తెలంగాణ

రిజర్వాయర్లకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 20: అల్పపీడన ప్రభావంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు లోటుతో దిక్కులు చూస్తున్న రైతులకు విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. రైతుల్లో ఆనందం వెల్లివిరియగా, ఖరీఫ్ పనులు జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్నాయి. శనివారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు గ్రామాలకు కల్వర్టులు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీరాంపూర్, ఖైరిగూడ, డోర్లి, గోలేటి బొగ్గు గనుల్లో వర్షం కారణంగా నాలుగు కోట్ల 20 లక్షల విలువైన 21 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం గమనార్హం. శ్రీరాంపూర్ డివిజన్‌లోనూ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా కార్మికులు నామమాత్రంగా హాజరయ్యారు.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఎగువ గోదావరి నుండి వరద నీరు పోటెత్తడంతో ఆదివారం కడెం జలాశయం నిండుకుండలా జలకళను సంతరించుకుంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం వరకు 696 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మరోవైపు గడ్డెన్నవాగు, స్వర్ణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. కుప్టి వాగు నుండి భారీ వరద నీరు కారణంగా కుంటాల, పొచ్చర జలపాతాలకు నీటి ప్రవాహం పెరిగి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో ఆదివారం 12 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా పట్టణంలోని సందీప్‌నగర్, వివేకానంద నగర్, అంబేద్కర్ చౌక్‌లో నీటమునిగాయి. గుండివాగు, కనె్నర్‌గాం వాగు, కమానవెల్లి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పది గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి.
చెన్నూర్ మండలంలోని సద్దుల వాగు ఉప్పొంగగా జనజీవనం స్థంభించిపోయింది. బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కౌటాల, బెజ్జూర్ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఖరీఫ్ పంటలకు ప్రాణం పోయగా ప్రాజెక్టు రిజర్వాయర్లలోకి నీటిమట్టం పెరగడం గమనార్హం. ఆదివారం నేరడిగొండలో అత్యధికంగా 16 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉట్నూరులో 14 సెం.మీటర్లు, ఆదిలాబాద్ డివిజన్‌లో 6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.

చిత్రం..వరద నీటితో జలకళను సంతరించుకున్న కడెం రిజర్వాయర్