సదరు అధికారి పేకాట ఆడుతుండగా, స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేయడంతో, వారికి చిక్కకుండా పారిపోయేందుకు గోడ పైనుండి దూకిన క్రమంలో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. నిజామాబాద్ ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సదరు అధికారి ఏమాత్రం విరామం దొరికినా పేకాట ఆడడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే గత నాలుగు రోజుల క్రితం వినాయక్‌నగర్‌లోని బైపాస్ రోడ్డులోని ఓ స్థావరంలో తోటి జూదరులతో కలిసి పేకాట ఆడడంలో నిమగ్నమయ్యాడు. అయితే స్థానికులు పక్కా సమాచారం అందించడంతో కమిషనర్ కార్తికేయ నేతృత్వంలో పనిచేసే స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని పేకాట స్థావరంపై మెరుపుదాడి చేశారు. ఊహించని ఈ పరిణామానికి విస్తుపోయిన సదరు పోలీసు అధికారి, స్పెషల్ పార్టీ చేతికి చిక్కకుండా ఉండేందుకు వీలుగా ఇంటి గోడను ఎక్కి ఒక్కసారిగా కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు పోలీసు అధికారి రెండు అరికాళ్లు విరిగి తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అతనిని గుర్తించిన స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఆశ్చర్యానికి లోనై, ఆ వెంటనే తేరుకుని జిల్లా కేంద్రంలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన నుండి సదరు పోలీసు అధికారిని తప్పించి, మిగతా తొమ్మిది మంది జూదరులు పట్టుబడ్డారని, వారి వద్ద నుండి 57 వేల పైచిలుకు నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అదే రోజున సంబంధిత నాల్గవ టౌన్ పోలీసులకు జూదరులను అప్పగించగా, గ్యాంబ్లింగ్ కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు ఉపాధ్యాయులు సైతం ఉన్నారు. అయితే పేకాట ఆడుతూ పారిపోయే క్రమంలో గాయపడ్డ పోలీసు అధికారి పేరు మాత్రం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. సదరు అధికారి తీవ్రంగా గాయపడడంతో ఈ విషయం పోలీసు సిబ్బందిలో చర్చనీయాంశం అవుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న సదరు అధికారి తాను చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రి నుండి బుధవారం సాయంత్రం తన ఇష్టపూర్వకంగా డిశ్చార్జి తీసుకుని తాత్కాలికంగా విధులకు సెలవు పెట్టి ఇంటి వద్ద కాలక్షేపం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ జూదరుల నుండి పోలీసు అధికారిని మినహాయించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాకుండా స్పెషల్ పార్టీ పోలీసులు తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు సమాచారం. పేకాటరాయుళ్లు పట్టుబడ్డ విషయమై నాల్గవ టౌన్ ఎస్‌ఐ మధును వివరణ కోరగా, 14వ తేదీన వినాయక్‌నగర్‌లోని బైపాస్ రోడ్డు సమీపంలో పేకాట స్థావరంపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసిన విషయం వాస్తవమేనని నిర్ధారించారు. అయితే తొమ్మిది మంది జూదరులు పట్టుబడ్డారని, వారి వద్ద నుండి 57 వేల పైచిలుకు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తమకు అందించిన వివరాల మేరకు వారిపైనే కేసు నమోదు చేశామని, తమ శాఖకు చెందిన ఉద్యోగి పేకాట స్థావరం వద్ద నుండి పారిపోయే క్రమంలో గాయపడినట్టు స్పెషల్ పార్టీ పోలీసులు తమ దృష్టికి తేలేదని ఎస్‌ఐ మధు పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా దృష్టిని కేంద్రీకరిస్తే, జూదరుల జాబితా నుండి తప్పించిన పోలీసు అధికారి వైనం బయటపడే అవకాశం ఉంటుంది.