ఆంధ్రప్రదేశ్‌

అసైన్డ్ భూముల్లో టిడిపి పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 26: రాజధాని ప్రాంతంలో రైతుల భూములపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం అసైన్డ్ భూములను చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.. అమరావతి నగర ప్రతిపాదిత గ్రామాల్లో వాగులు.. డొంక పోరంబోకు భూములు సుమారు 8 వేల ఎకరాల వరకు ఉన్నాయి.. వీటిని వౌలిక సదుపాయాలు.. పార్కులకు వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అధికార పార్టీ నేతలు బినామీ పేర్లతోముందుగానే భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కూడా కార్పొరేషన్‌కు సంబంధించిన స్థలంలోనే కారు చౌకగా లీజుకు కొనసాగిస్తున్నారు. ఇందులోనే రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ఏర్పాటుచేసి రాజధాని నిర్మితమైన అనంతరం పూర్తిస్థాయిలో శాశ్వతంగా ఆత్మకూరు గ్రామంలో నిర్మించేందుకు అనువైన స్థలం కోసం పరిశీలన జరిపారు. ఇందులో భాగంగా మంగళగిరి రూరల్ మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో వాగు పోరంబోకు స్థలం 3.78 ఎకరాలను స్వాధీనం చేయాల్సిందిగా తహశీల్దారుకు ఈ ఏడాది మార్చి 31వ తేదీన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు దరఖాస్తు సమర్పించారు. సాధారణంగా అసైన్డ్ ల్యాండ్‌కు సంబంధించి భూ కేటాయింపులు జరపాలంటే నెలలు.. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుంది. అయితే అధికార పార్టీ కార్యాలయానికి అందిన దరఖాస్తు కనుక అదేరోజున మంగళగిరి తహశీల్దారు కార్యాలయం నుంచి గుంటూరు ఆర్డీవోకు చేరింది. గత కొద్దిరోజులుగా తాత్కాలిక సచివాలయ పనులలో నిమగ్నమైన రెవెన్యూ అధికారులు మంగళవారం ఫైలును పరిశీలించి తగిన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇక మంత్రివర్గ సమావేశంలో ఆమోదింపజేసుకోవడమే తరువాయి. అయితే నిబంధనల ప్రకారం ఈ వాగులకు సంబంధించిన భూ లావాదేవీలు నిషేధం. అయితే నిబంధనలకు తిలోదకాలిచ్చి రెవెన్యూ అధికారులు స్వామిభక్తిని చాటుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ భూమిని గత 45 సంవత్సరాలుగా తాము అనుభవిస్తున్నట్లు గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, రఘురామారావు గుంటూరు జిల్లా కలెక్టర్ వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఈ సర్వే నెంబరుగల వాగు భూమికి మధ్యలో కాల్వ ఉంది. దీన్ని కూడా కలిపి తెలుగుదేశం కార్యాలయానికి కేటాయించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు చేసినట్లు తెలియవచ్చింది. రాజధాని ప్రాంతంలో 16వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలోనే ఆత్మకూరు గ్రామం ఉంది. గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ నగరాలు చేరువలో ఉన్నాయి. రాజధాని అమరావతికి కూడా అందుబాటులో ఉన్న ఈగ్రామంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే అటు పార్టీ కార్యక్రమాలు.. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు సులభతరం అవుతాయనే భావనతో ఈభూమిని ఎంచుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టుకు భూముల కేటాయింపులు జరుపుతున్నారు. విజయనగరం, కాకినాడలో ఎన్టీఆర్ ట్రస్టుకు భూములు ధారాదత్తం చేస్తూ గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు రాష్టప్రార్టీ కార్యాలయం సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. సుమారు రెండువేల చదరపు గజాల పై చిలుకు నగరపాలక సంస్థ స్థలంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన అనంతరం లీజుకు తీసుకోగా నగరపాలక సంస్థ ఆమోదంతో లీజు గడువును పొడిగించారు. రాజధాని ప్రాంతంలో భారతీయ జనతా పార్టీతో సహా మిగిలిన రాజకీయపక్షాలన్నీ ప్రైవేటు భూములను కొనుగోలు చేస్తున్నాయి. ఆత్మకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించనున్న భూమి విలువ కూడా కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజధాని అవుటర్, ఇన్నర్ రింగురోడ్లతో పాటు కనకదుర్గమ్మ వారధి వద్ద ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాలు పూర్తయితే ఈ భూముల విలువ అంచనాకు మించుతుందని చెప్తున్నారు. అమరావతి నిర్మాణాలతో పాటు అభివృద్ధికి సీఆర్డీయే పరిధిలో భూములు సమీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది.