తెలంగాణ

స్టేలతో కాంగ్రెస్ అడ్డుకున్నా కాళేశ్వరం ఎత్తిపోతలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరెలపై చిల్లర రాజకీయం చేసిన వారికి బుద్ధి చెప్పండి
పవర్‌లూం కార్మికులకు రూ.15 వేల వేతనం కల్పిస్తాం
ఆకు పచ్చ, చిరునవ్వుల తెలంగాణ రావాలి
సిరిసిల్ల బహిరంగ సభలో సిఎం కెసిఆర్

సిరిసిల్ల, అక్టోబర్ 11: కాంగ్రెస్ పార్టీ స్టేలతో అడ్డుకున్నా, ఎవ్వరు ఏమి చేసినా కాళేశ్వరం ఎత్తిపోతల నీళ్ళు ఏడాదిలో తెస్తామని, పనులు ఆపబోమని, ఆ నీటితో ప్రజల పాదాలు కడుగుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. బుధవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల సముదాయాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు. 31 జిల్లాలు, 584 కొత్త మండలాలతో భారత దేశంలో అతి పెద్ద పాలనా సంస్కరణలు తెచ్చిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు చేయని విధంగా 44 వేల కోట్ల వ్యయంతో సంక్షేమ కార్యక్రమాలతో నంబర్ వన్‌గా ఉన్నామన్నారు. పేదలకు చీరెలు అందాలని, నేతవృత్తిదారులు ఉపాధి పొందాలని బతుకమ్మ చీరలు తెస్తే దానిని రాజకీయం చేసి వక్రీకరించారని, వారి పాలనలో ఈ పనులు చేయలేదని, ఉపాధి లేక నేతన్నలు చచ్చినా పట్టించుకోలేదని, తాము చేపట్టిన పనికి అపార్థాలు, పెడార్ధాలు తీశారని, సమయం చూసి వారికి ప్రజలు బుద్ది చెప్పాలని, వౌనంగా ప్రేక్షక పాత్ర వహించవద్దని, చిల్లర రాజకీయాలు చేస్తే చెంప దెబ్బ కొట్టే బాధ్యత మీదేనని పిలుపునిస్తూ, వౌనంగా ఉంటే న్యాయం జరుగదని సిఎం పేర్కొన్నారు. వెయ్యి రూపాయల పెన్షన్ పథకం దేశంలో ఎక్కడా లేదని, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు కూడా పథకం అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పవర్‌లూం కార్మికుడికి నెలకు రూ.15 వేలు వేతనం వచ్చేలా ఉపాధి కోసం ప్రభుత్వ గుడ్డల ఆర్డర్లు నిరంతరం ఇస్తామని, చేతి నిండా పని కల్పిస్తామని, ఇందు కోసం అపెరాల్ పార్కులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడానికి అన్ని కుల వృత్తులను ఆదుకుంటున్నామని, అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత పర్చడానికి ‘రైతు సమన్వయ సమితి’లను ఏర్పాటు చేసి ఎకరానికి ఏటా ఎనిమిది వేలు ఇస్తున్నామని, రైతులు బాగు పడే వరకు, తెరాస పాలనలో ఉన్నంత కాలం ఇది కొనసాగుతుందన్నారు. రైతులు ఈసారి 50 లక్షల ఎకరాలలో పత్తి పంటలు వేశారని, అయితే ఈసారి అమెరికాలో తుఫాన్ల కారణంగా పత్తికి మంచి ధర వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది ఇలా పెద్ద ఎత్తున పత్తిపంట వేయరాదని రైతులకు పిలుపునిచ్చారు. రైతులు ఏ పంట వేయాలో, మద్దతు ధర ఎంత రావాలో సమన్వయ సమితిలు నిర్ణయిస్తాయని, వాటి సూచనల మేరకు రైతులు ముందుకు సాగాలని అన్నారు. ఆత్మహత్యలతో అల్లాడుతున్న నేత కార్మికులు, రైతుల దుస్థితి మారాలని బావించామని, ఆ దిశగా తమ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అన్నారు.
డబ్బు ఆశలో పడి ప్రైవేటు డాక్టర్లు అకారణ ఆపరేషన్లు చేసి, గర్భ సంచులు తొలగిస్తున్నారని, ప్రసవాలలో ఆపరేషన్లు చేస్తున్నారని దీనిని నిరోధించడానికి కెసిఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టామన్నారు. తమ మహిళా ప్రజా ప్రతినిథులు, మహిళా ఐఏఎస్ అధికారుల సూచన మేరకు ఈ పథకం రూపొందించామని, దీని ద్వారా గతంలో రాష్ట్రంలో లక్షా 20 వేల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని, ఇపుడ వాటి సంఖ్య 4 లక్షల 80 వేల మంది మహిళల ప్రసవాల నమోదు పెరిగిందన్నారు. వెయ్యి కోట్లతో పవర్‌లూం కార్మికులను యజమానులుగా చేసే పథకం చేపట్టామని, ఇందులో పది శాతం సబ్సిడి ఉంటుందని అన్నారు.
ఇక నుండి తెలంగాణలో కరెంటు పోదని, పాసిటివ్ దృక్పథంతో ముందుకు సాగుతున్నామన్నారు. రైతులు, చేనేత కార్మికులతో పాటు అన్ని కులవృత్తులను ఆదుకుంటున్నామని, ఆకపచ్చ తెలంగాణ రావాలని, చిరునవ్వుల తెలంగాణ కావాలని సిఎం కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ తన ప్రసంగం ముగించారు.