తెలంగాణ

ప్లీనరీకి టిఆర్‌ఎస్ సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: టిఆర్‌ఎస్ ప్లీనరీ కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించాలనే వ్యూహంలో భాగంగా ఖమ్మంలో ఈ నెల 27న ప్లీనరీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం ఈ రెండు జిల్లాల్లో మొదటి నుంచి టిఆర్‌ఎస్ బలహీనంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో అనూహ్యంగా పుంజుకున్న టిఆర్‌ఎస్ ఖమ్మంపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ప్లీనరీ నిర్వహిస్తోంది. ప్లీనరీలో చేసే తీర్మానాల కోసం రాజ్యసభ సభ్యులు కె కేశవరావు చైర్మన్‌గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరుగురు సభ్యులతో తీర్మానాల కమిటీ వేశారు. కె.కేశవరావు చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఎంపి వినోద్, పర్యాద కృష్ణమూర్తి, నిరంజన్‌రెడ్డి, పిడమర్తి రవి, ఎం ఫరీదుద్దీన్, రాములు నాయక్ సభ్యులుగా ఉన్నారు.
రెండేళ్ల తెలంగాణలో సాధించిన అభివృద్ధి, పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాలపై చర్చించి తీర్మానాలు రూపొందిస్తారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వంటి పథకాల ప్రభావం ప్రజల్లో ఎలా ఉంది, ఈ పథకాల పట్ల దేశం మొత్తం ఆసక్తి చూపుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని వీటిపై తీర్మానాలు చేయనున్నారు. అదేవిధంగా కోటి ఎకరాలకు సాగునీటిని అందించే బృహత్ ప్రణాళిక గురించి పార్టీ శ్రేణులకు స్పష్టమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో తీర్మానాల్లో దీనిని చేర్చనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.ఖమ్మం జిల్లాలో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించడం వెనుక బలమైన కారణం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. టిడిపి సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నా జిల్లాలో సొంతంగా పట్టు సాధించలేదు, పొత్తుల్లో భాగంగా ఎక్కువ సీట్లు వామపక్షాలకు కేటాయించేది. ఈ జిల్లాలో పట్టు సాధించే వ్యూహంలో భాగంగా ఇక్కడ ప్లీనరీ నిర్వహించాలని టిఆర్‌ఎస్ అధినాయకత్వం నిర్ణయించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలో తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్ ఎదిగే విధంగా ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. జిల్లాలో వామపక్షాలు పూర్తిగా బలహీనంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో బలపడాలని టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే జిల్లాలో ప్లీనరీ నిర్వహిస్తున్నారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో జిల్లాలో పార్టీ బలపడేందుకు అవకాశం ఉందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.