తెలంగాణ

‘టోల్’ సిబ్బందిపై ఎమ్మెల్యే శోభ దంపతుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, డిసెంబర్ 12: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రాజీవ్ రహదారిపై రేణికుంట గ్రామ శివారులోగల టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, ఆమె భర్త గాలయ్యతోపాటు గన్‌మెన్‌లు వీరంగం సృష్టించారు. ఈ వీరంగంపై తీసిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సంచలనం రేపుతోంది. దాడికి గురైన సిబ్బంది పంబాల రాజు, జీవన్ కథనం ప్రకారం... కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్‌ప్లాజా వద్ద ఉదయం చొప్పదండి ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్తుండగా, ప్లాజా వద్ద వాహనాలు అధికంగా నిలిచి ఉండడంతో వీఐపీలను గుర్తించి ముందుగా పంపించివేయాలని తెలియదా? అంటూ ఎమ్మెల్యే శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ డ్యూటీ తాము చేస్తున్నామని సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యే సిబ్బంది రాజు, జీవన్‌లపై చేయిచేసుకున్నారు. వాహనం నుంచి గన్‌మెన్‌లు దిగడంతో వారు కొడతారనే భయంతో ఆ ఇద్దరు సిబ్బంది పరుగెత్తగా, శోభ భర్త గాలయ్య వారి వెంటపడ్డారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీయగా, ఆ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనతో ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులతోపాటు కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి, సీఐ కరుణాకర్‌రావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. టోల్‌ప్లాజా ఇన్‌చార్జి విజయభాస్కర్ రెడ్డితో మాట్లాడి సీసీ ఫుటేజీలను ఏసీపీ పరిశీలించారు. అనంతరం ప్లాజా వద్ద ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. కాగా, ఈ సంఘటన తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు టోల్ ప్లాజా వద్దకు చేరుకొని దళిత ఎమ్మెల్యేను గుర్తించి ప్రత్యేకమైన ద్వారం ద్వారా పంపించే బాధ్యత మీకు లేదా? అంటూ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రశ్నించడం గమనార్హం. ఈ ఘటనపై సంబంధిత సీఐ కరుణాకర్‌రావును వివరణ కోరగా, సాయంత్రం ఏడు గంటల వరకు కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి రికార్డు అయిన వీడియో దృశ్యాలు బయటకు రావడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయ.
కాగా, క్రమశిక్షణతో, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఓ వైపు టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చెబుతున్నప్పటికీ, పలువురు ఆ పార్టీ నేతలు తమదైన శైలిలో అధికారంతో జులుం చూపిస్తుండడంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఎమ్మెల్యే దంపతుల దాడి ఘటన కూడా మరోసారి ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.