వరంగల్

జాతి చైతన్య దీప్తి అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, డిసెంబర్ 6: వరంగల్ హన్మకొండ కాజీపేటలలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 61 వర్థంతిని పురస్కరించుకుని పలు రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. భాజపా అర్బన్ జిల్లా కార్యాలయంలోబుధవారం అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ అధ్యక్షతన అంబేద్కర్ వర్థంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ దళితుల కోసమే పోరాడిన నాయకుడు కాదని, ఆయన జాతిని చైతన్య పరిచిన చైతన్య దీప్తి అని కొనియాడారు. రావుపద్మ మాట్లాడుతూ స్వాతంత్య్ర భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించి, రాజ్యాంగ నిర్మాతగా పేరు గడించిన అంబేద్కర్ గొప్ప ఆర్థిక వేత్త అని అన్నారు. బాలసముద్రంలోని అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు హన్మకొండ సాంబయ్య అధ్యక్షతన అంబేద్కర్ వర్థంతి సభ జరిగింది. రాష్ట్ర కార్యదర్శి పుల్లూరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం తపించిన జాతీయ నేత అంబేద్కర్ అని అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని నమ్మిన గొప్ప దార్శనికుడని, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే సిపిఎం అర్బన్ పార్టీ జిల్లా అధ్యక్షులు సారంపల్లి వాసుదేవరెడ్డి హన్మకొండలోని అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అనేక నిబంధనలు ఉన్నా, 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దేశం భూర్జవ పాలనలోనే గడిచిపోయిందని, దీంతో అస్పృశ్యత, కుల వివక్షను అంతమొందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ అర్బన్ జిల్లా కార్యదర్శి శిరబోయిన కరుణాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, సమాజంలోని నిమ్న కులాల సంక్షేమం కోసం రిజర్వేషన్లను ప్రవేశపెట్టి, వారిని అభివృద్ధి బాటలో నడిపిన గొప్ప సంఘ సంస్కర్త అని గుర్తుచేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం అహర్శిశలు పోరాడిన ధీశాలి అని తెలిపారు. ఆయన ఆలోచనా విధానాలను సీపీఐ ప్రజల్లోకి తీసుకుని వెళుతుందని అన్నారు. కాజీపేటలోని విష్ణుపురిలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు యాకుబీ అధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళా హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దురదృష్టవశాత్తు నేటి పాలకులు మహిళల పట్ల చిన్న చూపుచూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని అన్నారు. దూరవిద్యా కేంద్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలే ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని మల్లేశం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా ఎంఆర్‌పిఎస్, బిఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్, ఎంఇఎఫ్ విద్యార్థి సంఘాల అధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి సభలు నిర్వహించారు.

భూములు కోల్పోయిన
రైతులకు పరిహారం చెల్లిస్తాం
* జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా
మహబూబాబాద్, డిసెంబర్ 6: ఎస్సారెస్పీ కాల్వ, ఉప కాల్వ నిర్మాణంలో భూమిని కోల్పోయిన రైతులకు తగినంత నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు.
మహబూబాబాద్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని దంతాలపల్లి, మరిపెడ మండలాలకు చెందిన రైతులతో భూ నష్టపరిహార కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
దంతాలపల్లి మండలంలోని రేపోణి, గునె్నపల్లి రైతుల 4.14 ఎకరాల భూమికి, మరిపెడ మండలంలోని ఎల్లంపేట, తాళ్ల ఊకల్, గాలివారి గూడెం రైతులు కోల్పోతున్న 30 ఎకరాల భూమికి ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు అంగీకరించేలా తగినంత నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ఎస్సారెస్పీ కాల్వల, ఉప కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్సారెస్పీ ఇఇ శ్రీనివాస్‌రావు, ఆర్‌అండ్‌బి ఇఇ రాజేంద్రనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్, ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, సంబంధిత మండల తహశీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత ప్రమాణాలతో హోంగార్డుల సేవలు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 6: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా హోంగార్డులు ఉన్నత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నారని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ప్రశంసించారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 55వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డుల గౌరవవందనాన్ని కమీషనర్ స్వీకరించి కవాతును పరిశీలించారు. అనంతరం హోంగార్డులను ఉద్ధేశించి కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ పోలీసు శాఖలో నిరంతరం నిబద్ధతతో పనిచేస్తున్న పెరుగుతున్న జనాభా, దానికి అనుగుణంగా పెరుగుతున్న నేరాల కారణంగా హోంగార్డుల సేవలు మరింత అవసరమవుతున్నాయని అన్నారు. హోంగార్డుల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి, పోలీసు డైరెక్టర్ జనరల్ హోంగార్డుల గౌరవ వేతనాలను పెంచాలనే ప్రయత్నంలో ఉందని అన్నారు. హోంగార్డుల కోసం కమిషనరేట్ పరిధిలో విశ్రాంతి గృహం ఏర్పాటుచేయటంతోపాటు హోంగార్డుల పిల్లల వివాహాలకు పోలీసు కల్యాణ మండపాన్ని ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్లతోపాటు అన్ని సమయాల్లో, అన్ని వాతావరణాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఉచిత వైద్యపరీక్షలు జరిపిస్తున్నామని చెప్పారు. విద్యాసంస్థలలో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు హోంగార్డుల పిల్లలకు నాణ్యమైన విద్య లభించేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు తమ సమస్యలను తెలుపుకునేందుకు ప్రతి శనివారం తనను కలుసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన హోంగార్డులు బి.సదానందం, కృపాకర్, రమేష్, సుధాకర్, కుమార్, స్వామిలను పోలీసు కమీషనర్ సన్మానించారు.

బ్యాంకు సిబ్బంది అంటూ టోకరా
ఖాతాలోని రూ.17 వేలు మాయం
పరకాల, డిసెంబర్ 6: బ్యాంకు సిబ్బంది మాట్లాడుతున్నామని మీ ఏటిఎం రెన్యువల్ చేయాలని పిన్ నెంబర్, ఖాతా నెంబర్ చెప్పాలని ఫోన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడడంతో నమ్మిన బాధితుడు పిన్ నెంబర్, ఖాతా నెంబర్ చెప్పగానే అతని ఖాతాలో రూ. 17వేల డబ్బుల మాయం ఆయిన సంఘటన బుధవారం పరకాల పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పరకాల సీఐ జానీ నర్సింహులకు ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల పట్టణానికి చెందిన చందుపట్ల వెంకట్‌రెడ్డికి బుధవారం 917321023824 నెంబర్ నుండి ఫోన్ వచ్చినట్టు చెప్పారు. మీ ఏటిఎం కార్డును రెన్యువల్ చేస్తున్నామని మీ ఖాతా నెంబర్, మీ ఏటిఎం పిన్ నెంబర్ చెప్పాలని తాము బ్యాంకు సిబ్బందిని మాట్లాడుతున్నామని చెప్పారు. దీంతో నమ్మిన వెంకట్‌రెడ్డి తన ఖాతా నెంబర్, ఏటిఎం పిన్ నెంబర్ చెప్పినట్టు ఆయన తెలిపారు. తాను చెప్పిన గంటకు తన ఖాతాలో ఉన్న రూ. 17వేలు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చినట్లు చెప్పారు. దీంతో తాను కంగారు పడి వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయగా డబ్బులు డ్రా కాలేదని చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే మళ్లీ తనకు వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయగా ఫోన్ పనిచేయడం లేదని సమాధానం రావడంతో తాను కంగారు పడి ఖాతాను పరిశీలించగా తన ఖాతాలో రూ 17వేలు మాయం అయినట్లు చెప్పారు. తనకు న్యాయం చేయాలని ఆయన పరకాల సిఐ జానీ నర్సింహులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు చందుపట్ల వెంకట్‌రెడ్డి తెలిపారు.
నల్లబెల్లం పట్టివేత
కేసముద్రం, డిసెంబర్ 6: కేసముద్రం ఎక్సైజ్, పోలీసులు సంయుక్తంగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించేందుకు బుధవారం ఉదయం వెళుతుండగా ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు తనిఖీలు చేస్తుండగా ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషుల వద్ద 14 బస్తాల్లో ఏడు క్వింటాళ్ల నల్లబెల్లం, 25 కిలోల పటిక లభించింది. ఈ ఘటనకు పాల్పడ్డ ఒర్సు రాజు, కొండేటి సన్నీలను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
ఖానాపురం డిసెంబర్ 6: ధాన్యం బస్తాలలో కలిపి తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు బుధవారం పట్టుకున్న సంఘటన ఖానాపురం మండలంలోని కొత్తూరులో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తూరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నుండి 507 బస్తాల ధాన్యాన్ని లారీలో రవాణా చేస్తున్నారు. అయితే ధాన్యం బస్తాలలో రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయని సమాచారంతో ఎస్సై అభినవ్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసారు. ఈ క్రమంలో 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నర్సింహ అనై రైతును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధాన్యం బస్తాలలో రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న సంఘటన ఈ మధ్య కాలంలో ఇది రెండవది కావడం గమనార్హం. ఈ దాడుల్లో డీసీఎస్‌ఓ పీటర్, ఏఎస్‌ఓ పుల్లయ్య, ఆర్‌ఐ నవీన్, ఎఫ్‌ఐ జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళారీల ధాన్యం పట్టివేత
వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 6: గిరిజన రైతాంగం వద్ద నుండి తక్కువ ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్న దళారీల పై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. తక్కువ తూకంతో తడికట్టు విధానంతో బస్తాకు అధనంగా 5 కిలోలు వేసుకుంటూ రైతులను మోసం చేస్తున్న వైనంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు రావడంతో బుధవారం ధాన్యంతో కుడిన లారీ, వ్యాన్‌లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ధాన్యం లారీ, వ్యాన్‌ను రెవెన్యూ కార్యాలయానికి తరలించి, విచారణ నిర్వహిస్తున్నట్టు తహశీల్దార్ బిక్షం తెలిపారు.
ఆ దుర్మార్గులను ఉరి తీయండి
పరకాల, డిసెంబర్ 6: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గొరికొత్తపల్లి గ్రామంలో 7 సంవత్సరాల చిన్నారి రేష్మను అతి దారుణంగా హింసించి అత్యాచారం చేసి గొంతు నులుమి చంపి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యహరించిన దుండగులను బహిరంగంగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పరకాల పట్టణంలో టిజివిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరకాల బస్టాండ్ కూడలిలో విద్యార్థినీ, విద్యార్థులు చిన్నారి రెష్మకు ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా టిజివిపి జిల్లా అధ్యక్షులు ఇంగిళి వీరేష్‌రావు మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్నారిపై ఇలాంటి ఉదంతానికి పాల్పడిన దుండగులను తీవ్రంగా హింసించి ప్రజల మధ్య నడిరోడ్డుపై బహిరంగ ఉరి శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిజివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముసినిపల్లి శివప్రసాద్, టిజివిపి నాయకులు రాజ్‌కుమార్, ఆర్‌పి జయంతిలాల్, కానుగుల గోపినాథ్, బండి సారంగపాణి, నాగెల్లి రంజిత్‌కుమార్, కక్కు రాజు, గండ్ర జయపాల్‌రెడ్డి, సయ్యద్ గాలీఫ్, టిజివిపి నాయకులు హరిష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

మహాదేవపూర్, డిసెంబర్ 6: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల పరిధిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అకూనురి మురళితోపాటు మంథిని ఎమ్మెల్యే పుట్ట మధు బుధవారం మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతోపాటు కనె్నపల్లిలో నిర్మిస్తున్న పంప్‌హౌస్‌ల నిర్మాణం పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, కనె్నపల్లిలో నిర్మిస్తున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలించనునట్లు వారు తెలిపారు.

వైజ్ఞానిక ప్రదర్శనలతో పరిణతి పెంపు

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 6: విద్యార్థుల ఆలోచనా విధానంలో పరిణతితో కూడిన మార్పును, వికాసాన్ని తీసుకురావటానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ సూచించారు. విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక పరిణితి పెంపొందించటానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు. నగరంలోని లస్కర్ బజార్ ప్రభుత్వ అభ్యాసనోన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు మంచి వేదికలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచులను గమనించి వాటికి అనుగుణంగా ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని చెప్పారు. వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో జాతి ప్రయోజనాలు పరిరక్షించే శాస్తవ్రేత్తలుగా తయారవుతారని చెప్పారు.
సాంకేతిక ప్రతిభతో వైజ్ఞానిక రంగంలో విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. కాలుష్య నివారణ ద్వారా వాతావరణ పరిరక్షణకు విద్యార్థులు నడుం బిగించాలని కోరారు. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా శాస్త్ర, సాంకేతిక రంగాలలోని వాస్తవాలను విద్యార్థులు తెలుసుకోగలుగుతారని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను, అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికిదీయటానికి వైజ్ఞానిక ప్రదర్శనలు చక్కటి అవకాశమని అన్నారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో వివిధ అంశాలకు సంబంధించిన 500 ఎగ్జిబిట్‌లు రావటం విద్యార్థులలో ఉన్న ఉత్సాహాన్ని తెలియచేస్తుందని చెప్పారు. ప్రారంభ కార్యక్రమంలో విద్యావాఖ ఆర్‌జెడి రాజీవ్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా సైన్స్‌ఫేర్ అధికారి కేశవరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఒకే రోజు తల్లీ, కొడుకు ఆత్మహత్య
జనగామ, డిసెంబర్ 6: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వెరసి తల్లి, తనయుడి ప్రాణాలు మింగేశాయి. పరిష్కార మార్గం ఆలోచించే శక్తి లేక తనయుడు, కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేక తల్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన విషాద సంఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... కడవెండి గ్రామానికి చెందిన దొంటిక చిన్న అంజయ్య కుమారుడు దొంటిక శ్రీను(32), భార్య పార్వతమ్మ(55) గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల కారణంగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కొడుకు, తల్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అంజయ్య-పార్వతమ్మలకు ఒకకొడుకు (శ్రీను), పదవ తరగతి చదువుతున్న కూతురు ఉన్నారు. శ్రీనుకు 5సంవత్సరాల క్రితం ప్రమిలతో వివాహం జరుగగా వారికి ఓ కొడుకు, కూతురు జన్మించారు. తండ్రి అంజయ్య పేరున ఉన్న మూడెకరాల వ్యవసాయ భూమిలో పత్తి వేసి దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. ఆ అప్పులు తీర్చడంతో పాటు కూతురి పెండ్లి కోసం మూడెకరాల్లో ఒక ఎకరం భూమి అమ్మివేయాలని తల్లిదండ్రులు కొడుకు, కోడలును అడగగా వారు అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో గత నాలుగురోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తాయి. ఒకరికి ఒకరు మాట్లాడుకోకపోవడమే కాక ఇంట్లో వంట చేసుకోకుండా పస్తులుండే వరకు వెళ్లింది. ఈ బాధను భరించలేక శ్రీను వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తమ పత్తిచేనులో ఉన్న క్రిమి సంహారక మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుండి వెళ్లిన కొడుకు తిరిగి రాలేదని తల్లి పార్వతమ్మ బావి వద్దకు వెళ్లి పత్తిచేనులో మృతి చెందిన కొడుకు శవాన్ని చూసి బోరుమని విలపించింది. అప్పటివరకే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడకు చేరుకొని శ్రీను శవం వద్ద విలపిస్తుండగా తల్లి పార్వతమ్మ ఏడ్చుకుంటూ పశువులశాల వద్దకు వెళ్లి అందులో ఉన్న క్రిమి సంహారక మందు తాగి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తల్లి,తనయుడు ఒకే రోజు మృతి చెందడంతో కడవెండిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ గ్రామ ప్రజలే కాకా సమీప గ్రామాల ప్రజలు మృతదేహాలను సందర్శించి కంటనీరు కార్చారు. ఆర్థిక ఇబ్బందులతోనే తమ భార్య, కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారని తండ్రి చిన్న అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక నుంచి ఆన్‌లైన్‌లో లావాదేవీలు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 6: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రోజువారీ లావాదేవీలు ఇకనుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలను ఈ నెల 25వ తేదీలోగా కంప్యూటరైజేషన్ చేయాలని తెలిపారు. సహకార సంఘాల రికార్డుల కంప్యూటరీకరణ, రోజవారీ లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించటం తదితర అంశాలపై కలెక్టర్ పాటిల్ బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిఇఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ వరంగల్ జిల్లాలోని 69 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రికార్డులను వెంటనే కంప్యూటరైజేషన్ చేయాలని, ఈ కార్యక్రమం పూర్తయితేనే రోజువారీ లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించటానికి అవకాశం ఉంటుందని అన్నారు. సంఘాల వారీగా డేబుక్‌లను అప్‌డేట్ చేసి కంప్యూటరీకరణ చేయాలని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంఘాల సిఇఓలు సంఘాల లావాదేవీల కంప్యూటరీకరణపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. నూతన పద్ధతి అమలు విషయంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు రావచ్చని, వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలని అన్నారు. సహకార సంఘాల కంప్యూటరీకరణపై నిర్లక్ష్యం చేస్తే సహంచేది లేదని స్పష్టం చేసారు. జిల్లాలోని 27 సహకార సంఘాలలో కంప్యూటర్ ఆపరేటర్లు లేని విషయాన్ని సిఇఓలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా నాలుగు రోజులలో కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో టిఎస్‌సిఏబి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిఇఓ అంజయ్య, నాబార్డు డెవలప్‌మెంట్ మేనేజర్ కృష్ణమూర్తి, అర్బన్, రూరల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల సహకార శాఖ అధికారులు కరుణాకర్, పద్మ, పుల్లారావు, దేవదాసు, ఇందిర, మనోజ్‌కుమార్, డిసిసిబి డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేఖ, నోడల్ అధికారి పద్మ, రిజిస్ట్రార్ నీరజ తదితరులు పాల్గొన్నారు.

ఏడేళ్ల బాలిక రేష్మను కాలరాసిన నిందితుడు దొరికాడు

పక్కింటి వాడే హంతకుడు
భూపాలపల్లిరూరల్, డిసెంబర్ 6 : పక్కింటి వాడే పాత కక్షల పేరుతో చిన్నారి రేష్మను చిదిమి వేశాడు. విషయం తెలిసిన రేష్మ కుటుంబ సభ్యులు, బంధువులు కిరాతకుడు కనకం శివ ఇంటి పై దాడికి యత్నించారు. అప్పటికే శివను అరెస్టు చేసినట్టు తెలియడంతో రేగొండ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ సంఘాలు, గోరికొత్తపల్లి గ్రామస్థులు ధర్నాకు దిగారు. ధర్నాకు మద్దతుగా మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మూడు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల గోరికొత్తపల్లిలో 7 సంవత్సరాల చిన్నారి రేష్మను అతి దారుణంగా హింసించి అత్యాచారం చేసి గొంతు నులుమి చంపి వేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ఘోర సంఘటనకు కారకుడు కనకం శివగా గుర్తించారు. దీంతో కోపోద్రిక్తులైన రేష్మ బంధువులు బుధవారం కామాంధుని ఇంటిపై దాడి చేసే యత్నం చేశారు. శివ కుటుంబ సభ్యులను ఇంట్లో ఉంచి పోలీసులు తాళం వేశారు. అప్పటికే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా చేశారు. పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ఆరెస్టును ప్రకటించారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, గ్రామస్తులు, రేష్మ బంధువులు రేగొండ పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లి తమకు కిరాతకుడిని అప్పగించాలని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తు పరకాల-్భపాలపల్లి ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. మద్దతుగా పాల్గొన్న మాజీ చీఫ్ విప్, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి గండ్ర వెంకట రమణారెడ్డి, మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండ్ర జ్యోతి పాల్గొన్నారు. రాత్రి వరకు ధర్నా కొనసాగడంతో భూపాలపల్లి డిఎస్‌పి కిరణ్‌కుమార్ వచ్చి ధర్నా విరమింప చేయాలని కోరగా డిమాండ్ నేరవేర్చాలని పట్టుబట్ట్టారు. దీంతో డీఎస్పీ నిందుతుని ఉరి శిక్ష పడేలా కేసులు నమోదు చేసామని, చెప్పారు.

గిరిజన సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోని ప్రభుత్వం

నక్కలగుట్ట, డిసెంబర్ 6: రాష్ట్రంలోని గిరిజన, సాంఘీక సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో, హాస్టళ్లలో చదువుకునే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోత్ సంతోష్‌నాయక్ ఆరోపించారు. బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న విద్యార్థినాయకులకు, స్థానిక పోలీసులకు మద్య తోపులాట జరిగి కొంత సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు ధర్నాను విరమింపజేయగా, కార్యాలయంలో అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో డిటిడబ్ల్యుఓ అధికారి ఖాళీకుర్చీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్‌నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. చలికాలంలో విద్యార్థులు పడుకోవడానికి పక్క్భావనాలు లేక ఇబ్బందులు పడుతూ, పాడైన గదులలో ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం దుప్పట్లతో నానా ఇబ్బందులు పడుతూ చలికి వణుతూ అవస్థలపాల అవుతున్నా, అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తూ, యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ, ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలను గాలికి వదివేయడం వలన పేద, మద్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని మండిపడ్డారు. స్నానపుగదులు, మరుగుదొడ్లు, తాగునీరు, పక్క్భావనాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం విదేశీ అతిథులు, పండుగల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూసి, విసిగి మెడకు ఉరితాళ్లు బిగించుకుటుంటే, కేటీఆర్ మాత్రం మెడకు టై కట్టుకుని ప్రపంచమహిళా సదస్సులకు హాజరుఅవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనాప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, సందీప్, వీరన్న, శ్రావణ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం
శాయంపేట, డిసెంబర్ 6: శాయంపేట మండలంలో ఇటీవల మృతిచెందిన కుటుంబాలను బుధవారం టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సిరికొండ క్రాంతి కుమార్ పరామర్శించారు. బిసి కాలనీలో బాసాని మధుసుదన్, శివారు అరెపల్లి చెందిన ఎడ్ల విజయ కుటుంబసభ్యులను పరామర్శించి రూ:2వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. శాయంపేటకు చెందిన ఎండి రహీముద్దీన్ కుమార్తె వివాహానికి రూ: 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ముగిసిన రాష్ట్ర టగ్ ఆఫ్‌వార్ క్రీడోత్సవాలు

కురవి, డిసెంబర్ 6: టగ్ ఆఫ్ వార్‌ఓ ప్రాచీన క్రీడ అని, ఈ క్రీడ మూలాలు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా కనబడుతుందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు డిఎస్ రవిచంద్ర అన్నారు. కురవి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్జీఎఫ్ 63వ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ ఎంపిక క్రీడోత్సవాలు బుధవారం ముగిసాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడలు అధ్యంతం ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. పాఠశాల హెచ్‌ఎం జి.వెంకటయ్య అధ్యక్షతన జరిగిన క్రీడోత్సవాల ముగింపు సమావేశానికి డిఎస్ రవిచంద్ర ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...11వ శతాబ్దంలోనే ఈ క్రీడ ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయన్నారు. తాడు గుంజుడాట ఈ ప్రాంతంలో కొత్తదైన జాతీయ, అంతర్జాతీయ క్రీడగా వర్ణించారు. ఎంపిక క్రీడోత్సవాలలో గెలుపొందిన టీంలను అభినందిస్తూనే, ఓడిన జట్లు నిరుత్సాహ పడవద్దని రవిచంద్ర సూచించారు. నిర్వహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్జీఎఫ్‌ఐ బాధ్యులు ఒ.వెంకటయ్య, మాంకాళి వెంకటేశ్వర్లు, క్రీడాపోషకులు మేక దామోదర్‌రెడ్డిలను రవిచంద్ర అభినందించారు. ఎస్జీఎఫ్‌ఐ జిల్లా సెక్రటరీ ఓ.వెంకటయ్య మాట్లాడుతూ... అండర్-17, అండర్-19 విభాగంలో జరిగిన రాష్ట్ర స్థాయి టగ్ ఆఫ్ వార్ ఎంపిక క్రీడోత్సవాలలో ఎంపికైన క్రీడాకారులు దేశ రాజధాని ఢిల్లీలో జనవరి మొదటి వారంలో జరిగే జాతీయ స్థాయి క్రీడోత్సవాలలో పాల్గొంటారన్నారు.
అండర్-17 బాలికల విభాగంలో అదిలాబాద్ మొదటి స్థానం దక్కించుకోగా, హైదరాబాద్ రెండవ స్థానం, వరంగల్ మూడవ స్థానం, మెదక్ నాల్గవ స్థానం దక్కించుకున్నాయి. అండర్-17 బాలుర విభాగంలో వరుసగా హైదరాబాద్, వరంగల్, మెదక్, అదిలాబాద్, అండర్-19 బాలికల విభాగంలో హైదరాబాద్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, అండర్-19 బాలుర విభాగంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జట్లు నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పిఇటిలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.