తెలంగాణ

పెద్దల సభకు వెళ్లేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్17: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఫలితాల గురించి ఎవరికీ అనుమానం లేకపోయినా అభ్యర్థులు ఎవరూ అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం నుంచి రెండు స్థానాల భర్తీకి వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ టిఆర్‌ఎస్ విజయం సాధించడం తథ్యం. అయితే ఆ రెండు సీట్లూ ఎవరికి దక్కుతాయనేదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
వివిధ సామాజిక వర్గాల నుంచి తమకు అవకాశం ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుంచి తొలిసారిగా కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వం పొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలు టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించిన స్థానాల ప్రకారం టిఆర్‌ఎస్సేతర పక్షాలన్నీ కలిపి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు అవకాశం ఉండేది. ఎన్నికల తరువాత టిడిపి ఖాళీ కావడం, వైకాపానుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడం, బిఎస్‌పి విలీనం కావడంతో రెండు స్థానాలకు కావలసిన బలం టిఆర్‌ఎస్‌కు చేకూరింది. టిఆర్‌ఎస్‌కు ఇప్పుడు 84 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విపక్షాలు కనీసం పోటీకి అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి కూడా లేదు. నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం పది మంది సభ్యుల మద్దతు అవసరం. టిడిపికి పోటీ చేసే ఉత్సాహం ఉన్నా, నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమైనంత మంది సభ్యులు లేరు. ఇక కాంగ్రెస్‌లో సభ్యులు ఉన్నా పోటీ చేసి ఓడిపోవడం, సొంత పార్టీ సభ్యులే క్రాస్ ఓటింగ్ చేస్తారనే భయం వంటి కారణాలతో పోటీకి దూరంగానే ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రలో అధికారపక్షం కార్పొరేట్ వ్యాపారులకే రాజ్యసభ సభ్యత్వం కల్పించడం వల్ల విమర్శలు వచ్చాయని, తెలంగాణలో ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని పార్టీ నాయకులు సూచిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సాధారణ కుటుంబానికి చెందిన పి దయాకర్‌కు టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి మంచి ఇమేజ్ లభించిందని, రాజ్యసభ ఎన్నికల్లో సైతం ఇదే విధానం అవలంబించే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ఈసారి రాజ్యసభలో అవకాశం లభించవచ్చు.
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని కొందరు నాయకులు అడుగుతున్నారు. రెండు స్థానాల్లో తమకు ఒక స్థానం కేటాయించాలనేది బిసి నాయకుల డిమాండ్ కాగా, ప్రస్తుతం రాజ్యసభలో టిఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవరావు బిసి అయినందున ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వాలి అనేది కొందరి వాదన.
ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష పదవి నిర్వహించిన డి శ్రీనివాస్ టిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నా రాజ్యసభ సభ్యత్వం కల్పించడం ద్వారా తెలంగాణలో పెద్ద సంఖ్యలో డి శ్రీనివాస్ సామాజిక వర్గం మద్దతు కూడగట్టవచ్చుననేది ఆ వర్గం వాదన.
తెలంగాణ ఆవిర్భావ సమయంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం తెలంగాణ భవన్‌లో కెసిఆర్‌ను కలిసినప్పుడు రాజంను రాజ్యసభకు పంపిస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు. మీడియా ద్వారా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచినందుకు పారిశ్రామికవేత్త రాజంకు రాజ్యసభ సభ్యత్వం ఖాయం అని భావించారు. దానికి తగ్గట్టు కెసిఆర్ స్వయంగా ఈ విషయం ప్రకటించారు. అయితే ఆ తరువాత రాజం బిజెపిలో చేరారు. తిరిగి టిఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఆయనకు సామాజికవర్గం కోటా కింద అవకాశం కల్పించవచ్చునని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించనందున రాజ్యసభలోనైనా అవకాశం కల్పించాలని మహిళా నాయకులు కోరుతున్నారు.
కాంగ్రెస్, టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన శాసన మండలి సభ్యులకు పదవీ కాలం ముగిసిన తరువాత టిఆర్‌ఎస్‌లో తిరిగి శాసన మండలి సభ్యత్వం కల్పించారు. అదే విధంగా తనకు అవకాశం కల్పిస్తారని టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఆశిస్తున్నారు. అయితే ఇంతకుముందే రాజ్యసభలో బిసి నేత ఉండడం వల్ల సుధారాణికి అవకాశాలు సన్నగిల్లాయి. రాజ్యసభలో ప్రస్తుతం బిసి సభ్యుడు ఉన్నందున ఎస్సీ, ఓసి కోటా కింద ఆ వర్గాలకు చెందిన ఇద్దరిని నియమించాలని ఆ వర్గం నాయకులు తమ వాదన తాము సిద్ధం చేసుకుంటున్నారు. రెండు స్థానాల్లో ఓసిలకే అవకాశం ఇస్తే విమర్శలు వస్తాయనేది వారి వాదన. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఇలాంటి కోటాల పద్ధతిని పెద్దగా పట్టించుకోరని, రాజ్యసభలో సమర్ధవంతంగా తెలంగాణ వాణిని వినిపించే వారికి అవకాశం కల్పిస్తారని సన్నిహితులు చెబుతున్నారు.