రాష్ట్రీయం

కాల్‌మనీ నిందితులపై ‘నిర్భయ’ కేసులు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: విజయవాడ కేంద్రంగా రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారాన్ని ఏఒక్కరూ కూడా రాజకీయ కోణంలో చూడరాదని బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జ్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. వడ్డీ సొమ్ము బకాయిదారులపై లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడిన వారందరిపై నిర్భయ చట్టం కింద తక్షణం కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. అతి సామాన్యులు, చిరువ్యాపారులెవరూ వడ్డీ వ్యాపారుల బారిన పడరాదనే సదుద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీ జన్‌ధన్ యోజన పథకాన్ని, ముద్రా బ్యాంక్‌ను నెలకొల్పారన్నారు. అత్యవసరాల కోసం ఇతరుల వద్ద చేయి చాపరాదనే లక్ష్యంతో బ్యాంక్ ఖాతా కలిగిన వారందరికీ రూ.5వేల వరకు ఓడీ సదుపాయాన్ని కల్పించారన్నారు. ముద్రా బ్యాంక్ ద్వారా ఇప్పటికి దాదాపు రూ.80లక్షల మంది చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.58వేల వరకు రుణ సదుపాయం లభించిందన్నారు. రాజ్యసభలో జిఎస్‌టి వంటి ఎంతో కీలకమైన 16 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశాభివృద్ధి కోసమే జిఎస్‌టి బిల్లును ప్రభుత్వం ముందుకు తెచ్చిందని ఆమె చెప్పారు. ప్రజాసామ్య వ్యవస్థలో మంచీచెడు చర్చించుకుని అవసరం మేరకు చట్టాలను చేయడానికే చట్టసభలున్నాయని, ఆర్డినెన్స్‌లతో ఈ దేశాన్ని పాలించాలనే కోర్కె బిజెపికి లేదన్నారు. నిర్భయ కేసులో బాల నేరస్థుడు కావటంతో ఒక దోషి మరణశిక్షను, అలాగే జీవిత ఖైదును కూడా తప్పించుకుని జైలు నుంచి బైటకు రాగలిగాడని పురంధ్రీశ్వరి అన్నారు. అందుకే బాలనేరాల చట్టాన్ని సవరించడానికి బిజెపి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, ఇతర విపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. జ్యోతిసింగ్‌పై జరిగిన అమానుష హింసలో ఈ బాలనేరస్థుని పాత్ర ఎక్కువగా ఉందని, అయితే అప్పటికీ 18ఏళ్లకు కొద్దిమాసాలు తక్కువగా ఉండబట్టి సంస్కరణ గృహంలో మూడేళ్లపాటు ఉంచి నేడు విడుదల చేశారన్నారు. కాలమాన పరిస్థితుల్లో పిల్లల్లో ఎక్స్‌పోజ్, మేథోపరిమితి పెరుగుతుందని వారిలో నేరప్రవృత్తి కూడా పెరుగుతున్నందనే బాలనేరస్థుల వయస్సు పరిమితిని 18నుంచి 16ఏళ్లకు కుదించేందుకు బిజెపి చట్టసవరణ కోసం బిల్లును తీసుకొస్తే విపక్షాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిజెపి అనుకూలంగా ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మిత్రపక్ష బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ రెండు పార్టీల నేతలు కూర్చొని సర్దుబాటు చేసుకుంటున్నారని చెప్పారు. అలాగే నామినేటెడ్ పదవులపై కూడా చర్చిస్తున్నామని పురంధ్రీశ్వరి వివరించారు. విలేఖర్ల సమావేశంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీ రాణి, ఐటి విభాగం ఇన్‌చార్జి జోగులాంబ, తదితరులు పాల్గొన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న పురంధ్రీశ్వరి