తెలంగాణ

నైపుణ్యాలకు మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21 : తెలంగాణ రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఇంటర్నేషనల్ యూత్ ఎంపవర్‌మెంట్ సెంటర్ (ఐవైఇసి)-తెలంగాణ ప్రభుత్వం మధ్య గురువారం ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు యువజన సంక్షేమ మంత్రి పద్మారావు నేతృత్వంలో సంబంధిత కార్యదర్శి దినకర్, ఐవైఇసి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ కిమ్ సూ ఇయాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ ఐవైఇసి ప్రధాన కేంద్రం కొరియాలో ఉందని, ఆ తర్వాత ఆసియా-యూరోపియన్ దేశాలకు ఉపయోగపడే విధంగా హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటవుతోందని చెప్పారు. ఈ కేంద్రంకోసం తమ ప్రభుత్వం హకీంపేట వద్ద ఉన్న స్పోర్ట్‌స్కూల్ ప్రాంగణంలో ఐదెకరాల భూమిని 33 సంవత్సరాల కోసం లీజ్‌కు ఇచ్చిందని వివరించారు. మూడు సంవత్సరాల కాలంలో వందకోట్ల రూపాయలు ఈ కేంద్రం కోసం వ్యయం చేసేందుకు ఐవైఇసి అంగీకరంచిందన్నారు. ఈ కేంద్రం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని యువతకే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల యువతకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సెమినార్లు ఏర్పాటు చేయడం, వివిధ రంగాల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కోసం శిక్షణ ఇవ్వడం, మేధస్సుకు పదునుపెట్టడం తదితర అంశాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

వడదెబ్బతో 19మంది మృతి
ఆదిలాబాద్/ కరీంనగర్/ నల్లగొండ/మహబూబ్‌నగర్/ వరంగల్/మెదక్, ఏప్రిల్ 21: తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రచండమైన ఎండల తీవ్రతకు ప్రతిరోజూ జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిప్పుల కుంపటిగా మండుతున్న ఎండలకు తోడు వడగాల్పుల సెగలతో జనం తల్లడిల్లిపోయారు. ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో జిల్లాలో గురువారం ఒకేరోజు ఎండదెబ్బకు 19 మంది మృత్యువాత పడ్డారు. కాగజ్‌నగర్ పట్టణంలో ప్రైవేట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న బండ్యాల రాంచందర్ (52), యశోద (67) అనే వృద్ధురాలు, దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్‌కు చెందిన టేకం లచ్చుబాయి (60), బెల్లంపల్లి పట్టణంలో కొమ్ము గంగులు (50) మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో గురువారం సాయంత్రం స్వామిరెడ్డి (68) అనే విశ్రాంత పిఇటి, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన ముక్క ఎల్లయ్య (65) అనే వృద్ధుడు, ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన భవన కార్మికుడు నమిలికొండ కిష్టయ్య (42) అనే వ్యక్తి, శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గురువారం ఎం.డి.మీర సాహెబ్ (65) అనే వ్యక్తి, ముత్తారం మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రీకాంత్ (25) అనే యువకుడు, హుజూరాబాద్ మండలంలోనని సిర్సపల్లి గ్రామంలో మన్యాల కొమురయ్య (80), పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో గీసిడి రాజ్యలక్ష్మి (60) సుల్తానాబాద్ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ఆరపెల్లి సంజీవ్ (50) అనే వ్యక్తి, జూలపల్లి మండలంలోని కుమ్మరికుంట గ్రామానికి చెందిన కల్లెపెల్లి ఓదమ్మ (66) అనే వృద్ధురాలు నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని గూడపూర్ గ్రామానికి చెందిన లేదాని సంజీవ (48) అనే రైతు, మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన నారోజు గణపతిచారి (57) రైతు, హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ మాచవరం గ్రామానికి చెందిన జడ రాములమ్మ (65) అనే వృద్ధురాలు, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తాటికొండ లక్ష్మి (54) అనే మహిళ, మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన చామంతి బాలయ్య (65) అనే వృద్ధుడు, మెదక్ మండలంలోని హవేళి ఘన్‌పూర్ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నందాల బాల్‌రాజ్ (56) వడదెబ్బతో మృతి చెందారు.

రామగుండం అగ్నిగుండం
అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
గోదావరిఖని, ఏప్రిల్ 21: కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎండల తీవ్రత రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గురువారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రామగుండం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోకుంటే ఎండలు, వడగాల్పులు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రజలు తల్లడిల్లిపోయారు. ఉదయం 8 గంటల నుండే భానుడి ప్రతాపం గంట గంటకూ పెరిగిపోతూ మధ్యాహ్నం వరకు భగభగ ఎండలతో రగిలిపోయింది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు మధ్యాహ్న వేళ ఎండ వేడికి తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. సింగరేణి యాజమాన్యం పనివేళలను మార్చాలని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఎన్టీపీసీ, ఏపీ జన్‌కో విద్యుత్ కేంద్రాల్లో కూడా మధ్యాహ్న పూట ఎండవేడిని తట్టుకునేందుకు కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.