తెలంగాణ

క్రమబద్ధీకరణ ఓ ఫార్సేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు ఇతర నిర్మాణాలు చేసుకున్న వారికే వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన జీవో 59 ఇంకా బాలారిష్టాలను అధిగమించలేకపోతుంది. నామామాత్రపు రుసుంతో ఆక్రమితదారునికే వాటిపై హక్కులు కల్పించేందుకు జారీ చేసిన జీవో 59కు అధికారుల వక్ర బాష్యాల వల్ల ప్రభుత్వ సద్దుదేశం నెరవేరకుండా పోతుంది. పైగా జీవోలో పేర్కొన్నట్టుగా కాకుండా మరోరకంగా జారీ చేస్తున్న క్రమబద్ధీకరణ పత్రాలు దమ్మిడీకి చెల్లని విధంగా ఉంటున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకున్న వారినుంచి రిజిస్ట్రేషన్ విలువలో వెసులుబాటు రుసుం వసూలు చేసి వాటిని క్రమబద్ధీకరించనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. ఒకేసారి రుసుం చెల్లించిన వారికి వాటిపై భూ హక్కులు కల్పించే విధంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుందని జీవోలో పేర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా తాజాగా మీ సేవా కేంద్రాలలో జారీ చేసే ధ్రువీకరణ పత్రాలతో వీటిని సరిపెట్టాలని భూ పరిపాలన కమిషనర్ (సిసిఎల్‌ఏ) నిర్ణయం తీసుకుంది. అయితే అలా చేయడం వల్ల ఈ పత్రాలకు ఏమాత్రం విలువ ఉండదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
ప్రభుత్వానికి లక్షల రూపాయలు చెల్లించి ఇక రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయంటూ ఎదురు చూస్తున్న 59 జీవో దరఖాస్తుదారులకు ఉన్నతాధికారులు చుక్కలు చూపిస్తున్నారు. తెలంగాణలో 2014 డిసెంబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 59 ప్రక్రియను మూడు నెలల్లో ముగించాల్సి ఉండగా, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా జాప్యం చేయడంపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ జీవోకు లోబడి క్రమబద్ధీకరణకు 48,915 మంది దరఖాస్తుదారుల్లో 17,891 మంది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అర్హులుగా గుర్తించి క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించారు. అయితే 5శాతం రాయితీతో మొత్తం చెల్లింపులు చేసిన లబ్దిదారులకు గత ఆరు నెలలుగా సాంకేతిక కారణాలంటూ కనీసం సమాధానం చెప్పకుండా రేపు మాపు అంటూ రిజిస్ట్రేషన్ చేస్తామని రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారే తప్ప సరైన సమాధానం చెప్పటం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు చెల్లించి ఏడాది గడుస్తున్నా ఇటు రిజిస్ట్రేషన్లు కాక, అటు ప్రైవేటు రుణభారం పెరిగి ఆర్థికంగా క్షీణించి ఉన్న ఇల్లును అమ్ముకునే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ వాపోతున్నారు.
క్రమబద్ధీకరణ పత్రాలను మాన్యువల్‌గా కన్వీనియెన్స్ డీడ్‌లు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినప్పటికి సిసిఎల్‌ఎ అధికారులు ఆన్‌లైన్‌లోనే చేస్తామంటూ మొండికేసి కూర్చోవడం, అలాగే 100 రూపాయల బాండ్ పేపర్‌పై చేయాల్సిన రిజిస్ట్రేషన్లను కేవలం మీసేవా పత్రాలపై కన్వీయెన్స్ డీడ్‌లు జారీచేయనున్నట్టు చేసిన ప్రకటన దరఖాస్తుదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అలా చేయడం వల్ల వీటికి బ్యాంకులు కూడా రుణసౌకర్యం కల్పించే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలోనే మీ సేవ పత్రాలపై కన్వీనియెన్స్ డీడ్‌లు జారీచేస్తున్నారని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తెల్ల కాగితంపై దస్తావేజులు చేయించి రిజిస్ట్రేషన్ చేసినా విలువుంటుందే తప్ప మీ సేవ పత్రాలపై ఇస్తే వాటికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు చెబుతున్నారు. జీవో 59లో పొందుపరిచిన విధంగా రిజిస్ట్రేషన్లు చేయకపోవడం వల్ల దరఖాస్తుదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రెవిన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందిస్తే తప్ప జీవో 59 దరఖాస్తుదారులకు మేలు కలిగే అవకాశం లేదని వారు కోరుతున్నారు.

జాల రాధాక్రిష్ణ