తెలంగాణ

అభివృద్ధి అంతంతమాత్రం ( ఆదిలాబాద్ జిల్లా దత్తత ఉత్తిదే!6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 26: ప్రధానమంత్రి ఆదర్శ సంసద్ యోజన పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు గిరిజన గూడేలను దత్తత తీసుకున్నా ఆ గ్రామాల్లో అభివృద్ది ఛాయలు అంతంత మాత్రంగానే దర్శనమిస్తున్నాయి. రెండేళ్ల కిందటే దత్తత గ్రామాల అభివృద్ధి కోసం తూర్పు, పశ్చిమ పార్లమెంట్ సభ్యులు కంకణం కట్టుకోగా తమ కష్టాలు తీరినట్లేనని మురిసిపోయిన గిరిజనులు ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్ బోథ్ (ఎస్టీ) నియోజకవర్గంలోని అడవుల నడుమ విసిరేసిన విధంగా ఉన్న పట్నాపూర్ గ్రామాన్ని సరిగ్గా రెండేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆరు సార్లు ఈ గ్రామాన్ని చుట్టివచ్చిన ఎంపి నగేష్ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేక పోయారు. 1250 మంది జనాభా కలిగి ఉన్న పట్నాపూర్ ఏజెన్సీ గ్రామం పరిధిలో ఇన్‌కర్‌పల్లె, సుర్దాపూర్ అనుబంధ గ్రామాలు సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. గోండు, పర్దాన్ తెగలకు చెందిన ఆదివాసీలు అడవులను జీవనాధారంగా చేసుకొని జీవనం సాగిస్తుండగా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎంపి నగేష్ చేసిన బాసలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక్కడ రోగం, నొప్పి వస్తే 15 కిలోమీటర్ల దూరంలోని బోథ్ కేంద్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మూడేళ్ల కిందట ప్రభుత్వం రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం పురిటినొప్పులతో అసంపూర్తిగా పడి ఉంది. దీన్ని పూర్తిచేసి వైద్యసేవలు గిరిజనులకు అందుబాటులోకి తెస్తానని ఎంపి ఇచ్చిన హామీ ఏడాది గడిచినా అడుగు ముందుకు పడలేదు. పైగా ఈ గ్రామంలో అంతర్గత రోడ్లు లేక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పట్నాపూర్‌లో రూ.4లక్షల వ్యయంతో రక్షిత మంచినీటి ప్లాంట్‌ను ఎంపి ప్రారంభించగా కలుషిత నీటి సమస్య దూరమైంది. రూ.9లక్షల వ్యయంతో మూడు అనుబంధ గిరిజన గ్రామాలకు సిసిరోడ్లు వేయగా రూ.3లక్షల వ్యయంతో పంచాయతీ భవనాన్ని మంజూరి చేయించారు. అయితే వేసవిలో ఆరు బోరుబావులకు గాను మూడు చేతి పంపులు మాత్రమే పనిచేస్తుండడంతో ఏప్రిల్, మే నెలల్లో నీటి ఎద్దడి సమస్య ప్రజలను వేధించనుంది. మరో మూడు బోరు బావులు వేస్తే తమ సమస్యలు తీరుతాయని ఇన్‌కర్‌పల్లె, సుర్దాపూర్ గ్రామ గిరిజనులు పేర్కొంటున్నారు. పట్నాపూర్ గ్రామానికి సరైన రహదారి వ్యవస్థ లేకపోవడంతో గిరిజనులు నానా ఇక్కట్లు పడుతున్నారు. రూ.15లక్షల అంచనాతో రూపొందించిన రోడ్డు ప్రతిపాదనలు పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి.
27 ఏళ్లుగా సర్పంచు ఎరగని ‘గూడెం’
అది పేరుకే ఏజెన్సీ నోటిఫైడ్ గిరిజన గ్రామం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గోదావరి పక్కనే ఉన్న గూడెం గ్రామపంచాయతీలో 27 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు లేక ఎక్కడి సమస్యలు అక్కడే అన్న విధంగా పడి ఉన్నాయి. 2256 జనాభా ఉన్న గూడెం పంచాయతీని ఏజెన్సీ నోటిఫైడ్‌గా గుర్తించగా ఈ గ్రామంలో ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడంతో రిజర్వేషన్ కారణంగా ఎన్నికలు జరగడం లేదు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, అభ్యర్థి పోటీలో ఉండకపోవడంతో 27 ఏళ్లుగా ఈ గ్రామానికి సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలు జరగడం లేదు. అయితే ఈ గ్రామాన్ని ఉద్ధరించి ఆదర్శ సంసద్ యోజన కింద అభివృద్ధి పథంలో తీసుకవెళ్తానని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ ఉత్సాహంతో గూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2014 అక్టోబర్‌లో గూడెంను దత్తత కింద ఎంపిక చేసుకోగా ఎన్‌టిపిసి అధ్వర్యంలో రూ.46లక్షల వ్యయంతో పాఠశాల ప్రహారిగోడ, గ్రామంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించారు. పక్కనే గోదావరి నదీతీరం నుండి గూడెం వరకు 2.5 కిలోమీటర్ల దూరంలో పైపులైన్లు వేసి తాగునీటిని సరఫరా చేస్తుండగా రక్షిత మంచినీటి పథకం శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని పునరుద్ధరిస్తానని ఎంపి ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు.
రూ.10 లక్షల వ్యయంతో సోలార్ విద్యుత్ వ్యవస్థ గ్రామంలో వెలుగులు పంచుతోంది. గ్రామంలో సైడ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి గ్రామస్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామాన్ని ఎంపి బాల్క సుమన్ మూడుసార్లు పర్యటించి దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరితో ఒప్పందం కుదుర్చుకొని రూ.25లక్షల అంచనాతో అంతర్గత రోడ్లు మంజూరు చేస్తానని ప్రతిపాదనలు పంపినా నేటికి కార్యరూపం దాల్చలేదు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులు గిరిజన గ్రామాలపై మమకారంతో దత్తత తీసుకున్నా అభివృద్ది మూడడుగుల ముందుకు ఏడు అడగుల వెనక్కి అన్న చందంగా వెక్కిరిస్తోంది.