తెలంగాణ

ఉవ్వెత్తున ఎగిసిన ఆదివాసీల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 9: గిరిజన పల్లెల్లో ఆదివాసీ, లంబాడీల మధ్య రగులుతున్న వివాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాజ్యాంగపరంగా ఎస్టీలకు సంక్రమించిన రిజర్వేషన్ ఫలాలను 90 శాతం వలస లంబాడాలే అనుభవిస్తూ ఆదివాసీ మూల జాతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివాసీ గిరిజనులు శనివారం హైదరాబాద్ మహాగర్జన సభకు భారీగా తరలివెళ్ళారు. గుజరాత్‌లో పటేళ్ళపోరును తలపించే విధంగా ఆదివాసీలు లక్షలాదిగా తరలివెళ్ళి బహిరంగ సభను విజయవంతం చేయడం, ఈ సభలోనే తమ హక్కుల కోసం నినదిస్తూనే వలస వచ్చి ఎస్టీ రిజర్వేషన్లు పొందుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేయడం ప్రభుత్వ యంత్రాంగాన్ని సందిగ్ధంలో పడేసింది. ఇంతకాలం ప్రశాంతంగా సాగుతున్న ఆదివాసీ పల్లెలు, గిరిజన తండాల్లోను వర్గపోరు ఉద్యమం చిచ్చురాజేయడంతో రెవెన్యూ అధికారులు సైతం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ‘మా ఊళ్లో మా రాజ్యం’ (మావ నాటే మావ రాజ్) అనే నినాదంతో రెండు నెలలుగా జిల్లాలో ఆదివాసి సంఘాలు, తుడుం దెబ్బ గ్రామసభ తీర్మానాలు చేస్తునే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉదృతంగా చేపట్టింది. లంబాడా ఉపాధ్యాయులు తమ బడులకు రావద్దంటూ గ్రామసభల్లో తీర్మానించి విధులకు రాకుండా అడ్డుపడుతున్నారు. అంతేగాక లంబాడాలు సాగుచేస్తున్న పంట చేనులోకి కూలీలుగా ఆదిమ గిరిజనులు వెళ్ళవద్దని తీర్మానం చేశారు. పాలేరులుగా ఇకపనిచేసేది లేదని ఆదివాసీలే తెగేసి చెప్పి పనుల నుండి విరమించుకున్నారు. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆదివాసి గిరిజనులు చేపట్టిన బహిరంగ సభ విజయవంతం కావడం, డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడంతో వీటిని సామరస్యంగా పరిష్కరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా పరిణమించింది. 1970 వరకు బిసి ఏలో ఉన్న లంబాడాలను రాష్టప్రతి ఆమోదం లేకుండా, పార్లమెంట్‌లో సైతం బిల్లు ప్రవేశపెట్టకుండా 1976లో కేంద్రం అత్యవసర పరిస్థితుల్లో లంబాడాలను డినోటిఫైడ్ ట్రైబ్స్‌గా జాబితాలో చేర్చారని, దీనివల్ల అడవుల్లోనే పుట్టి కుమురంభీం ఆశయాల స్పూర్తితో జీవనం సాగిస్తున్న ఆదివాసి గిరిజనుల రిజర్వేషన్లు, భూమిపై హక్కు పట్టాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని తుడుం దెబ్బ నాయకులు వాదిస్తున్నారు. ఆదివాసీల రిజర్వేషన్లు, వారికి కేటాయించిన బడ్జెట్‌ను తాము వాడుకోవడం లేదని, రెండు తెగలకు చెందిన బడ్జెట్ కేటాయింపులపై లెక్కలు తీస్తే తెలిసిపోతుందని, రాజ్యాంగపరంగానే తాము రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామని లంబాడా తెగల నేతలు పేర్కొంటున్నారు. మహారాష్టల్రో బీసీలుగా, రాజస్థాన్‌లో ఓసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా చెలామని అవుతున్న లంబాడాలు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల కోసమే వలసవచ్చి తమ హక్కులను హరిస్తున్నారని, ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఉద్యమం ఆపేది లేదని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు ఆంధ్రభూమితో పేర్కొన్నారు. రాజకీయ ప్రజా ప్రతినిధులు సైతం పార్టీలను పక్కనపెట్టి కుమురంభీం వారసులుగా తమ హక్కుల కోసం కలిసిరావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
13న లంబాడాల ఆత్మగౌరవ సభ
హైదరాబాద్ సరూర్ నగర్‌లో ఆదివాసి గిరిజన సభ విజయవంతం కావడంతో లంబాడాలు సైతం పోటాపోటీగా బల ప్రదర్శన కోసం ఈనెల 13న హైదరాబాద్‌లోని అదే మైదానంలో ఆత్మగౌరవ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు సైతం బహిరంగ సభ అనుమతి ఇవ్వగా ఆదిలాబాద్ జిల్లా నుండే కాక మహాబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుండి నాలుగు లక్షల మంది లంబాడాలను తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం లంబాడా తండాల్లో భారీ ఎత్తున సన్నాహాలు సాగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీ జాబితాలోనే కొనసాగుతూ తమ హక్కులను కాపాడుకుంటామని బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్ ‘ఆంధ్రభూమి’కి వివరించారు.
ఏదేమైనా ఇరువర్గాల మద్య రాజుకున్న వర్గపోరు ఉద్యమంలా ఎగిసిపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు పోలీసులకు ఈ వ్యవహారం మరింత టెన్షన్ రాజేస్తోంది.
చిత్రం..శనివారం నిర్వహించిన ఆదివాసీల ఆత్మగౌరవ సభకు వివిధ జిల్లాలనుంచి
తరలివచ్చిన అడవిబిడ్డలతో కిక్కిరిసిన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం