తెలంగాణ

నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 15: నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండిపడడంతో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ గ్రామం జలమయంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలనీలను సాగర్ జలాలు పెద్దఎత్తున ముంచెత్తాయి. ఈ పరిణామంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురికావాల్సి వచ్చింది. ఇరిగేషన్ అధికారుల బాధ్యతారహిత్యం వల్ల వేలాది క్యూసెక్కుల నీరు వృథా అవడమే కాకుండా, రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం కుప్పలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. గత వారం రోజుల నుండి నిజాంసాగర్ నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లిస్తున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే నిజాంసాగర్‌కు అనుసంధానమై ఉన్న చెరువులను సైతం నింపుకునేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటరీలకు నీటిని వదులుతున్నారు. నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే అలీసాగర్ రిజర్వాయర్‌లోకి కూడా నీటిని మళ్లించి, పూర్తిస్థాయిలో నింపాలని భావించారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిస్ట్రిబ్యూటరీ-47 కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే ఈ కాల్వ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా, రెండు వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఠానాకలాన్ శివారులో అర్ధరాత్రి సమయంలో కాల్వకు గండి పడింది. దీంతో అలీసాగర్‌కు చేరుకుని, అక్కడి నుండి దిగువన ఉన్న ఇతర చెరువుల్లోకి మళ్లాల్సిన జలాలన్నీ ఠానాకలాన్ గ్రామాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ గండి పడిన చోటుకు సమీపంలోనే ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీ కాలనీలను ముంచెత్తడంతో పాటు గ్రామంలోని ఆయా చోట్ల ఆరబెట్టుకుని ధాన్యం కుప్పలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. బుధవారం ఉదయం వరకు గ్రామంలోని అన్ని రహదారుల మీదుగా, నివాస గృహాలను చుట్టుముడుతూ మోకాలి లోతు నీళ్లు ప్రవహించడం ప్రారంభమైంది. ఇళ్ల ముందు ఆరుబయట ఉంచిన ధాన్యం నిల్వలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. బుధవారం సాయంత్రం వరకు కూడా ప్రజలు తమ ఇళ్లను వీడి బయటకు రాలేదు. గ్రామస్థుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు తాపీగా బుధవారం ఉదయం 10 గంటల సమయానికి చేరుకుని గండి పూడ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. అప్పటికే వేలాది క్యూసెక్కుల నీరు వృథా కావడమే కాకుండా, రైతులు నష్టపోయేలా చేసింది. పంట పొలాలన్నీ జలమయమై చెరువులను తలపించాయి. బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండిపడిందని గ్రామస్థులు ఆరోపించారు. ఈ కాలువ గరిష్ఠ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా, రెండు వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఆరోపిస్తున్నారు. కాగా, అలీసాగర్ రిజర్వాయర్‌కు చెందిన మూడు వరద గేట్లను పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇప్పటికప్పుడు గండిని పూడ్చివేసే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలివేస్తున్నారు. గ్రామంలోకి మరింతగా నీళ్లు చేరకుండా నలువైపులా మట్టి కట్టలు ఏర్పాటు చేసి ప్రవాహాన్ని కాల్వలోకి దారి మళ్లించారు.