తెలంగాణ

ఊపందుకున్న ‘కుల’ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సుమారు 18 నెలల గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కుల రాజకీయాలు ప్రారంభించాయి. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యాదవులతో భేటీ కావడం, వారికి వరాల జల్లు కురిపించడం తెలిసిందే. యాదవుల నుంచి రాజ్యసభ స్థానం ఇస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తున్నది. తాము తిరిగి అధికారంలోకి వస్తే అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి ఏమి చేస్తామో వచ్చే ఎన్నికల ప్రణాళికలో ప్రకటించేందుకు వీలుగా కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఎస్‌సి, ఎస్‌టి, బిసి నేతలతో విడివిడిగా కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నది. ఇలాఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్ యాదవుల నుంచి ఒకరికి రాజ్యసభ సీటు ఇస్తామనడం బిసిల్లోని ఇతర కులాలను అసంతృప్తికి గురి చేసినట్లే అవుతుందని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. ఎందుకంటే టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఫలానా కులానికి ఇచ్చినట్లు చెప్పడం వేరు అవుతుంది కానీ ముందుగానే ఫలానా కులానికి ఇస్తామని చెబితే మిగతా కులాల్లో అసంతృప్తులు ఆరంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలాఉండగా గొల్ల, కురుమలకు, యాదవులకు పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించగానే మున్నూరు కాపులు ఏకమయ్యారు. శాసనమండలి (కౌన్సిల్) డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ రావు నేతృత్వంలో బుధవారం మున్నూరు కాపు నేతలు, కార్యకర్తలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నేతలు కెకే, డిఎస్, కాంగ్రెస్ నుంచి విహెచ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కులాల వారీగా ఓటు బ్యాంకు తయారు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. బుధవారం విద్యాసాగర్ రావు నివాసంలో జరిగే సమావేశానికి విహెచ్‌ను ఆహ్వానించడంతో ఆయన వెళ్ళారు. ఆ సమావేశానికి హాజరయ్యే ముందు విహెచ్ టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళి కొంత సేపు చర్చించారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే ‘రెడ్డి’ సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న వాదన ఉంది కాబట్టి, దానిని తొలగించుకునే ప్రయత్నం చేయాలని విహెచ్ ఆయనతో అన్నారు. అందుకు ఉత్తమ్ స్పందిస్తూ ఆ భావన ఉండవచ్చు కానీ కాంగ్రెస్ ఎప్పుడూ అణగారిన వర్గాలకు పెద్ద పీట వేసిందని చెబుతూ పలు ఉదాహరణలు చెప్పారు. రాబోయే ఎన్నికలలోగా తామూ సభలు, సమావేశాలూ నిర్వహించాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమానికి ఏమి చేస్తామో చెప్పాలని వారిరువురు ఈ సందర్భం చర్చించినట్లు సమాచారం. అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా వారు భావించారు. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, భవిష్యత్తులో కూడా బిసిలకు, ఇతర కులాలకు ఇచ్చిన హామీలు ఏవీ ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ప్రజల్లో ఎండగట్టేందుకు కాంగ్రెస్ వ్యూహా రచన చేస్తున్నది.
‘గర్జన’ల హోరు..!
ఇలాఉండగా బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో లంబాడ గర్జన సభ జరిగింది. రెండు రోజుల క్రితం బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన బిసి గర్జన జరిగింది. కృష్ణయ్య అధ్వర్యంలో బుధవారం నిరుద్యోగుల గర్జన సభ జరిగింది. ఇలా కుల సంఘాల సభలు, సమావేశాలతో పలు పార్టీల నేతలు బిజీగా ఉన్నారు.