తెలంగాణ

కనుమరుగవుతున్న పులులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో పులులు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. పులులను రక్షించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వేటగాళ్ల తుపాకులు, విద్యుత్ తీగలకు పులులు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. రాష్ట్రంలో రెండు పులుల అభయారణ్యాలు (టైగర్ రిజర్వ్) ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మంచిర్యాల జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2600 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో, కవాల్ టైగర్ రిజర్వ్ 2013 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అధికారిక సమాచారం ప్రకారం అమ్రాబాద్ అభయారణ్యంలో 13 నుండి 15 పులులు, కవాల్ అభయారణ్యంలో 8-9 పులులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం ఉండేది. ఈ ప్రాంతం నల్లమల అటవీప్రాంతంలో భాగంగా ఉండేది. నల్లమల అటవీప్రాంతం మహబూబ్‌నగర్, నల్లగొండ (పాత జిల్లాలు) కర్నూలు, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉండేది. రెండు దశాబ్దాల క్రితం ఈ అటవీ ప్రాంతంలో 50 కిపైగా పులులు ఉండేవని అంచనా. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం కూడా విడిపోయింది. కృష్ణానది ఉత్తర దిశలో ఉన్న అటవీ ప్రాంతం తెలంగాణలో, దక్షిణ దిశలో ఉన్న అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోకి మారింది. దాంతో ఇటు తెలంగాణలో ఎన్ని పులులు ఉన్నాయో, అటు ఎపిలోని అభయారణ్యంలో ఎన్ని పులులు ఉన్నాయో ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. తెలంగాణలోని కవాల్ అటవీ ప్రాంతంలో తిరిగే పులులే మహాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కూడా తిరుగుతుంటాయి. గతంలో పులుల అడుగుజాడలను పరిగణనలోకి తీసుకుని అవి ఎన్ని ఉన్నాయో అంచనా వేసేవారు. ఇప్పుడు దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా కెమెరాలు పెట్టి పులులతో పాటు ఇతర అటవీ జంతువుల కదలికలను, సంఖ్యను లెక్కిస్తున్నారు. పులుల అభయారణ్యం ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న భూముల్లో పంటలు వేస్తున్న రైతులు తమ పంటలను అడవిపందులు, ఇతర అడవి మృగాల నుండి రక్షించుకునేందుకు తమ పొలాల చుట్టూ విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్నారు. తీగల్లో హైఓల్టేజ్ విద్యుత్తు ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతంలో సంచరించే పులులతో పాటు ఇతర అటవీ జంతువులు విద్యుదాఘాతానికి మరణిస్తున్నాయి.
పులులు, చిరుతలు, హైనా, అడవికుక్కలు తదితర జంతువులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) డాక్టర్ మనోరంజన్ భాంజా తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, పులులను కాపాడేందుకు వాటికి మంచి ఆహారం, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. అటవీప్రాంతంలో జనసంచారం లేకుండా చూస్తున్నామని, విలువైన చెట్లను నరికే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. వన్యమృగాలను రక్షించేందుకు వీలుగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నామని వివరించారు. అడవి మృగాలను ఎవరైనా చంపితే, వేటాడితే అలాంటి వారిని గుర్తించి తమకు ఫోన్ (1800 425 5364) చేసి తెలియచేయాలని కోరారు. తమకు సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. అడవిమృగాల వల్ల ఎవరికైనా ఎలాంటి నష్టం వాటిల్లినా తమ శాఖ (అటవీశాఖ) నష్టపరిహారం చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

చిత్రాలు .. పులులు,* ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మనోరంజన్