తెలంగాణ

సర్పంచ్‌గా కూడా గెలవని కోదండతో భయమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఎప్పుడైనా కనీసం సర్పంచ్‌గానైనా గెలుపొందారా? అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడు భయపడుతూ పర్యటనలకు ఎందుకు అడ్డుపడుతున్నారని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ ఎంతో కృషి చేశారని, విద్యార్థులను, యువతను చైతన్యవంతం చేశారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఉద్యమ సమయంలో రోడ్లపై వంటా-వార్పు చేపట్టినా, రోడ్ల దిగ్బంధం చేసినా అప్పుడు అధికారంలో ఉన్న తాము అడ్డు చెప్పలేదని ఆయన చెప్పారు. ఉద్యమ సమయంలో కోదండరామ్‌ను కెసిఆర్ మేలిమి బంగారం అని పొగిడారని ఆయన గుర్తు చేశారు. కోదండరామ్‌ను తానే టి.జెఎసి చైర్మన్‌గా చేశానని ముఖ్యమంత్రి చెప్పడాన్ని విహెచ్ ప్రస్తావిస్తూ తెలంగాణ వ్యతిరేకి అయితే ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న మంత్రి టి. హరీశ్ రావు తన మేనమామ కెసిఆర్‌ను కలిసి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశారు మామా! అని ప్రశ్నించాలని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ చేపట్టిన అమరుల స్పూర్తి యాత్రకు ప్రభుత్వం అడ్డు తగలడం భావ్యం కాదన్నారు. పైగా యాత్ర ప్రారంభించడానికి 10 రోజుల ముందే ప్రొఫెసర్ కోదండరామ్ పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. వరంగల్, జనగాం యాత్రకు పోలీసుల నుంచి అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ప్రొఫెసర్ కోదండరామ్ కలిసి కోరితే, తన చేతిలో ఏమీ లేదని, డిజిపిని కలవాలని హోం మంత్రి సలహా ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పోలీసు రాజ్యం కొనసాగుతున్నదనడానికి ఇదో నిదర్శనమని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు కాదు తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.