తెలంగాణ

కాంగ్రెస్‌కు మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మరో షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు. ఎమ్మెల్యే చిట్టెం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణకు స్వయాన సోదరుడు. దీంతో ఇప్పటి వరకు కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సిఎం కెసిఆర్‌ను బుధవారం కలిసి పార్టీలో చేరే అంశాన్ని చర్చించారు. అనంతరం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 27న జరగబోయే తెరాస ప్లీనరీలో పెద్ద ఎత్తున స్థానిక పార్టీ నేతలు, అనుచరులతో అధికారికంగా చేరతారు. ఎమ్మెల్యే చిట్టెం తెరాస గూటికి చేరడం కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే చిట్టెం, తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో గొడవ జరిగింది. అప్పుడు బాలరాజు చిట్టెంపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు రెండు పార్టీల నేతలు వారికి నచ్చజెప్పడంతో గొడవ పరిష్కారమైంది.
చిట్టెం చేరడానికి రకరకాల కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమీ జరగడం లేదు. పైగా తెరాస తరఫున ఇన్‌చార్జి ఉండటం వల్ల నియోజకవర్గంలో గుర్తింపు లభించడం లేదు. నియోజకవర్గంలో వివిధ సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల వంటి పనులు కోసం ప్రజలు ఎమ్మెల్యే వద్దకు రాకుండా తెరాస ఇన్‌చార్జి వద్దకు వెళుతుండడం, దీంతో కాంగ్రెస్‌కంటే ఎక్కువ తెరాస బలపడుతున్నదన్న సంకేతాలు వినిపిస్తుండడం, వచ్చే ఎన్నికల నాటికి తెరాస నుంచి బలమైన అభ్యర్థి రంగంలో ఉండే అవకాశం ఉందని రామ్మోహన్ రెడ్డి భావించడమే. ఇప్పుడే కనుక టిఆర్‌ఎస్‌లో చేరకపోతే వెనుకబడిపోతామని, ఎన్నికల ముందు చేరాలనుకున్నా, టిక్కెట్ ఇవ్వలేమని, తెరాస కోసం పని చేసిన నేతకే ఇస్తామని చెబితే చేయగలిగిందేమి ఉండదని ఆయన భావించి అడుగు ముందుకేశారు. నిజానికి ఈ విషయంలో చిట్టెం తన సోదరి ఎమ్మెల్యే డికె అరుణతో చర్చించలేదు. కానీ మూడు నెలల క్రితమే రామ్మోహన్ రెడ్డి ఉగాది తర్వాత తెరాసలో చేరాలనుకుని, రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, టి. హరీశ్‌రావుతో మాట్లాడుకున్నట్లు సమాచారం.
‘కారు’ ఎక్కిన ఎమ్మెల్యేలు
చిట్టెంతో కలిపి తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. గతంలో విఠల్‌రెడ్డి (ముధోల్), కోరం కనకయ్య (ఇల్లెందు), రెడ్యా నాయక్ (డోర్నకల్), కాలె యాదయ్య (చేవెళ్ళ) తెరాస పార్టీలో చేరిపోయారు.