తెలంగాణ

దళితుల శిరోముండనం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో దళితుల శిరో ముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు ఇవ్వకుండా హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ సంఘటన 1997లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఈ కేసులో బాధితులు కోటి చినరాజు మరో ఇద్దరు తాము ఎస్సీ వర్గానికి చెందినవారమని, రెవెన్యూ అధికారులు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. గతంలో హైకోర్టు రెవెన్యూ అధికారులు పిటిషనర్లకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇవ్వాలని, అలాగే ఈ ధృవపత్రాల వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సాక్ష్యం కింద ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు ఈకేసును కోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున ఏ సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుల ధృవీకరణ పత్రాలను విచారణ కోర్టుకు ఇవ్వలేదన్నారు. రాజకీయ వత్తిళ్ల వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ ధృవపత్రాలను కోర్టుకు ఇవ్వలేదన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉన్నారన్నారు. ఈ కేసులో కుల ధృవపత్రాలు కీలకమైనవన్నారు. ఈ ధృవపత్రాలు ఇవ్వని పక్షంలో విచారణ కోర్టు ఎదుట కేసు నిలబడదన్నారు. ఈ సందర్భంగా నిందితుడు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తరఫున న్యాయవాది చిదంబరం వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా, బాధితుల తరఫున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కులధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా వాదనలు చేశారని, దీంతో విచారణ కోర్టు ఈ నెల 14వ తేదీన తీర్పు వెలువరిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అనంతరం విశాఖపట్నం 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసుపై తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తీర్పును వెలువరించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసింది.

27లోగా నివేదిక ఇవ్వండి

హైదరాబాద్, డిసెంబర్ 13: టిఆర్‌ఎస్ ప్లీనరీ నిమిత్తం ఆ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులు నిదులు వసూలు చేశారనే అభియోగంపై ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి ఇంతవరకు తీసుకున్న చర్యలపై ఈ నెల 27వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ఏసిబి డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. ఈ సందర్భంగా బుధవారం అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌ను ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నుంచి ఏసిబికి ఆగస్టు 9వ తేదీన అందిందని, దీనిని రిజిస్టర్‌లో నమోదు చేశారని, ఈ దరఖాస్తులో ప్రత్యేకమైన ఆరోపణలు ఏమీ లేవని, ఈ అభియోగాలపై ఏసిబి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, మంత్రులు పార్టీ కోసం నిధులు వసూలు చేయడం అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7,11,13 కింద వస్తుందని, సెక్షన్ 120 బి కింద ఇది నేరమని కోర్టుకు తెలిపారు. ఆగస్టు 9వ తేదీన ఏసిబికి దరఖాస్తు వచ్చినందున ఈ కేసుపై ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఏసిబిపై ఉందన్నారు. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించే హక్కు ఉందని, పిటిషనర్ కూడా పార్టీ కోసం నిధులు వసూలు చేసినట్లు పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసు ఒక నేరంగా పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే విషయమై రెండు వారాల గడువు ఏసిబికి కావాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ కేసుపై ఏసిబి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలని కోర్టు పేర్కొంది. అనంతరం డిసెంబర్ 27వ తేదీలోపల ఏసిబి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

2018లో కోర్టులకు వర్తించే ప్రభుత్వ సెలవులు ఇవే
ప్రకటించిన హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టు 2018 సంవత్సరానికి వర్తించే కోర్టుల సెలవులను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో రెండు రాష్ట్రాల్లోని కోర్టులన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. సంక్రాంతి సెలవులు జనవరి 8 నుంచి 17 వరకు, వేసవి సెలవులు మే 3 నుంచి జూన్ 1 వరకు, దసరా సెలవులు అక్టోబర్ 15 నుంచి 19 వరకు ఉంటాయని తెలిపింది. ఇక సాధారణ సెలవుల విషయానికొస్తే జనవరి 1 కొత్త సంవత్సరం, ఫిబ్రవరి 13 మహాశివరాత్రి, మార్చి 26 శ్రీరామ నవమి, మార్చి 30 గుడ్‌ఫ్రైడే, జూన్ 16 రంజాన్, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 22న బక్రీద్, సెప్టెంబర్‌లో 3న శ్రీకృష్ణ అష్టమి, 13న వినాయక చవితి, 21న మొహర్రం, అక్టోబర్‌లో 2న గాంధీజయంతి, 9న బతుకమ్మ పండుగ ప్రారంభం, 17న దుర్గాష్టమి, 18న విజయదశమి, నవంబర్‌లో 7న దీపావళి, 21న ఈద్ మిలాద్ ఉన్ నబి, 25న క్రిస్మస్ పండుగ రోజుల్లో సాధారణ సెలవులు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. వీటితో పాటు మరికొన్ని ఐచ్ఛిక సెలవులను కూడా హైకోర్టు వెల్లడించింది.