తెలంగాణ

తాగునీటికే కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమతులన్నీ వచ్చాకే సాగునీటికి వినియోగం

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కాళేశ్వరం ప్రాజ్టెక్టుపై వాదనలు బుధవారం ఒక కొలిక్కి వచ్చాయి. న్యాయమూర్తి జావేద్ రహీం నేతృత్వంలోని ఎన్‌జిటి ద్విసభ్య ధర్మాసనం కాళేశ్వరం ప్రాజెక్టుపై వాదనలు విన్నది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది సతీష్ ఉపాధ్యాయ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనిని వెంటనే నిలిపివేయించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఉపాధ్యాయ వాదనను తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గి తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా తాగునీటి పథకమని ఆయన కోర్టుకు వివరించారు. అన్ని అనుమతులు లభించిన తరువాతనే కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సాగునీటికి వినియోగిస్తామని ఆయన ధర్మాసనానికి వివరించారు. అనుమతులు లభించనంత వరకు ఈ ప్రాజెక్టు నీటిని తాగునీటి అవసరాల పూర్తికి మాత్రమే ఉపయోగిస్తామని రోహత్గి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన కోర్టుకు వివరించారు. అటవీ భూమిని ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించలేదని ఆయన కోర్టుకు తెలిపారు. తమకు మూడు నెలల గడువు ఇస్తే అన్ని రకాల అనుమతులకు సంబంధించిన అన్ని అంశాలను వెల్లడిస్తామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చారు. కోర్టు విచారణ గురువారానికి వాయిదా పడింది.
పోలవరంపై విచారించొద్దు: ఏపి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కేసులు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నందున దీనిపై ట్రిబ్యునల్‌లో ఎలాంటి విచారణకు అవకాశం ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను కోరింది. ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉన్న పోలవరం కేసులో తెలంగాణను కక్షిదారు హోదా నుండి తొలగించాలని ఏపి ప్రభుత్వం ఎన్‌జిటిని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ అనుమతి అవసరం లేదని, ఇదే విధంగా ఏడు మండలాలను ఏపిలో చేర్చినందున తెలంగాణలో ముంపు ప్రాంతాలు లేవని, ఈ కారణాల చేత ఈ కేసు నుండి తెలంగాణను తొలగించాలని ఏపి ప్రభుత్వం కోరింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జిటి నోటీసు జారీ చేస్తూ కేసును అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్‌కు మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం
ఇంటింటికి ఇంటర్నెట్,
డిజిటల్ పేమెంట్స్‌పై ప్రసంగం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఈ సదస్సులో ప్రధానంగా ‘సస్టైనబుల్-వైఫై’ అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్లశాఖ మంత్రి మనోజ్ సిన్హా నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 27న ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి-హబ్, ఇంటింటికి ఇంటర్నెట్, డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ సిటీస్‌పై మంత్రి కెటిఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. మొబైల్ మరియు సంబంధిత రంగాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తొలి అంతర్జాతీయ స్థాయి సదస్సు ఇది. డిజిటల్ ఇండియా విజన్ ఆవిష్కరణలను ఈ సదస్సులోప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి ప్రదర్శించనున్నారు. టెక్నాలజీ, వ్యాపారం, పాలసీ, డిజిటల్ లైఫ్ నాలుగు ప్రధాన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. ప్రభుత్వ అధికారులు, నిపుణులు, విద్యావేత్తలు, వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన సిఇఓలు ఇందులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ప్రత్యేక వక్తగా తనకు ఆహ్వానం రావడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం సాంకేతికత ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు లభించిన గౌరవంగా తనకు ఆహ్వానం అందిందని పేర్కొన్నారు.

గాంధీ డాక్టర్లపై దాడి.. మెరుపు సమ్మె

డిఎంఇ ప్రవేశంతో ఉపసంహరణ
డాక్టర్లు, సిబ్బంది రక్షణకు
చర్యలు: మంత్రి లక్ష్మారెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాజధానిలోని ప్రతిష్టాకరమైన గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లపై బుధవారం మరోపర్యాయం దాడి జరగడంతో జూనియర్ డాక్టర్లంతా మెరుపుసమ్మెకు దిగారు. వైద్య విద్య డైరెక్టర్ రమేష్‌రెడ్డి జోక్యంతో వారు తమ సమ్మెను ఉపసంహరించుకుని విధులకు హాజరవుతున్నారు. ఆ తర్వాత సాయంత్రం వైద్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డితో ‘జుడా’లు సమావేశమయ్యారు. వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పూర్వాపరాల్లోకి వెళితే.. మహ్మద్ మునీర్ (70) అనే వృద్ధుడిని అత్యవసర చికిత్స కోసం బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. మునీర్‌కు తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో అతడిపరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో తక్షణమే చికిత్స ప్రారంభించారు. చికిత్స జరుగుతుండగానే అతను చనిపోయాడు. దాంతో రోగి బంధువులు అక్కడే డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిపై దాడి చేసి కొట్టారు. ఈదాడిలో ఇద్దరు మహిళా జూనియర్ డాక్టర్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో జూనియర్ డాక్టర్లంతా నిరసన వ్యక్తం చేస్తూ మెరుపు సమ్మెకు దిగారు.
తమపై (జూనియర్ డాక్టర్లపై) దాడి జరగడం ఇది మొదటి పర్యాయం కాదని, గతంలో కూడా దాడులు జరిగాయని, రాజధానిలోని ఇతర దవాఖానాల్లో కూడా ఇదే విధంగా జూనియర్ డాక్టర్లపై దాడులు జరిగాయని జూనియర్ డాక్టర్లు గుర్తు చేశారు. తమకు భద్రత లేకపోవడం వల్ల విధులు నిర్వర్తించడం కష్టమన్నారు. ఈ పరిస్థితిలో ఆసుపత్రి ఉన్నతాధికారులు వెంటనే చిలకలగూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, మిగతావారికోసం గాలిస్తున్నారు.
జూనియర్ డాక్టర్లు మెరుపుసమ్మెకు దిగడంతో దవాఖానాల్లో చికిత్సకు అన్ని విభాగాల్లోనూ ఆటంకం కలిగింది. దాంతో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్‌రెడ్డి హుటాహుటిన గాంధీ దవాఖానాకు వచ్చి, సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, ఆర్‌ఎంఓలు, జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. దవాఖానాలో డాక్టర్లకు భద్రత కల్పిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లతో జరిపిన చర్చలు ఫలించాయని, మెరుపుసమ్మెను ఉపసంహరించుకున్నారని రమేష్‌రెడ్డి చెప్పారు. బుధవారం రాత్రం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, అన్ని దవాఖానాల్లోనూ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. చికిత్సావిభాగాల్లోకి అనవసరంగా రోగి బంధువులు రాకుండా చూస్తామని, ఐసియు, ఐసిసియుల్లోకి రోగుల వెంట ఉండేవారు రాకుండా చూస్తామన్నారు. రోగుల వద్దకు బంధువులు రావడం వల్ల ఇన్‌ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుందని, అందువల్ల రోగుల బంధువులు కూడా దవాఖానా సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.

తట్టు నివారణకు ఇచ్చే
టీకాలపై నివేదిక ఇవ్వండి
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: తట్టు నివారణకు ఇచ్చే టీకాలకు సంబంధించి వివరాలు సమర్పించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొన్ని పాఠశాలలు ఈ వాక్సినేషన్‌కు అమలుకు సహకరించడం లేదని, అనుమతించడం లేదని, 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ వాక్సిన్ ఇస్తారని డాక్టర్ శ్రీకృష్ణ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో 9 నెలలు నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో 97 శాతం మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిందని చెప్పారు. వచ్చే నెల 3వ తేదీ అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది.
ఏపిపిఎస్‌సి గ్రూప్-2
పోస్టుల నియామకంపై స్టే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్ -2 రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలుపుదల చేయాలని ఏపి ట్రిబ్యునల్ స్టే మంజూరు చేసింది. ట్రిబ్యునల్ సభ్యుడు ఎం విజయకుమార్ ఈ స్టేను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్ష మెయిన్ పరీక్ష నిర్వహణకు సంబంధించి కొన్ని సెంటర్లలో అవకతవకలు జరిగాయని కిరణ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ విచారించింది. పిటిషనర్ తరఫున వెంకటరావు వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసు విచారణను ట్రిబ్యునల్ వాయిదావేసింది.

విద్యార్థి దశనుండే క్రీడాస్ఫూర్తి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: విద్యార్థి దశ నుండే క్రీడాస్పూర్తి పెంపొందించుకోవాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో (సికింద్రాబాద్) ‘స్కూల్ ఫుట్‌బాల్ లీగ్’ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. పాఠశాల స్థాయి నుండే క్రీడల్లో రాణిస్తే, వ్యక్తిగతంగా కూడా ఉన్నతస్థాయికి చేరే అవకాశాలుంటాయన్నారు. విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాష్ట్రానికి చెందిన అనేక మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి పేరుప్రతిష్టలు తెచ్చారని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వివిధ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్లు (పిఇటి) ఉండేలా ప్రభుత్వం చూడాలని గవర్నర్ సూచించారు. మండలస్థాయి, జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడామైదానాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు ఆయన సూచించారు. తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్, కేరళ ఫుట్‌బాల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ లీగ్‌లో వివిధ జట్లు పెద్దఎత్తున పాల్గొంటున్నాయి. తొలుత క్రీడాకారులు గవర్నర్‌కు గౌరవ వందనం అందచేశారు. ఈక్రీడలను నిర్వహిస్తున్న సంస్థలను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు.

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు

ఇద్దరు దుర్మరణం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఉక్రెయిన్‌లో బీచ్‌వాలీబాల్ ఆడుతూ సముద్రంలోకి వెళ్లిన ముఖేష్ అనే మిత్రుడిని కాపాడటానికి వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఉక్రెయిన్ దేశంలోని జుపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్య చివరి సంవత్సరం చదువుతున్న హైదరాబాద్ కుంట్లూరుకు చెందిన శివకాంత్‌రెడ్డి, కడపకు చెందిన అశోక్‌లు సముద్రంలో కొట్టుకుపోయారని తెలిసింది. ఈ సమాచారం అందుకున్న వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. శివకాంత్ రెడ్డి సెలవులు ముగియడంతో ఈ నెల ఒకటవ తేదీనే అక్కడికి వెళ్లినట్టు తెలిసింది. సముద్రంలో వేట తర్వాత అశోక్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిసింది. అయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన కూడా మృత్యువుకు లోనయ్యారని చెబుతున్నారు.
15న ఫిట్జీ బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ టెస్ట్
విద్యార్థులు ఐఐటి జెఇఇ, కెవీపీవై, ఎన్‌టిఎస్‌ఇ, సీనియర్, జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ వంటి వివిధ పరీక్షలకు హాజరయ్యేందుకు తమకు ఉన్న శక్తి సామర్ధ్యాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు ఫిట్జీ బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ టెస్టును వచ్చే నెల 15న నిర్వహిస్తోంది. ప్రస్తుతం 5 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావచ్చు. ఆన్‌లైన్‌లో లేదా వ్యక్తిగతంగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఫిట్జీ డైరెక్టర్ ఆర్ ఎల్ త్రిక అన్నారు.
ఉపగ్రహ రూపకల్పనపై మేధామథనం
గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణం విద్యార్థులు జియోశాట్ పేరిట సొంత ఉపగ్రహాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా తొలి మేధామథన సదస్సు ప్రారంభమైంది. ఉపగ్రహాలపై విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకోగా, ఇస్రో, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం శాస్తవ్రేత్తలు వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. రూ. మూడు నుండి ఐదు కోట్ల నిధులతో సొంత ఉపగ్రహాన్ని రూపొందించాలన్న ఆలోచన మూడేళ్ల క్రితమే ప్రారంభమైనా, ప్రస్తుతం దానికో రూపం వచ్చిందని గీతం కాలేజీ ప్రిన్సిపాల్ సిహెచ్ సంజయ్ పేర్కొన్నారు.
ఒయు విద్యార్థి నవీన్‌కు నేషనల్ అవార్డు
కేంద్రప్రభుత్వ క్రీడా యువజన సర్వీసుల మంత్రిత్వశాఖ నుండి ఒయు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ తగరపు నవీన్ ఇందిరాగాంధీ నేషనల్ సర్వీసు స్కీం అవార్డుకు ఎంపికయ్యారు. ఆ శాఖ నుండి ఎంపిక పత్రాన్ని అందుకున్నారు. ఈ నెల 25న ఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్టప్రతి కోవింద్ చేతుల మీదుగా నవీన్ అవార్డు అందుకుంటారు. నవీన్‌ను ఉస్మానియా విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, రిజిస్ట్రార్ సిహెచ్ గోపాలరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ పరంధాములు అభినందించారు.
అణుశక్తిపై అపోహల తొలగింపునకు కృషి
అణుశక్తి ప్రయోజనాలు, వినియోగం, సురక్షితలకు సంబంధించి అణుశక్తిపై బహుముఖ ప్రజావగాహన కార్యక్రమాన్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ ఆఫ్ వీల్స్ ప్రచార కార్యక్రమం జరిగింది.

స్పై కెమెరాలపై నివేదిక ఇవ్వండి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: పబ్లిక్ ప్రదేశాలు, ఇండ్లు, మాల్స్‌లో మహిళలను టార్గెట్ చేసుకుని స్పై కెమెరాల ద్వారా రహస్యంగా చిత్రీకరిస్తున్న ఉదంతాలపై నివేదిక ఇవ్వాలని, దీనిపై స్పందించాలంటూ హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. హెవెన్ హోం సొసైటీ అనే ఎన్‌జివో సంస్ధ తరఫున జి దేవి అనే మహిళ దాఖలు చేసిన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జె ఉమాదేవి విచారించారు. విచ్చలవిడిగా స్పై కెమెరాలను వినియోగించడంపై మార్గదర్శకాలను జారీ చేయాలని, వీటిని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఏజన్సీలు విక్రయిస్తున్నాయని పిల్‌లో కోరారు. ఈ కేసులో పిటిషనర్ తరఫున బి రచనా రెడ్డి వాదనలు వినపించారు. స్పై కెమెరాల వల్ల మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, పోలీసులు తగిన చట్టం లేనందు వల్ల ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయలేకపోతున్నారన్నారు. అనంతరం రెండు రాష్ట్రాలు స్పై కెమెరాల విక్రయాలు, తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

మద్యం షాపుల

ఆదాయం రూ.411 కోట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: మద్యం షాపులు దక్కించుకోవడానికి దాఖలైన దరఖాస్తుల సంఖ్య తేలింది. రాష్టవ్య్రాప్తంగా 41,119 దరఖాస్తులు రాగా వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.411 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్టవ్య్రాప్తంగా 2216 మద్యం షాపులకుగాను దరఖాస్తులు ఆహ్వానించగా 41,119 దరఖాస్తులు అందాయి. వీటిని లాటరీ పద్ధతిలో డ్రా తీసి ఎంపిక చేసే ప్రక్రియ బుధవారం ముగిసింది. రమారమీగా ఒక్కో షాపునకు 18 మంది పోటీ పడినట్టు లెక్క తేలింది. మద్యం కొత్త విధానం అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం మద్యం షాపులు దక్కించున్న వారికి రెండు సంవత్సరాల కాలపరిమితికి లైసెన్స్‌లు జారీ చేస్తారు. మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా అంచనాలకు మించి అదనంగా 161 కోట్ల ఆదాయం వచ్చింది. జనాభా ప్రాతిపదికగా 50 వేలు, 5 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలకుపైగా (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) నాలుగు శ్లాబులలో మద్యం షాపులకు లైసెన్స్ ఫీజులు ఖరారు చేసిన విషయం తెలిసిందే.

కొన్ని ప్రాంతాలకే ‘నైరుతి’

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగానే ఉన్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు లేవు. జూన్ రెండోవారంలో ప్రారంభమైన రుతుపవనాలు వాస్తవంగా ఈ నెల చివరితో పూర్తవుతాయి. అయితే రుతుపవనాలు ఉత్తరభారతం వైపు నుండి మెల్లమెల్లగా ఉపసంహరించుకుంటూ వస్తాయి. ఈ ఉపసంహరణ అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది. తెలంగాణలో అక్టోబర్ మధ్య వరకు రుతుపవనాల ఉపసంహరణ జరగొచ్చని వాతావరణ శాఖ అధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 647 మిల్లీమీటర్లు కాగా, ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు 572 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే సాధారణం కంటే 12 శాతం తక్కువగా నమోదైంది. వాస్తవంగా దీన్ని సాధారణ వర్షపాతం కిందకే లెక్కిస్తారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే మెదక్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. రాజధాని హైదరాబాద్, గద్వాల జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే అసలే వర్షాలు లేని ప్రాంతాలు, వర్షాభావ ప్రాంతాలుగా మాత్రం ఏ మండలాలు, ఏ జిల్లాలు నమోదు కాలేదు. చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి అవసరమైన మేరకు నీరు చేరలేదు. దాంతో ప్రభుత్వం చెరువులు, కుంటల్లో చేపపిల్లలను విడిచేందుకు ఏర్పాట్లు జరిగినా, నీళ్లు లేని కారణంగా వీటిని విడిచే అవకాశం రాలేదు.
ఖరీఫ్ సీజన్‌లో 109 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకావలసి ఉండగా, 95 లక్షల ఎకరాల్లో సాగయింది. వరిపంట విస్తీర్ణం ఐదు లక్షల ఎకరాల్లో తగ్గింది. అయితే ప్రజలకు అవసరమైన బియ్యానికి లోటు ఉండబోదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మిగతా పంటల పరిస్థితి కాస్త అటుఇటుగా తక్కువ విస్తీర్ణంలోనే జరిగింది. పంటల ఉత్పత్తి ఎంత అవుతుందన్న అంచనాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

సగం నిండిన శ్రీశైలం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 20: అనూహ్యంగా వచ్చిన వరద నీటి ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు సగం నిండింది. శ్రీశైలం మల్లన్న సాక్షిగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుల గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టులో 112 టిఎంసికి నీటి నిల్వలు చేరాయి. 885 అడగులకు ప్రస్తుతం 861 నీటి మట్టం వద్ద నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి 1,40,371 క్యూసెక్కుల నీరు వస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ హౌస్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల దిగువకు దాదాపు 14వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆల్మట్టికి 25 వేల క్యూసెక్కులు నీరు వస్తుండగా, వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వదులుతున్నాలరు. జూరాల నుంచి 1,21,708 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉండగా శ్రీశైలం నీటి కోసం కృష్ణా బోర్డుపై ఒత్తిడి పెరుగుతోంది. శ్రీశైలం నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని లేదంటే మంచినీటి ఎద్దడి తీవ్రమవుతుందని తెలంగాణ ప్రభుత్వం మరో లేఖను కృష్ణాబోర్డుకు రాసింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం నీటిపై రాజకీయాలు ఊపందుకున్నాయి. సాగు తాగునీటి విషయంలో చంద్రబాబునాయుడు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని వైకాపా ధ్వజమెత్తింది. 854 అడుగుల వద్ద పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు ఆరు టిఎంసి నీటిని విడుదల చేయాల్సి ఉండగా, కేవలం ఆరు వేల క్యూసెక్కుల నీటిని కొద్ది రోజులు విడుదల చేసి ఆపు చేశారని వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరంతో ఏపి ప్రభుత్వం పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని బంద్ చేసిందని, రాయలసీమకు ద్రోహం చేస్తే సహించమని ఆయన హెచ్చరించారు. సీమలోని తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వలు, కడప-కర్నూలు కెనాల్‌లో చుక్క నీరు లేదని వైకాపా ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాంకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతోందన్నారు. వెంటనే పోతిరెడ్డిపాడుద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేయాలని ఆయన ఏపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా సుంకేశుల బ్యారేజీ బోసిపోయి ఉందని, తుంగభద్ర ఎగువ ప్రాంతంలో కర్నాటక అనేక ఎత్తిపోతల ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించిందని, రాయలసీమ ప్రాజెక్టులకు నీరందడం లేదన్నారు. నీటి విషయంలో రాయలసీమ కరవు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
కాగా నీటి విడుదలపై ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎడమ గట్టు విద్యుత్ హౌస్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని, కృష్ణాబోర్డు కూడా ఈ విషయమై త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ నీటిపారుల శాఖ అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వద్ద నీటి మట్టం ఉందని, 510 అడుగుల నీటి మట్టం చేరే వరకు జల విద్యుత్ ఉత్పత్తిని నిరంతరం ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.