తెలంగాణ

ప్రబంధం పుట్టిందే తెలంగాణ గడ్డపై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలుగు ప్రబంధం పుట్టిందే తెలంగాణ గడ్డపైనేనని, చాలా మంది అల్లసాని మనుచరిత్రను ప్రామాణికంగా తీసుకుంటారని, వాస్తవానికి తెలంగాణకు చెందిన తెరిగొండ ధర్మన్న 1505లోనే చిత్ర భారతం అనే ప్రబంధాన్ని రాశారని గురిజాల రామశేషయ్య పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు యూనివర్శిటీలో బిరుదురాజు రామరాజు ప్రాంగణం సామల సదాశివ వేదికపై జరిగిన తెలంగాణ పద్యకవితా సౌరభం సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు ఆచార్య అనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జగదీష్‌రెడ్డి గౌరవ అతిథిగా బేతవోలు రామబ్రహ్మం హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ కావ్యాలు- దేశీయతపై డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, కావ్యాల్లో పద్య కవితా వైశిష్ట్యంపై తూర్పు మల్లారెడ్డి, తెదలంగాణ ప్రబంధాలపై గిరిజాల రామశేషయ్య, ఆధునిక పద్యకవిత- సామాజికత అంశంపై డాక్టర్ డాక్టర్ గండ్ర లక్ష్మణ్‌రావు ప్రసంగించగా, కార్యక్రమానికి సమావేశ కర్తగా గంభీర్ మనోహర్‌రావు, సమన్వయకర్తగా గంప ఉమాపతి వ్యవహరించారు.
తొలుత సభకు అధ్యక్షత వహించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ పాల్కురికి సోమనాధుడు శివకవి యుగానికి చెందిన మహా తెలుగు కవి అని అన్నారు.ఈ యుగానికి చెందిన ‘శివకవిత్రయం’ అనే ముగ్గురు ముఖ్య బ్రాహ్మణ కవుల్లో ఇతనొకడని, తక్కిన ఇద్దరూ మల్లిఖార్జున పండితారాధ్యుడు, ననే్నచోడుడని వివరించారు. సోమనాధుడు వరంగల్ సమీపంలోని పాల్కురికి గ్రామానికి చెందిన వారని , జన్మతహా బ్రాహ్మణుడైనా వీరశైవ మతంపై అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడని అన్నారు. ఇతడి గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ దర్మశాస్త్రాలు నేర్చుకున్నారని సాహిత్యంలో తెలుగు భాషా పదాల వాడకం శివకవి యుగంలోనే పెరిగిందని అన్నారు. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు చందస్సును విరివిగా వినియోగించాడని, ‘రగడ’ అనే చందో రీతిని ఆయనే ప్రారంభించారని చెప్పారు. సోమనాధుడు ప్రారంభించిన రగడను బసవ రగడ అంటారని, ద్విపత, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదాలు, వన మయూరం, చతుర్విద కందం, త్రిపాస కందం వంటి స్థానిక చందోరీతుల ప్రయోగం చేశారని అన్నారు.
ఈ సందర్భంగా బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ ప్రౌఢ పద్యకావ్యాలు నేడు దొరకడం లేదని, పునర్ముద్రణ ఇప్పటికైనా జరగాలని అన్నారు. ఇప్పటికే పద్యం కాలగర్భంలో కలిసిపోతోందని, దానిని అర్ధం చేసుకునేవారు, అర్ధం చెప్పేవారు తగ్గిపోతున్నారని వాపోయారు. ఆధునిక భావం పద్యానికి పనికిరాదనే వాదన సరైంది కాదని చెప్పారు.
డాక్టర్ సంగనభట్ల నర్సయ్య మాట్లాడుతూ హాలుడు కృతికర్తగా వెలువడిన గాథాసప్తశతిలో ప్రాకృత గాథల సంకలనమని అన్నారు. తెలుగుదేశపు ప్రజల ఆచార వ్యవహారాలు ఈ గ్రంథంలో ప్రతిబింబించాయని గుర్తుచేశారు. లీలావతి కావ్యం సైతం సామాన్య జనజీవనంలో మరో పార్శ్వాన్ని ప్రతిబింబించిందని అన్నారు. 3వేల ఏళ్ల క్రితమే సంకలనాలు ఉన్నాయని ఈ గ్రంథాలు రుజువు చేశాయని, అలాగే సింధునాగరికత నుండే ఘనమైన సంస్కృతి శిలాశాసనాల్లో ఉందని పేర్కొన్నారు. తొలి శిలాకావ్యాలు నగునూరులో వెల్లంకి గంగాధరుడు రాసింది ఉందని, అలాగే ఉరుసుగుట్ట వద్ద కూడా శిలా కావ్యాలున్నాయని చెప్పారు.
డాక్టర్ తూర్పు మల్లారెడ్డి మాట్లాడుతూ కావ్యాల్లో పద్య కవితా వైశిష్టం మహోన్నతమైనదని అన్నారు. పద్యాలు నేర్చుకుంటేనే గేయసాహిత్యానికి తోడ్పడుతుందని వివరించారు. గురిజాల రామశేషయ్య మాట్లాడుతూ అల్లసాని మనుచరిత్ర తొలి ప్రబంధం కాదని పేర్కొన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఆధునిక పద్య కవితకూ తెలంగాణ సామాజికతకు సంబంధం ఉందని అన్నారు. గోలకొండ కవుల సంచిక నుండి ఆధునిక కవిత్వం ఉందని చెప్పవచ్చని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పద్యం పుట్టిందని ఆనాటి కవితా సంచికలో భిన్నమైన రచయితలు రాసిన కవితలు చూస్తే తెలుస్తుందని అన్నారు.
చిత్రం..తెలుగు మహా సభల వేదికపై మంత్రి జగదీశ్‌రెడ్డిని శాలువా కప్పి సన్మానిస్తున్న దృశ్యం